మారణకాండ

8 Apr, 2015 03:17 IST|Sakshi
మారణకాండ

శేషాచలంలో భారీ ఎన్‌కౌంటర్   20 మంది ‘ఎర్ర’కూలీల హతం
స్మగ్లర్ల కోసం కొనసాగుతున్న వేట
బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ ప్రజాసంఘాల ఆగ్రహం
తమిళనాడుకు ఆగిన బస్సు సర్వీసులు

 
సాక్షిప్రతినిధి, తిరుపతి/ క్రైం : శేషాచలం అడవుల్లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 20 మంది ఎర్రకూలీలు హతమయ్యారు. వందలాది మంది తప్పించుకుని అడవుల్లోకి పారిపోయారు. వారికోసం వేట కొనసాగుతోంది. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు సమీపంలో వందలాది మంది ఎర్రకూలీలు అడవుల్లోకి ప్రవేశించారనే పక్కా సమాచారంతో అటవీ శాఖ, రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలు సోమవారం రాత్రి 7 గంటలకు కూంబింగ్ చేపట్టాయి. మంగళవారం తెల్లవారుజామున ఎర్రకూలీలు పోలీసులకు ఎదురుపడ్డారు. ఎర్రకూలీలు రాళ్లు, గొడ్డళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఆత్మరక్షణార్థం జరిగిన పోలీస్ కాల్పుల్లో 20 మంది కూలీలు చనిపోయారు. పారిపోయిన కూలీల కోసం పోలీస్ బలగాలు శేషాచలం అడవులను జల్లెడ పడుతున్నాయి.

ఘటనా స్థలానికి ఉన్నతాధికారులు

ఎన్‌కౌంటర్ విషయం తెలిసిన వెంటనే రేంజ్ డీఐజీ బాలకృష్ణ, టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనపై కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా నియమించిన డీఆర్‌వో విజయచంద్ర, ఆర్డీవో వీరబ్రహ్మం సైతం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. పోలీసులు అన్ని ఆధారాలు సేకరించాక మృతదేహాలను సాయంత్రం 5 గంటలకు రుయాస్పత్రికి తరలించారు. రాత్రి కావడంతో బుధవారం ఉదయం పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.కూలీల దాడిలో గాయపడిన పోలీసులను ఉదయమే రుయాస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు.

ప్రజా సంఘాల ఆగ్రహం

శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బూటకపు ఎన్‌కౌంటర్‌గా అభివర్ణిస్తున్నాయి. మృతిచెందిన వారంతా తమిళనాడుకు చెందిన వారే కావడంతో అక్కడ కూడా తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళ్లే 80 బస్సులను నిలిపివేశారు.

ఉనికిని చాటుకోవడానికే

ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రత్యేకంగా డీఐజీ కాంతారావు నేతృత్వంలో టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసినప్పటికీ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల్లో భయం నెలకొల్పేందుకు భారీ ఎన్‌కౌంటర్ చేసినట్లు సమాచారం. రోజూ వందల సంఖ్యలో ఎర్రకూలీలు శేషాచల అడవుల్లో ప్రవేశిస్తుండడం, వారిని అడ్డుకునేంత సిబ్బంది లేకపోవడంతో పక్కా ప్రణాళికతో ఈ ఎన్‌కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతోనైనా కొంతమేర ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చని భావనతో అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు చర్చ జరుగుతోంది.

మట్టుపెట్టింది అమాయకులనే

ఎర్రచందనం కూలీలను అడవుల్లో ప్రవేశపెట్టింది వైఎస్‌ఆర్ జిల్లా, చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు స్మగ్లరని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ వారిపైన టాస్క్‌ఫోర్స్ ఎటువంటి చర్యలూ తీసుకోలేకపోయింది. కేవలం ఎర్రకూలీలను మాత్రమే మట్టుపెట్టింది. దీని పైన తమిళనాడులో సైతం తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయి.

కీలక ఆధారాల సేకరణ

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులే ఇక్కడికి తరలించి మట్టుబెట్టి ఉంటారనే అనుమానాలు పోలీస్ వర్గాల నుంచే వ్యక్తమౌతున్నాయి. ఎన్‌కౌంటర్ ప్రాంతంలో శవాలు ఒకేచోట పడి ఉన్న తీరు, ఎర్రకూలీల వద్ద పడి ఉన్న పాత ఎర్రచందనం దుంగలు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఘటనా స్థలంలో 83 రూపాయలు విలువ చేసే బస్ టికెట్ పోలీసులకు లభ్యమైందని సమాచారం. దీని ఆధారంగా ఎర్రకూలీలు 105 కి.మీ ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఊత్తుకోట నుంచిగాని లేక వేలూరు నుంచి గానీ తిరుపతికి ప్రయాణించి ఉండవచ్చు. టికెట్ ఆధారంగా సోమవారం రోజున ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. మొత్తం మీద ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది.

మరిన్ని వార్తలు