198వ రోజు పాదయాత్ర డైరీ

26 Jun, 2018 01:49 IST|Sakshi

25–06–2018, సోమవారం
పాశర్లపూడి బాడవ, తూర్పుగోదావరి జిల్లా

బాధ్యత మరిచిన ప్రభుత్వం ఉన్నంతకాలం.. ప్రజలకు ఈ దుస్థితి తప్పదు
ఎండ మండిపోతున్నా, చెమటలు కారిపో తున్నా ఇగిరిపోని అభిమానం వెల్లువెత్తింది ఈ రోజు. నగరం, మామిడికుదురు జంట గ్రామాల ప్రజల బ్రహ్మరథం మధ్య పాదయాత్ర సాగింది. మీ నాన్నగారి ఆరోగ్యశ్రీ వల్లే బతుకుతున్నానంటూ.. ఆటో డ్రైవర్‌ చిట్టిమేను వెర్రయ్య కృతజ్ఞతలు చెప్పాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకున్న తన బిడ్డ ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తోందంటూ తాడి సత్యనారాయణ అన్న సంబరపడ్డాడు. ఎన్నో కుటుంబాలకు ఉపాధిగా మారిన గరాజీ వంటకపు మాధుర్యాన్ని రుచి చూపించారు మరికొందరు అక్కచెల్లెమ్మలు. ఆరోగ్యశ్రీ వర్తించక.. ఆపరేషన్‌ చేయించుకునే స్థోమతలేక.. అవస్థలు పడుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది.. కులుమున్నీసా అనే సోదరి. ఇలా నాన్నగారి పాలనను గుర్తుచేసుకుంటూ, బాబుగారి పాలన లోని కష్టాలను చెప్పుకొం టూ.. ఆప్యాయతల్ని పంచుతూ, ఆవేదనల్ని వెలిబుచ్చుతూ వెన్నంటి నడిచారు సోదరసోదరీమణులు. 

కోనసీమ గుండెలపై గ్యాస్‌ కుంపటి రగులుతూనే ఉంది. ఈ రోజు నడిచిన నగరం, మామిడికుదురు, పాశర్లపూడి.. అత్యధిక గ్యాస్‌ బావులు, పైప్‌లైన్లు ఉన్న గ్రామాలు. ‘దేశంలోనే అత్యధిక చమురు నిక్షేపాలున్నాయని గర్వపడాలో.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా ఉందని బాధపడాలో.. అర్థం కాని పరిస్థితి మాది. వేల కోట్ల సంపద తరలి వెళుతున్నా.. అభివృద్ధికి నోచుకోలేదంటూ’ వారి బతుకుచిత్రాన్ని పట్టిచూపారు. చమురు సంస్థలు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద ఇస్తున్న నిధులు అధికార పార్టీ పెద్దల ప్రయోజనాలకు అనుగు ణంగా వినియోగిస్తున్నారే తప్ప.. బాధితప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయడం లేద ట. బాధ్యత మరిచిన ప్రభుత్వం ఉన్నంతకాలం.. ప్రజలకు బాధల్లోనే బతుకులీడ్చాల్సిన దుస్థితి తప్పదు. 

మామిడి కుదురులో నడుస్తున్నప్పుడు తట్టల్లో మట్టి మోస్తున్న మహిళా కూలీలు పరుగు పరుగున వచ్చి కలిశారు. వారిలో తట్టలు మోసీ మోసీ అరచేతులు కాయలు కాసిన పిల్లలూ ఉన్నారు. పుస్తకాలు పట్టాల్సిన చేతులు ఇసుక తట్టల్ని మోయడం బాధనిపించింది. బడికి పంపాలి కదమ్మా అని ఆ తల్లిని ప్రశ్నిస్తే .. ‘అన్నా.. నా భర్త పోయాడు. పనిచేసుకుంటేనే కడుపుకింత దొరుకుతుంది. అందుకే పని ఉన్న రోజుల్లో బడి మానేసైనా కూలి పనులకు వస్తుంది నా బిడ్డ’ అంటూ బతుకు కష్టం చెప్పుకొంది. వారి దయనీయ పరిస్థితి కదిలించింది. పేద బిడ్డల్ని బాగా చదివించి వారి తలరాతల్ని మార్చాలన్న నా సంకల్పం మరింత బలపడింది. 

పచ్చ నేతల ఇసుక దాహం.. మత్స్యకారుల పొట్టకొడుతోందంటూ పాశర్లపూడిలో కలిసిన అప్పనపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీ నాన్నగారి హయాంలో వేలం పాటల ద్వారా ఇసుక ర్యాంపులు పొందే అవకాశం మాకుండేది. మా గ్రామంలోని మత్స్యకారులందరి జీవితాలు సాఫీగా నడిచే ఆదాయ మార్గాన్ని చూపారాయన. బాబుగారొచ్చాక కాకుల్ని కొట్టి గద్దలకు వేసినట్లుగా మాకు వేటేశారు. టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా ఇసుకను దోచేసి కోట్లు కొల్లగొడుతున్నారు. యంత్రాలతో తోడేస్తూ.. లారీలతో తరలిస్తుంటే.. ఇసుక తీసే కూలి పని సైతం మాకు దొరకడం లేదు’ అని కష్టాలు చెప్పుకొన్నారు మత్స్యకార సోదరులు. దేశంలోనే ఎక్కడా లేనంతగా.. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ఇసుక, మట్టిని సైతం కొల్లగొడుతూ దోపిడీకి కొత్త భాష్యం చెప్పారు బాబుగారు.

రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో, గ్రామంలో ఉన్న సహజ వనరులు, అవకాశాలు, అవసరాలనూ గుర్తించి ప్రణాళికలు రూపొందిస్తామని మేనిఫెస్టోలోని ముందు మాటలో చెప్పుకొన్న బాబుగారు.. అన్నంతపనీ చేశారు. రాష్ట్రంలోని అణువణువునూ శోధించి, సహజ వనరులను గుర్తించి వాటిని దోచేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దుర్వినియోగం అవుతున్నాయంటూ ప్రభుత్వాన్ని విమర్శిం చారు.. దళిత సంఘాల ప్రతినిధులు. పెదపట్నంలంకకు చెందిన ఎస్సీ సోదరుడు గడ్డం ఏసు కొబ్బరి దింపు కార్మికుడు. ఎస్సీ లోను ఇప్పిస్తానని లంచం తీసుకున్నాడట ఓ టీడీపీ ప్రబుద్ధుడు. రెండేళ్లయినా లోనూ లేదు.. తను ఇచ్చిన డబ్బూ వెనక్కు రాదు. అప్పుల పాలైన ఆ దళిత సోదరుడు చేసేదిలేక భార్యను కువైట్‌కు పంపించానని లబోదిబోమన్నాడు.

సీఎంగారికి నాదో ప్రశ్న.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని  సక్రమంగా అమలు చేస్తాం.. అమలు చేయని వారిని, అతిక్రమించే వారిని శిక్షిస్తాం.. అంటూ మీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ఉల్లంఘనకు, అరకొర నిధుల కేటాయింపులకు, ఆ నిధుల దుర్వినియోగానికి, దారి మళ్లింపునకు కారకులైన మీకు ఏం శిక్ష విధించాలి?  
-వైఎస్‌ జగన్‌ 

>
మరిన్ని వార్తలు