193వ రోజు పాదయాత్ర డైరీ

20 Jun, 2018 01:57 IST|Sakshi

19–06–2018, మంగళవారం
నాగుల్లంక, తూర్పుగోదావరి జిల్లా

మీ వంచనకు గురికాని బీసీ కులం ఒక్కటైనా ఉందా బాబూ?
ఈ రోజు ఉదయం పి.గన్నవరం నుంచి డొక్కా సీతమ్మ వారధిపై పాదయాత్ర సాగింది. ఆ వారధికి సమాంతరంగా 19వ శతాబ్దం ప్రథమార్ధంలోనే.. ఇప్పటిలా సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లోనే.. భావి తరాలను దృష్టిలో పెట్టుకుని కాటన్‌ దొర నిర్మించిన పాత ఆక్వాడెక్ట్‌ను పరిశీలిస్తుంటే.. ప్రజలకు సేవ చేయాలన్న తపన, చిత్తశుద్ధి, సంకల్పం ఉండాలే కానీ అసాధ్యమైనదేదీ లేదనిపించింది. 

ఆ వారధి దాటి లంకల గన్నవరంలో అడుగిడగానే అన్నార్తుల కోసం తన యావదాస్తిని, యావజ్జీవితాన్ని త్యాగం చేసి, అపర అన్నపూర్ణగా పేరుగాంచి, ఆంధ్రదేశ కీర్తిపతాక వైభవాన్ని ఇంగ్లండ్‌ వరకు వ్యాపింపచేసిన డొక్కా సీతమ్మ తల్లి గుర్తుకొచ్చింది. ఆమె ఔన్నత్యం బ్రిటిష్‌ పాలకులను సైతం కదిలించి దండం పెట్టేలా చేసింది. ఓ వైపు ఆమె దాతృత్వం లంకల గన్నవరానికి ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెడితే.. మరోవైపు చంద్ర బాబు తనయుడు చినబాబు పేరుతో జరిగిన ఇసుక దోపిడీ మాయని మచ్చ తెచ్చిపెట్టిందని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్క గ్రామ పరిధిలోనే వందల కోట్ల రూపాయల ఇసుకను దోచేశారంటే అవినీతి ఎంతలా వేళ్లూనుకుందో అర్థమవుతోంది. లంకల గన్నవరం ర్యాంపును లోకేశ్‌ ర్యాంపు అని పిలుస్తున్నారంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది. ఒకప్పుడు దానధర్మాలకు, ప్రజల పొట్ట నింపడానికి పేరెన్నికగన్న ఈ గ్రామం నేడు చినబాబు పేరుతో దోపిడీకి, పేదల పొట్టకొట్టడానికి మారుపేరుగా మారడం విచారకరం. 

ఎన్నికలప్పుడు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగిన తమ ప్రతినిధు లను దూషించి, బెదిరించి, అవమానించడం తమ కులస్తులందరినీ తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు.. సాయంత్రం నన్ను కలసిన పి.గన్నవరం, రాజోలు నాయీబ్రాహ్మణ సంఘ సభ్యులు. చర్చల కోసం సచివాలయానికి వెళ్లిన తమ నాయకులను ‘నోర్ముయ్‌’, ‘ఒక్కరినీ వదలను’, ‘తోక కట్‌ చేస్తా’, ‘తమాషా చేస్తున్నారా’, ‘గుళ్లలోకి అడుగుకూడా పెట్టనివ్వ ను’ అంటూ బెదిరించడం ఏం సంస్కారం? ఇదేనా బీసీలపై ప్రేమ? సెక్రటేరియట్‌కు వెళ్లిన తమవారిని సంఘ విద్రోహులుగా చూడటం, రౌడీలుగా సంబోధించడం న్యాయమేనా? అంటూ ఆవేదన వెలిబుచ్చారు. తప్పు ఆయన చేసి మా వారితోనే బలవంతంగా క్షమాపణ చెప్పించుకోవడం నియంతృత్వం కాక మరేమిటి? అని ప్రశ్నించారు. తమ బతుకు కష్టాన్ని చెప్పుకోవడానికి, ఆవేదన విన్నవించ డానికి, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరడా నికి వెళ్లిన బలహీనవర్గాల సోదరులను అధికార దురహంకారంతో దూషించి, బెదిరించడం అత్యంత దారుణం. ‘పాలకుడు అనేవాడు ప్రజల కు సేవకుడు.. ప్రజల సంతోషమే పాలకుడి సంతోషం’ అనేది చాణక్యుడి కౌటిల్య నీతి. ‘పీఠమెక్కేవరకు ప్రజలను పల్లకీలో మోస్తానన డం.. పీఠమెక్కాక తన పల్లకీ మోసే బోయీలుగా మార్చడం’ ఇది చంద్రబాబు కుటిల నీతి. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. జైళ్లు, ఆస్పత్రులు, దేవస్థానాల్లో క్షురకులు, వాయిద్య కళాకారుల ఉద్యోగాలను నాయీబ్రాహ్మణులతో భర్తీ చేస్తామని మీ ఎన్నికల మ్యానిఫెస్టోలోని 23వ పేజీలో హామీ ఇవ్వడం నిజం కాదా? ఆ హామీని గుర్తు చేసినవారిపై దుర్మార్గంగా వ్యవహరించడం ధర్మమేనా? ఇచ్చిన హామీని నెరవేర్చాలని అడిగినందుకే మీకంత కోపమొస్తే.. మ్యానిఫెస్టోలో హామీలిచ్చి, ఓట్లేయించుకుని మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి? ఎన్నికల హామీ నెరవేర్చాలని అడిగిన మత్స్యకారులను తాట తీస్తానంటూ బెదిరించారు. మీరిచ్చిన హామీలను గుర్తు చేసిన నాయీబ్రాహ్మణులను దూషించి అవమానిం చారు. మీ వంచనకు గురికాని బీసీ కులం ఒక్కటైనా ఉందా? బీసీలంటే మీకు ఎందుకింత చులకన? ఇదేనా బీసీలపై మీకున్న ప్రేమ? 
-వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు