మూడవ రోజు 20 మృతదేహాలు లభ్యం

18 Sep, 2019 04:09 IST|Sakshi
మృతదేహాన్ని ఒడ్డుకు చేరుస్తున్న రెస్క్యూ టీం

గోదావరి బోటు ప్రమాదంలో ఇప్పటిదాకా లభించిన 28 మృతదేహాలు

మరో 18 మంది ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు 

కచ్చులూరు మందం వద్ద 214 అడుగుల లోతున బోటు

బోటు లోపలి పరిస్థితిని తెలుసుకునేందుకు ఆల్కార్‌ స్కానర్‌ కెమెరాతో చిత్రీకరణ

దేవీపట్నం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి బృందం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిపోయిన ఘటనలో మృతదేహాల వెలికితీత ఓ కొలిక్కి వస్తోంది. బోటును వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ కొనసాగిస్తోంది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తోంది. ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకోగా మూడో రోజు మంగళవారం గోదావరి పరివాహక ప్రాంతాల్లో 20 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొదటి రోజు ఆదివారం సాయంత్రానికే 8 మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే. మిగిలిన వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. విశాఖపట్నం నావికాదళం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ కాకినాడ పోర్టు సాంకేతిక సిబ్బంది కూడా గోదావరి పరివాహక ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. 

గల్లంతైన మరో 18 మంది ఎక్కడున్నారో? 
మునిగిపోయిన బోటులో మొత్తం 72 మంది ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన జరిగిన రోజే బోటు నుంచి 26 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మంగళవారం దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో 14 మృతదేహాలు, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం పరివాహక ప్రాంతంలో 3 మృతదేహాలు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఒకటి, ఆత్రేయపురం పరిధిలోని ర్యాలీ బ్యారేజీ వద్ద ఒకటి, కేంద్ర పాలిత ప్రాంతం యానాం వద్ద ఒక మృతదేహాన్ని గుర్తించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 11 మంది, తెలంగాణకు చెందినవారు 8 మంది ఉన్నారు. యానాం వద్ద లభించిన బాలిక మృతదేహం ఎవరిది అనేది గుర్తించాల్సి ఉంది. ఇప్పటిదాకా లభ్యమైన మృతదేహాల సంఖ్య 28కు చేరుకుంది. గల్లంతైన మరో 18 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. 
మృతదేహాలకు పోస్టుమార్టం.. బంధువులకు అప్పగింత  
బోటు ప్రమాదంలో మొదటి రోజు లభ్యమైన 8 మృతదేహాలకు ఇప్పటికే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మంగళవారం లభ్యమైన 20 మృతదేహాల్లో 18 మృతదేహాలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి మృతదేహాలు ఒకేసారి రావడంతో వారి బంధువులు ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర విషాదం అలుముకుంది. మృతదేహాల గుర్తింపు, పోస్టుమార్టం, స్వస్థలాలకు తరలించే ప్రక్రియను ఏమాత్రం జాప్యం లేకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రెవెన్యూ, పోలీసు శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతదేహాల పోస్టుమార్టం వేగంగా పూర్తి చేశారు. వెంటనే మృతదేహాలు వారి బంధువులకు అప్పగించారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆస్పత్రి వద్దనే ఉండి అధికారులకు సహకరించారు.  

