కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా..

3 Feb, 2018 10:32 IST|Sakshi

ఇరవై ఏళ్ల ప్రాయం.. వివాహం నిశ్చయమై మార్చి 20న పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి. తల్లిదండ్రులు కుమార్తె వివాహం కోసం ఏర్పాట్లు చేసుకుంటుంటే...యువతి మాత్రం తన వివాహం కోసం ఉన్న పొలమంతా అమ్మేస్తే కన్నవారి జీవనం ఎలాగంటూ మదనపడ సాగింది. తన తరువాత ఉన్న చెల్లి వివాహం ఎలా చేస్తారని ఆలోచించింది. ఆ ఆలోచనలో తీవ్ర మనస్తాపానికి గురైంది. తన చెల్లి పెళ్ళి చేయాలన్నా...తల్లిదండ్రులు ఉన్నంతలో సంతోషంగా జీవించాలన్నా...తన చావే పరిష్కారమనుకుంది.  ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన రామభద్రపురం మండలం శిష్టు సీతారాంపురంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...

విజయనగరం(రామభద్రపురం): మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కి వధువు కావాల్సిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్ప డింది. కన్నవారి జీవనం, తోబుట్టువు వివాహం కోసం ఆలోచించసాగింది. తన మరణంతోనే తోబుట్టువు పెళ్లి, కన్నవారి జీవనం సాగుతుందని ఆలోచించి పురుగుల మందు తాగేసింది. మండలంలోని శిష్టుసీతారాంపురం గ్రామానికి చెందిన శిష్టు ఇందు(20) అనే యువతి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... శిష్టుసీతారాంపురం గ్రామానికి చెందిన శిష్టు తిరుపతికి ముగ్గురు కుమార్తెలు. పెద్దమ్మాయికి ఏడాది కిందట తన పొలంలో కొంత భాగాన్ని విక్రయించి వివాహం చేశారు. రెండవ అమ్మాయి ఇందు. ఈమెకు ఇటీవలె వివాహం నిశ్చయమైంది.

ఉన్న పొలంలో మిగిలిన భూమిని విక్రయించి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించడంతో ఉన్నదంతా తన వివాహం కోసం అమ్మేస్తే చెల్లి ఉంది తరువాత ఆర్థికంగా ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో ఇందు మనస్తాపానికి గురైంది. గురువారం సాయంత్రం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగింది. తల్లిదండ్రులు పొలం పనులు చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసరికి కుమార్తె వాంతులు చేసుకుంటుండం గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులు బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయింది. మార్చి 20న వివాహం జరపవలసిన కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. చెల్లి పెళ్లి కోసం, తల్లిదండ్రుల జీవనం కోసం ఆలోచించి ఇందు చేసిన ఈ ప్రయత్నంతో కుటుంబ సభ్యులు గొల్లుమంటున్నారు. మా కోసం ఎందుకమ్మా! ఇలా చేశావ్‌...ఇందు అంటూ రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఏఎస్‌ఐ రమణమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు