నిధులు సరే....రోడ్లెక్కడ?

5 Nov, 2013 02:26 IST|Sakshi

 

 =ఎడాపెడా కురుస్తున్న కాసులు
 =కానరాని రహదారులు
 =పూర్తయ్యేదెప్పుడో సందిగ్థమే

 
 జిల్లాకు రోడ్లైతే మంజూరవుతున్నాయి... పూర్తయ్యేదే కన్పించడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి.. మంజూరైన రోడ్లకు  ఏళ్లు గడుస్తున్నా మోక్షం కలగడం లేదు. దీంతో కోట్లాది రూపాయలు మురిగిపోతున్నాయి. ప్రజల రహదారి కష్టాలు యథాతథంగా మిగిలిపోతున్నాయి.
 
 సాక్షి, విశాఖపట్నం:  2012లో ఇంటిగ్రేటేడ్ యాక్షన్ ప్లాన్ (ఐఏపీ) కింద జిల్లాకు రూ. 69.99 కోట్లతో 58 రోడ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణ బాధ్యతల్ని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  దశల వారీగా ఇచ్చిన గడువు ప్రకారం  వీటిని వచ్చే మార్చి కల్లా పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు రూ.8 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే దాదాపు రోడ్లన్నీ ప్రారంభ దశలో ఉన్నట్టు ప్రగతి నివేదికల ద్వారా తెలుస్తోంది. పనుల జాప్యాన్ని చూస్తుంటే మరో రెండేళ్లైనా పూర్తయ్యే అవకాశం కన్పించడం లేదు. దీంతో ఆ నిధులు నిరుపయోగంగా ఉండటమే కాకుండా దాదాపు 200 గ్రామాల ప్రజలకు రహదారి అవస్థలు తీరడం లేదు.
 
ఐఏపీ రోడ్లనే పూర్తి చేయలేదనుకుంటే అదే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి నిర్మాణ బాధ్యతల్ని అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో 10 కొత్త రోడ్లు మంజూరు చేసింది. గ్రామీణాభివృద్ధి నిధులు (ఆర్‌డీఎఫ్) కింద రూ.7.72 కోట్లు కేటాయించింది. అనకాపల్లి మండలం బట్లపుడి నుంచి ఊడేరు రోడ్డుకు రూ.1.08 కోట్లు, కశింకోట మండలం చరకాం నుంచి గొబ్బూరు రోడ్డుకు రూ. 84 లక్షలు, ఆనందపురం మండలంలో దిబ్బ మేడపాలెం రోడ్డు నుంచి శొంఠ్యాం రోడ్డుకు రూ.28లక్షలు, బీఎన్ రోడ్డు నుంచి శొంఠ్యాం రోడ్డుకు రూ. 10లక్షలు, మునగపాక మండలంలో గణపర్తి శారదా బ్రిడ్జి నుంచి వయా మెలుపాక మీదగా ఎస్సీ కాలనీ రోడ్డుకు రూ.1.25 కోట్లు, రామరాయుడు పాలెం నుండి తురగపాలెం ఎస్సీ కాలనీ వరకు రూ.1.15 కోట్లు మంజూరయ్యాయి.

అలాగే చీడికాడ మండలం పెద్దగోగాడ నుంచి వరహాపురం వరకు వేసే రోడ్డుకు రూ.32 లక్షలు, పరవాడ మండలంలో నునపర్తి రోడ్డు నుంచి గొల్లగుంట వరకు వేసే రోడ్డుకు రూ. 1.42 కోట్లు, పరవాడ గ్రామపంచాయతీ రోడ్డు నుంచి మోటరువానిపాలెం రోడ్డుకు రూ.78లక్షలు, పెందుర్తి నుంచి పద్మనాభం దేవాలయం రోడ్డుకు రూ.50 లక్షలు మంజూరు చేసింది. వీటికి సాంకేతిక అంచనాల్ని తీసుకుని వీలైనంత వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే రెండేళ్ల క్రితం మంజూరైన ఐఏపీ రోడ్లకే కనీస ప్రగతి లేదనుకుంటే కొత్తగా మంజూరైన రోడ్లకు ఇంకెన్నేళ్లు  పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
 

మరిన్ని వార్తలు