రాష్ట్రంలో 439కి చేరిన కరోనా కేసులు
సోమవారం గుంటూరు జిల్లాలో అత్యధికంగా పాజిటివ్
దీంతో ఆ జిల్లాలో 93కి చేరిన పాజిటివ్ కేసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 439కి చేరింది. గుంటూరు జిల్లాలో సోమవారం కొత్తగా 11 కేసులు నమోదు కావడంతో.. ఆ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 93కి చేరింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 866 శాంపిల్స్ పరీక్షించారు. అందులో 847 శాంపిల్స్‌కు నెగిటివ్ ఫలితం రాగా, 19 శాంపిల్స్ పాజిటివ్‌గా తేలాయి.
సోమవారం నమోదైన కేసుల్లో గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా ఉన్నాయి. నెల్లూరులో 4, చిత్తూరులో 2, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,755 శాంపిల్స్ పరీక్షించగా.. 8,316 నెగిటివ్‌గా, 439 పాజిటివ్‌గా నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకున్న 12 మంది డిశ్చార్జ్ కాగా, ఏడుగురు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్స పొందుతున్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 420గా ఉంది.