ఇద్దరు యువరైతుల బలవన్మరణం

3 Oct, 2013 03:50 IST|Sakshi

బజార్‌హత్నూర్, న్యూస్‌లైన్ : వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు నట్టేట మునుగుతున్నారు.. అతివృష్టి, అనావృష్టి కొంప ముంచుతున్నాయి.. గతేడాది అనావృష్టితో వందల సంఖ్యలో రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.. ఈ ఏడాది అతివృష్టితో మృత్యుఒడికి చేరుతున్నారు.. మొక్కలు కుళ్లిపోయి.. తెగుళ్లు సోకి.. దిగుబడి రాదని.. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపం చెంది పంట చేలలోనే ఉరివేసుకుని, పురుగుల మందుతాగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..! కనీసం గిట్టుబాటు అందుతుందా అంటే అదిలేదు.. పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి.. చివరకు మరణమే శరణ్యంగా భావిస్తున్నారు..! బజార్‌హత్నూర్‌లో ఇద్దరు యువరైతులు అప్పులబాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషాదం నింపింది..
 
 ఉరివేసుకుని..
 బజార్‌హత్నూర్ మండల కేంద్రానికి చెందిన యువ రైతు గిమ్మేకర్ రాజేందర్(27) మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేందర్ ఖరీఫ్ ఆరంభంలో తనకున్న ఐదెకరాలతోపాటు మరో ఏడెకరాలు కౌలుకు తీసుకున్నాడు. మూడెకరాల్లో పత్తి, సోయా సాగు చేశాడు. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు చేలలో నీరు నిలిచి మొక్కలు కుళ్లిపోయాయి. దిగుబడి వచ్చే అవకాశం లేదు. వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం దక్కన్ గ్రామీణ బ్యాంకులో, ప్రైవేటుగా దాదాపు రూ.1.50 లక్షలు అప్పు చేశాడు. ఒకవైపు పంట చేతుకొచ్చే పరిస్థితి లేకపోవడం, చేసిన అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో మంగళవారం రాత్రి ఇంటిపెరట్లోని చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం తండ్రి దశరథ్ రాజేందర్ మృతదేహాన్ని చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ట్రెయినీ ఎస్సై రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాజేందర్‌కు తల్లిదండ్రులు గిమ్మేకర్ భారతి, దశరథ్‌తో పాటు చెల్లి, తమ్ముడు ఉన్నారు.
 
 పురుగుల మందుతాగి..
 మండల కేంద్రానికి చెందిన రైతు కొంగర్ల పోతన్న(30) మంగళవారం రాత్రి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోతన్న తనకున్న ఏడెకరాల్లో సోయా సాగు చేశాడు. వ్యవసాయం కోసం అప్పులు చేశాడు. ఇటీవల కురిసిన అధిక వర్షాలతో పంట దిగుబడి వచ్చే అవకాశం లేకపోవడం, చేసిన అప్పులు ఎలా తీర్చాలని మదనపడే వాడు. మంగళవారం రాత్రి తన భార్యకు బయటకు వెళ్లొస్తానని చెప్పి పురుగుల మందుతాగాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోతన్నకు తల్లిదండ్రులతోపాటు భార్య అనిత, రెండేళ్ల కూతురు రక్షిత ఉన్నారు.

>
మరిన్ని వార్తలు