ఆటోను ఢీకొన్న గ్యాస్ ట్యాంకర్

17 Dec, 2013 03:39 IST|Sakshi


 అశ్వాపురం, న్యూస్‌లైన్
 మరో పదిహేను కిలోమీటర్లు వెళితే ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకుని ఉండేవారు... కానీ విధి వక్రించింది.. గ్యాస్ ట్యాంకర్ మృత్యువు రూపంలో వచ్చి ఇద్దరిని కబళించి పలువురిని క్షతగాత్రులను చేసింది. అశ్వాపురం మండలంలోని సీతారామపురం వద్ద సోమవారం ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ వేగంగా టాటా మ్యాజిక్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు సంఘటన స్థలంలో మృతి చెందగా మరొకరు భద్రాచలంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏడుగురు గాయపడ్డారు. సంఘటన స్థలం రక్త సిక్తంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం నుంచి ప్రయాణికులతో మణుగూరుకు వస్తున్న టాటా మ్యాజిక్ ఆటోను మండలంలోని సీతారామపురం వద్ద మణుగూరు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ ఢీకొట్టింది. వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టిన తర్వాత అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
 
  ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న అమ్మగారిపల్లికి పంచాయతీ బట్టామల్లయ్య గుంపునకు చెందిన బట్టా మంగయ్య(50) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన విజయవాడకు చెందిన ఎస్‌కే ఖలీల్(28) భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిట్టగూడేనికి చెందిన తాటి ఎర్రమ్మ, మిడియం లక్ష్మి, జిమ్మా జానకమ్మ, మణుగూరు మండలం శివలింగాపురానికి చెందిన సియాల పాపరావు, తాటిగడప గ్రామానికి చెందిన దార్ల హరికృష్ణ, మ్యాజిక్ డ్రైవర్ కర్నే దిలీప్‌కుమార్, మహేష్‌లు గాయపడ్డారు. సమాచారం అందుకున అశ్వాపురం సీఐ వేణుచందర్ హుటాహుటీన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు