రిజర్వాయర్లు, వాగులకు 2,226 ఎకరాలు

6 Apr, 2017 00:45 IST|Sakshi
రిజర్వాయర్లు, వాగులకు 2,226 ఎకరాలు

భూసేకరణకు ప్రభుత్వం అనుమతి

సాక్షి, అమరావతి:  రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిపాదిస్తున్న మూడు రిజర్వాయర్లు, వాగుల విస్తరణకు అవసరమైన 2,226 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీఆర్‌డీఏ కార్యకలాపాలపై సీఎం చంద్రబాబు బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ వివరాలను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరించా రు. కొండవీటి వాగు సుందరీకరణ, వరద మళ్లింపుపై నెదర్లాండ్‌కు చెందిన బ్లూ కన్సల్టెంట్‌ ఆర్కాడిస్‌ ఇచ్చిన సవివర నివేదికకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కొండవీటి వాగు వెడల్పునకు 885 ఎకరాలు, పాలవాగు వెడల్పునకు 433 ఎకరాలు, గ్రావిటీ కాలువలు వెడల్పు చేయడానికి 218 ఎకరాలు.. మొత్తం 1,536 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని నివేదికలో పేర్కొనట్లు స్పష్టం చేశారు. ఈ భూసేకరణను వెంటనే పూర్తిచేసి, ఈ వాగులకు సంబంధించి పనులను వర్షాకాలం రాకముందే పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు.

బైపాస్‌ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం అందంగా కనిపించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని పక్కనే కృష్ణా నదిలో ఉన్న ఏడు ద్వీపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాజధానిలో చేపట్టిన ఏడు ముఖ్యమైన రహదారుల నిర్మాణ పనులు నిర్దిష్ట వ్యవధిలో పూర్తి కావాలంటే తగిన యంత్రాంగాన్ని సమకూర్చుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు