ఈ చదువు నా వల్ల కావట్లేదు

20 Jan, 2014 02:59 IST|Sakshi
ఈ చదువు నా వల్ల కావట్లేదు

‘నాకు బీఏ చదవాలని ఉంది. తల్లిదండ్రులు ఎక్కువగా ఆశించారు. నా వల్ల కావడం లేదు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. క్షమించండి’          -శ్వేత
 
 విశాఖపట్నం, న్యూస్‌లైన్:
తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు.. కొడుకు ఇంజినీరింగ్ చదువుతున్నాడు.. కూతురును కూడా అలాగే ఉన్నత చదువు చదవాలంటూ బలవంతం పెట్టారు. తల్లిదండ్రుల మాట కాదనలేక రెండుసార్లు అందుకోసం ప్రయత్నించి విఫలమైంది. ఆ తరువాత కూడా తనకు ఇష్టంలేని చదువులోనే జాయిన్ అయింది. తనకు ఉన్న జ్ఞానం కంటే ఎక్కువ చదవలేనంటూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కేశబోయిన శోభనాద్రి వాణిజ్యపన్నుల శాఖలో సహాయ కమిషనర్, భార్య ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో వైద్యురాలు. వారి కూతురు శ్వేత(19) బీఏ చదవాలని అనుకుంది. కానీ, తల్లిదండ్రులు మాత్రం ఆమెను ఐఐటీ చదవించాలని ఆశించారు. వారి కోరిక మేరకు శ్వేత రెండుసార్లు ఐఐటీ జేఈఈ ఎంట్రన్స్ రాసినా ఎంపిక కాలేదు. దీంతో ఒత్తిడికి గురై మానసికంగా కుంగిపోయింది.
 
  కుమార్తె స్థితిని గమనించి శోభనాద్రి ఆమెకు హైదరాబాద్‌లో ఓ సైకాలజిస్ట్ వద్ద రెండేళ్లపాటు చికిత్స అందించారు. ఆ తరువాత కూడా కూతురు కోరిక మేరకు బీఏలో కాకుండా విశాఖలోని ఒక కళాశాలలో బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(బీబీఎం)లో జాయిన్ చేశారు. ప్రస్తుతం బీబీఎం ఫస్ట్‌ఇయర్ చదువుతోంది. శనివారం అమ్మమ్మ పక్కన పడుకున్న శ్వేత.. అర్ధరాత్రి లేచి సూసైడ్ నోట్‌రాసింది. తర్వాత సోదరుడు పడుకున్న గది నుంచి బాల్కనీలోకి వచ్చి అక్కడ నుంచి కిందికి దూకింది. శబ్దానికి మేల్కొన్న వాచ్‌మెన్ వెంటనే శోభనాద్రికి తెలిపారు. అప్పటికే ఆమె మృతిచెందింది. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
 
 అల్లారుముద్దుగా పెంచుకున్నాం..
 ‘ఒక్క కుమార్తె కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం.. టెన్త్, ఇంటర్‌లలో ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణురాలైంది.. ఐఐటీ జేఈఈ ఎంట్రన్స్ పరీక్షలకు లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇప్పించాం.. రెండుసార్లూ ఎంపిక కాకపోవడంతో బీబీఎంలో చేర్పించాం’ అంటూ విగతజీవురాలైన కుమార్తె ను చూసి తండ్రి శోభనాద్రి గుండెలవిసేలా రోదించారు.

మరిన్ని వార్తలు