గృహ నిర్మాణంలో... రూ.200 కోట్ల స్కాం

24 Feb, 2018 10:43 IST|Sakshi
టీడీపీ కరపత్రాన్ని చూపుతూ అపార్ట్‌మెంట్‌లో అవినీతిని వివరిస్తున్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

రూ.500 కే ఇళ్లంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు

నెలా నెలా బ్యాంకు కంతు రూ.4 వేలను పేదలు ఎలా కడతారు?

అంచనా వ్యయాన్ని పెంచి కోట్లు దండుకుంటున్నారు

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

ధర్మవరంటౌన్‌ :  ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేస్తామంటూ గృహ నిర్మాణ పథకం ద్వారా అపార్ట్‌మెంట్‌లు నిర్మించి ఇస్తామని చెబుతూ అవినీతికి బాటవేసిందని, ఒక్క ధర్మవరం నియోజకవర్గంలోనే రూ.200 కోట్ల స్కాంకు టీడీపీ ప్రజా ప్రతినిధులు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సింది పోయి లబ్ధిదారులపై బ్యాంక్‌ భారం మోపి నెల నెలా రూ.4 వేలు చెల్లించేలా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. వివిధ పథకాల పేరుతో రూ.500కే ఇళ్లు నిర్మించి ఇస్తామని పేద ప్రజలకు భ్రమలు కల్పిస్తోందన్నారు.

రూ.200 కోట్ల స్కాం
ధర్మవరం నియోజకవర్గంలో అపార్ట్‌మెంట్‌ నిర్మాణంలో రూ.200 కోట్ల స్కాంకు టీడీపీ ప్రజా ప్రతినిధి తెరలేపారని కేతిరెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు బినామీ కాంట్రాక్టర్‌లు అయిన సాహోజి పల్లంజీలకు ఈ కాంట్రాక్ట్‌ దక్కేలా ప్రభుత్వం పావులు కదిపిందన్నారు. ధర్మవరం నియోజకర్గంలో ఓ టీడీపీ ప్రజా ప్రతినిధి 8 వేల మందికి అపార్ట్‌మెంట్‌ ద్వారా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం డీడీలు స్వీకరించిందన్నారు. అపార్ట్‌మెంట్‌ నిర్మాణం చదరపు గజం రూ.1.20 లక్షలు బహిరంగ మార్కెట్‌లో ధర ఉంటే ప్రస్తుతం లబ్ధిదారుల నుండి కాంట్రాక్టర్‌ వసూలు చేస్తున్న మొత్తం రెట్టింపుగా ఉందన్నారు. 8,832 మందికి బహిరంగ మార్కెట్‌లో అపార్ట్‌మెంట్‌లు నిర్మించి ఇవ్వడానికి రూ.300 కోట్లు ఖర్చు అయితే కాంట్రాక్టర్‌ మాత్రం రూ.544.67 కోట్లకు అంచనా వ్యయం పెంచేశారన్నారు. ఫలితంగా ఎటుచూసిన స్థానిక ప్రజా ప్రతినిధులకు రూ.200 కోట్లు అక్రమార్జన రూపంలో స్వాహాకు సిద్ధమయ్యారని విమర్శించారు.

పట్టాలు మంజూరు చేయరా ?
పట్టణంలో విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చిన పట్టాలను వెనక్కి తీసుకొని ఆ స్థలంలో అపార్ట్‌మెంట్‌ నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించారన్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో  తొలి విడతగా  8 వేల మందికి అపార్ట్‌మెంట్‌ ద్వారా ఇళ్లు నిర్మించేందుకు అనుమతి వచ్చినా వారికి  అధికారులు  పట్టాలు మంజూరు చేయక పోవడం దారుణమన్నారు. ఒకవైపు అపార్ట్‌మెంట్‌ నిర్మించి ఇస్తామని చెప్పి మరోవైపు మండలంలోని  పోతులనాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి వద్ద వందల ఎకరాల భూములను స్థల సేకరణ చేస్తున్నారని.. ఆ భూములు ఎవరికి కట్టబెట్టడానికని ప్రశ్నించారు. పట్టణంలో ఇంటిస్థలం ఇస్తామని చెబుతూ టీడీపీ నాయకులు జాబితా  సిద్ధం చేశారని ప్రస్తుతం స్థల సేకరణ చేసిన ప్రాంతంలోని గ్రామాల్లోని  టీడీపీ కార్యకర్తలకు ఇంటిపట్టాలు ఇచ్చి దొంగ ఓట్లు నమోదు చేసేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేశారని వీరికి రెవెన్యూ అధికారులు కూడా వంత పాడుతున్నారన్నారు. ధర్మవరంలో జరుగుతున్న అపార్ట్‌మెంట్‌ దోపిడీని ప్రజలు నమ్మొద్దని ఈ అవినీతి కార్యక్రమంపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేపడతామన్నారు.

చేనేతల పరిస్థితేంటి?
ధర్మవరంలో అత్యధిక సంఖ్యాకులైన చేనేత కార్మికులందరూ చేనేత మగ్గం నేసుకొని జీవనం సాగిస్తున్నారని అపార్ట్‌మెంట్‌ ద్వారా వారికి గదులు కేటాయిస్తే మగ్గం ఎలా వేసుకుంటారని కేతిరెడ్డి ప్రశ్నించారు. అంతేకాక అపార్ట్‌మెంట్‌లో ఉండటం ఇక్కడ ప్రాంతంలో సాధ్యం కాదని కేవలం స్థానిక ఎమ్మెల్యే వరదాపురం సూరి కంకర, ఇసుకను అమ్ముకునేందుకు మాత్రం ఇది ఉపయోపడుతుందన్నారు.

మరిన్ని వార్తలు