214 అడుగుల లోతున బోటు 
ప్రమాదానికి గురైన ప్రైవేట్‌ పర్యాటక బోటు రాయల్‌ వశిష్ట పున్నమి–2 ఆచూకీ లభించింది. కచ్చులూరు మందం గ్రామం వద్ద గోదావరిలో 214 అడుగుల లోతున బోటు ఉన్నట్టు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గుర్తించాయి. బోటు ఉన్న ప్రాంతం చుట్టూ గోదావరి నీటిపై వలయాకారాలతో కూడిన రంగుల రబ్బర్‌ ట్యూబులను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. బోటు లోపలి పరిస్థితిని తెలుసుకునేందుకు ఉత్తరాఖండ్‌ నుంచి రప్పించిన ఆల్కార్‌ స్కానర్‌ కెమెరాను గోదావరి అడుగు వరకూ తీసుకెళ్లారు. కెమెరా చిత్రీకరించిన దృశ్యాలను తెలుసుకునేందుకు ప్రత్యేక బృందం ద్వారా ఉత్తరాఖండ్‌కు పంపించారు. 
మంగళవారం లభించిన మృతదేహాల వివరాలు 
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 
1) వలవల రఘురామ్‌(39), నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా 
2) గన్నాబత్తుల ఫణికుమార్‌(28), నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా
3) అబ్దుల్‌ సలీమ్‌(24), వీలేరు, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా
4) భూసాల పూర్ణ(11), గోపాలపురం, అనకాపల్లి మండలం, విశాఖ జిల్లా
5) బాచిరెడ్డి హాసికారెడ్డి(4), నంద్యాల, కర్నూలు(ప్రస్తుతం విశాఖపట్నం గాజువాక)
6) దుర్గం సుబ్రహ్మణ్యం(51), వేపనపల్లి గ్రామం, తిరుపతి, చిత్తూరు జిల్లా
7) మధుపాటి రమణబాబు(34), విశాఖపట్నం 
8) బొండా పుష్ప(13), వేపగుంట, విశాఖ జిల్లా 
9) మూల వీసాల వెంకట సీతారామరాజు(51), బాజీ జంక్షన్, విశాఖపట్నం
10) బాచిరెడ్డి స్వాతిరెడ్డి(32), నంద్యాల, కర్నూలు(ప్రస్తుతం విశాఖపట్నం గాజువాక) 
11) భూసాల సుస్మిత(4), గోపాలపురం, విశాఖ జిల్లా 
12) గుర్తు తెలియని బాలిక(యానాం వద్ద లభ్యం)  

తెలంగాణకు చెందిన వారు 
1) గెడ్డమీద సునీల్‌(29), చినపెండ్యాల, జనగాం జిల్లా
2) వీరం సాయికుమార్‌(24), మాదాపూర్, హైదరాబాద్‌ 
3) బసికి వెంకట్రామయ్య(65), ఖాజీపేట, వరంగల్‌ జిల్లా
4) గొర్రె రాజేంద్రప్రసాద్‌(55), కడిపికొండ, ఖాజీపేట మండలం, వరంగల్‌ జిల్లా
5) పాడి భరణికుమార్‌(25), హయత్‌నగర్, పోచయ్య బస్తీ, రంగారెడ్డి జిల్లా 
6) పాసం తరుణ్‌కుమార్‌రెడ్డి(36), రామడుగు, నల్లగొండ జిల్లా 
7) కోదండ విశాల్‌(23), హయత్‌నగర్, పోచయ్య బస్తీ, రంగారెడ్డి జిల్లా 
8) లేపాకుల విష్ణుకుమార్‌(32), నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా 

మొదటి రోజు ఆదివారం ఆచూకీ లభించిన మృతులు 
1) మందపాక కృష్ణకిశోర్‌(30) నులకపేట, తాడేపల్లి మండలం, గుంటూరు 
2) తటారి అప్పల నరసమ్మ(45), ఆరిలోవా, విశాఖపట్నం 
3) బొండా లక్ష్మి(35) వేపగుంట, విశాఖపట్నం 
4) అంకెం శివజ్యోతి(48) స్వరూప్‌ నగర్, హైదరాబాద్‌ 
5) దుర్గం హాసినీ(21), తిరుపతి
6) బసిక ఆవినాశ్‌(21) కడిసికోన, ఖాజీపేట 
7) బసికి రాజేంద్ర(55) కడిసికోన, ఖాజీపేట
8) బొడ్డు లక్ష్మణ్‌(26) కర్రలమామాడి, మంచిర్యాల జిల్లా  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు