ప్రైవేటుకు ‘పట్టా’భిషేకం!

24 Feb, 2014 23:36 IST|Sakshi
ప్రైవేటుకు ‘పట్టా’భిషేకం!

 మదన్‌పల్లి భూములకు బడా బాబుల టెండర్
 194 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వైనం
 రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ అధికారులు
 సీసీఎల్‌ఏ విచారణలో వెలుగు చూసిన అక్రమాలు
 ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీఐడీకి లేఖ
 
 శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్:
 పేదల భూములపై ‘పెద్దలు’ వాలారు. అక్రమార్కులతో కుమ్మక్కై వందల కోట్ల భూమికి టెండర్ పెట్టారు. రెవెన్యూ చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకొని ఏకంగా 194 ఎకరాల భూమిని కొల్లగొట్టారు. రికార్డుల తారుమారుతో ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తికి సంతర్పణ చేశారు. ఈ తంతును ఆలస్యంగా గుర్తించిన భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) చివరకు విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో తీగలాగితే డొంక కదిలినట్లు.. ఈ భూమాయలో మాజీ తహసీల్దార్, ఆర్డీవోలు చక్రం తిప్పినట్లు తేలింది. శంషాబాద్ మండలం మదన్‌పల్లి రెవెన్యూ పరిధిలో చోటుచేసుకున్న ఈ భూ కుంభకోణంపై విచారణ జరపాలని జిల్లా యంత్రాంగం తాజాగా సీఐడీకి లేఖ రాసింది. మదన్‌పల్లి సర్వే నంబర్ 50లో 559.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీంట్లో 546 ఎకరాలను 1977-78 సంవత్సరంలో ప్రభుత్వం 132 మంది ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్ చేసింది. ఈ మేరకు ఫైసల్ పట్టీ, పహాణీల్లోను వివరాలు నమోదు చేశారు. ఇదిలావుండగా ఇందులో కొంత మేర భూమి చేతులు మారింది. బెంగళూరు జాతీయ రహదారికి అనుకొని ఉన్న ఈ భూమిపై కన్నేసిన బడాబాబులు రైతుల నుంచి కారుచౌకగా  కొనుగోలు చేశారు. అసైన్డ్ భూములు కావడంతో వీటిని ఎలాగైనా తమ పేరిట మార్చుకునేందుకు కొత్త నాటకానికి తెరలేపారు. తమ పలుకుబడి, రికార్డుల్లోని లొసుగులను అడ్డు పెట్టుకొని భూములను కాజేసే ఎత్తుగడ వేశారు.
 
 రక్షిత కౌలుదారుగా...
 కొత్తగా నాలుగు లేన్ల పీ-వన్ రోడ్డు ఏర్పాటు చేయడంతో బెంగళూరు హైవేలోని భూముల విలువ గణనీయంగా పెరిగింది. ఎకరాకు కనిష్టంగా రూ.35 -50 లక్షల వరకు ధర పలుకుతోంది. దీంతో విలువైన ఈ భూములను వశపర్చుకోవాలనే వ్యూహంతో భూ మాఫియా పావులు కదిపింది.
 
 హైకోర్టు తీర్పును సాకుగా చూపి ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు సిద్దపడింది. ఈ క్రమంలోనే అక్రమార్కులతో చేతులు కలిపిన ఆర్డీవో, తహసీల్ధార్లు రికార్డుల తారుమారుకు ఉపక్రమించారు. 2005-06లో సేత్వార్‌లో ప్రభుత్వ భూమిగా నమోదు చేసిన భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. గిరిజనులకు అసైన్డ్ చేసిన భూమిలో రక్షిత కౌలుదారులుగా చేరుస్తూ రికార్డును తహసీల్దార్ మార్పిడి చేశారు.  లావణీ పట్టాలిచ్చిన తర్వాత ప్రైవేటు భూమిగా పేర్కొనడం, 194 ఎకరాలకు పట్టాలు జారీ చేయాలని నిర్ణయించడంపై స్థానికంగా ఆరోపణలు రావడంతో.. సీసీఎల్‌ఏ స్థాయిలో ఫిర్యాదులు పోవడంతో ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరపాలని సంబంధిత ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో 2009-11 మధ్యకాలంలో రాజేంద్రనగర్ ఆర్డీవోగా పనిచేసిన రత్నకుమార్ కూడా ఈ భూ బాగోతంలో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించారు. ఈ భూములకు సంబంధించిన రికార్డులు కూడా స్థానిక మండల కార్యాలయంలో ఆదృశ్యమైనట్లు తేలడంతో... క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోరుతూ సీఐడీకి జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ తాజాగా లేఖ రాశారు.. మరోవైపు క్షేత్రస్థాయిలో సదరు భూమిలో ఎంతమంది అసైనీలు ఉన్నారు? ప్రైవేటు వ్యక్తులెందరు? ఖాళీగా ఉన్న భూమి వివరాలపై రీ సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక పంపాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా రెవెన్యూ సిబ్బంది సర్వే పనుల్లో నిమగ్నమైంది.

మరిన్ని వార్తలు