ఎస్సీ, ఎస్టీలకు వెలుగుల వరం!

3 Dec, 2019 11:50 IST|Sakshi

క్షేత్రస్థాయిలో అమలవుతున్న జగ్జీవన్‌ జ్యోతి పథకం

200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితం 

రాజధాని జిల్లాల్లో 4.44 లక్షల మందికి ప్రయోజనం   

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సంక్షేమ శకం నడుస్తోంది. పేదల అభ్యున్నతే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశపెడుతూ.. వారికి ఆర్థికంగా చేయూతనందిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని అమలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. జగ్జీవన్‌ జ్యోతి పథకం కింద మొదటి 200 యూనిట్ల మేర విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ పథకం కింద 100 యూనిట్ల వరకు మాత్రమే షెడ్యూల్డ్‌ కులాలు, తెగల కుటుంబాలకు ఉచితంగా అందించారు. అయితే వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక వీరికి ఉచిత విద్యుత్‌ను 200 యూనిట్లకు పెంచుతానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఆ ప్రకారమే ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపారు.  

రాజధాని జిల్లాల్లో పరిస్థితి.. 
ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) పరిధిలో ఉన్న కృష్ణా, గుంటూరు, సీఆర్‌డీఏ సర్కిళ్లలో 4.44 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు. కృష్ణా సర్కిల్‌లో 1,98,621 మంది, గుంటూరు సర్కిల్‌లో 1,30,805, సీఆర్‌డీఏ సర్కిల్‌లో 52,506 మంది వెరసి 3,81,932 మంది ఎస్సీ వినియోగదారులకు లబ్ధి చేకూరుతోంది. అలాగే ఎస్టీ వినియోగదారుల విషయానికొస్తే కృష్ణా సర్కిల్‌లో 23,545 మంది, గుంటూరు సర్కిల్‌లో 30,353, సీఆర్‌డీఏ సర్కిల్‌ పరిధిలో 8,926 మంది వెరసి 62,824 మంది  ప్రయోజనం పొందుతున్నారు. ఇలా ఈ మూడు సర్కిళ్ల పరిధిలో 4,44,756 మంది ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ వినియోగదారులు నెలనెలా ఉచిత విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారని ఏపీఎస్పీడీసీఎల్‌ విజయవాడ జోన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ కె.సంతోషరావు ‘సాక్షి’తో చెప్పారు. ఫలితంగా నెలకు కృష్ణా (విజయవాడ) సర్కిల్‌లో రూ.5.36 కోట్లు, గుంటూరులో రూ.3.70 కోట్లు, సీఆర్‌డీఏ సర్కిల్‌లో రూ.1.56 కోట్లు చొప్పున రూ.10.62 కోట్ల సొమ్మును ప్రభుత్వం భరిస్తూ ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ వినియోగదారులకు ఎంతో ఉపశమనం కల్గిస్తోంది.  

ఎంతో ఉపశమనం..  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ఎస్సీలకు విద్యుత్‌ రాయితీ అమలవుతోంది. గత ప్రభుత్వం కేవలం 100 యూనిట్లు వరకే ఉచిత విద్యుత్‌ ఇచ్చేది. ఆపై వినియోగానికి బిల్లు చెల్లించాల్సి వచ్చేది. జగన్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 200 యూనిట్ల వరకు మా ఎస్సీలకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. దీంతో మాకు నెలకు రూ.500 ఉపశమనం కలుగుతోంది.   
– వట్టిపల్లి ప్రభాకరరావు, మిలటరీపేట, కలిదిండి 

మాట తప్పని నైజం..  
మాటతప్పని మడం తిప్పని నైజం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా అమలు వల్ల ఎస్టీలలో నిరుపేదలకు ఆర్థికంగా ఊరటనిస్తోంది. గతంలో విద్యుత్‌ వినియోగ పరిమితి 100 యూనిట్లే ఉండేది. ఇప్పుడు 200 యూనిట్లకు పెంచడం వల్ల నిశ్చింతగా ఉంటున్నాం. జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్‌ ఇస్తుండడం మాలాంటి ఎందరికో బిల్లుల చెల్లింపు బెడద తప్పింది. జగన్‌ హామీ నిలబెట్టుకోవడం హర్షణీయం. 
–భూక్యా గన్యా, ఎ. కొండూరు 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా