పేకాట పాట @రూ. 20 లక్షలు

15 Feb, 2018 10:47 IST|Sakshi

ఎమ్మెల్యే వాటా రూ.17 లక్షలు

ఖాకీల వాటా రూ.3 లక్షలు

మొన్న, నిన్న, నేడు ‘చీడ’లో అడిగేవాడు లేడు...

కళ్లు మూసుకున్న పోలీసులు

రెచ్చిపోయిన జూదగాళ్లు

ఊళ్లల్లో జరిగే జాతరలు, పండుగలు, ఉత్సవాల్లో పేకాట శిబిరాలు వెలవడం సహజమే. పోలీసుల కళ్లుగప్పి.. లేదా వారికి మామూళ్లు ముట్టజెప్పి అప్పటికప్పుడు పేకాటలు ఆడుకునే తంతు మామూలే. కానీ మహాశివరాత్రిని పురస్కరించుకుని కశింకోట మండలం చీడ గ్రామంలో వెలసిన పేకాట శిబిరానికో ప్రత్యేకత ఉంది. ఏకంగా వరుసగా మూడురోజులపాటు నిరాటంకంగా నిర్వహించే పేకాట శిబిరానికి ఎమ్మెల్యే నుంచే గ్రీన్‌సిగ్నల్‌ పొందారు. అది కూడా ఊరికే మాట సాయంగా కాదు.. ఏకంగా రూ.17 లక్షలు సమర్పించుకుని.  ఇందుకోసం పోటీ పడ్డ నిర్వాహకుల మధ్య వేలంపాట కూడా నిర్వహించారు. పాటలో అత్యధికంగా ఎమ్మెల్యే గారికి రూ.17 లక్షలు ఇస్తానన్న ఓ టీడీపీ కార్యకర్తకు పేకాట శిబిరాల నిర్వహణ బాధ్యత దక్కింది. ఒకింత నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ చీడలో గత రెండురోజులుగా యథేచ్ఛగా జరుగుతున్న పేకాట శిబిరాల సాక్షిగా ఇది వాస్తవమే.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : కశింకోట మండలం చీడ గ్రామంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడురోజులపాటు పోతురాజుబాబు ఉత్సవం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. సందట్లో సడేమియా మాదిరిగా అక్కడి కొందరు పెద్దల మధ్య పేకాట శిబిరాల నిర్వహణ ప్రస్తావనకు వచ్చింది. ఎంతిచ్చినా పోలీసులు సంతృప్తిపడరు.. ఎమ్మెల్యే గారికి వాటా ఇచ్చి ఆయనతో చెప్పిస్తే గానీ పనికాదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎవరికి నిర్వహణ దక్కాలనే దానిపై ‘పాట’ పెట్టుకున్నారు. పేకాట వేలంపాటలో పొరుగూరికి చెందిన ఓ టీడీపీ చోటా కార్యకర్త ఎమ్మెల్యేకి ఏకంగా రూ.17 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమన్నాడు.

అంతే.. అతగాడికి మూడురోజులపాటు ఆ ఉత్సవాల్లో పేకాట శిబిరాల నిర్వహణ బాధ్యతను అప్పజెప్పేశారు. పోలీసుల అహం కూడా దెబ్బతినకుండా వారికో రూ.3 లక్షలు ముట్టజెప్పాలని నిర్ణయించుకున్నారు. మొత్తంగా రూ.20 లక్షలకు పాట ఫైనల్‌ చేసుకున్నారు. అంటే కేవలం పేకాటల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ కోసమే 20 లక్షలు ఖర్చు చేశారంటే... నిర్వహణ ద్వారా అంతకు మించి వారికి మిగలాలి. రూ.20 లక్షలకు మించి మిగలాలంటే... ఎంత మొత్తంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అందుకే  చీడ గ్రామ పరిసర తోటలు, పొలాల్లో శివరాత్రి నాడైన మంగళవారం మొదలైన శిబిరాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. పేకాటతోపాటు గుండాట, కోతాట... ఇలా అన్నిరకాల జూదాలను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు.

‘స్పెషల్‌’ పర్మిషన్‌ ?
మునుపెన్నడూ లేని విధంగా ఇలా యథేచ్ఛగా పేకాట శిబిరాల నిర్వహణ ‘ధైర్యం’ వెనుక జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఓ పోలీసాయన పాత్ర ఉన్నట్టు చెబుతున్నారు.. ఆ ఊరి పెద్దకు బంధుత్వం ఉన్న సదరు పోలీసాయన సలహా మేరకే ‘పాట’ పెట్టుకుని ఎవరికివ్వాల్సింది వారికిచ్చి జూద క్రీడలకు తెరలేపినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు