ఈ ఏడాది పోలీస్ శాఖ కొన్ని మరకలను మూటగట్టుకొంది

30 Dec, 2013 03:35 IST|Sakshi

కర్నూలు, న్యూస్‌లైన్:  శాంతిభద్రతల పరిరక్షణలో ఈ ఏడాది పోలీస్ శాఖ కొన్ని మరకలను మూటగట్టుకొంది. ప్రధానంగా దోపిడీలు, చైన్‌స్నాచింగ్ వంటి నేరాలను అదుపు చేయలేకపోయిందన్న విమర్శలు వచ్చాయి. అయితే చోరీ సొమ్ము రికవరీలో మాత్రం రెండేళ్ల కంటే కాస్త ఊరట కల్పించారు. దొంగల పాలైన సొత్తు రూ.6.50 కోట్లు కాగా, రూ.4.50 కోట్లు రికవరీ చేశారు. రోడ్డు ప్రమాదాలు గతంలో మాదిరే ఈ ఏడాదీ పునరావృతమయ్యాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే వాటి సంఖ్య ఈ ఏడాది కాస్తతగ్గింది. రాజకీయ నాయకులతో కొంతమంది పోలీస్ అధికారులు సన్నిహిత సంబంధాలు పెంచుకున్నట్లు ఆరోపణలు వచ్చా యి.

ముఖ్యంగా ఫ్యాక్షనిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన నిఘా విభాగాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్న విమర్శలు లేకపోలేదు. సల్కాపురం సమీపంలో కోడుమూరుకు చెందిన ఎరుకలి రామాంజనేయులు, ఆయన కుమారుడు వెంకట్రాముడు, కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన సహకార సంఘం అధ్యక్షుడు ఆలం బాషా దారుణ హత్యలు పోలీసుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేశాయి. క్రిష్ణగిరి సహకార బ్యాంకు సీఈఓ చిన్నసోమన్న అదృశ్యం కేసును ఇప్పటికీ ఛేదించలేకపోయారు. ఈ ఏడాదిలో ఆరునెలలపాటు ఎస్పీగా చంద్రశేఖర్ రెడ్డి పనిచేశారు. ఆయన తరువాత రఘరామిరెడ్డి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
 
 గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎస్పీ రఘురామి రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఒక్క పోలింగ్ బూత్‌లో కూడా రీపోలింగ్ జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్యాక్షనిస్టులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతోపాటు ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి సంబంధించిన సెల్‌ఫోన్లకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి బందోబస్తును పర్యవేక్షించారు. పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. ఉద్యమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
 చెల్లెలు ఆస్తికి రక్షణగా ఉన్నాడన్న కోపంతో డోన్ మం డలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డిని బంధువు లే దారుణంగా హత్య చేశారు. కర్నూలు నుంచి చిన్నమల్కాపురం వెళ్తుండగా ఎర్రగుంట్ల బ్రిడ్జి వద్ద స్కార్పియో వాహనాన్ని అడ్డగించి కత్తులతో నరికి చంపారు.
 
 పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సల్కాపురం సమీపంలో జంట హత్యలు పోలీసు శాఖను కుదిపేశాయి. ఎరుకలి వెంకట్రాముడు, ఆయన కుమారుడు రామాంజనేయులు గూడూరు నుంచి కర్నూలు కోర్టుకు వెళ్తుండగా ప్రత్యర్థులు వెంబడించి దారుణంగా హత్య చేశారు.
 
  జిల్లాలో వైఎస్సార్‌సీపీకి లభిస్తున్న ప్రజాదరణను జీర్ణించుకోలేక డోన్ పట్టణానికి చెందిన కడిమెట్ల కృష్ణ అలియాస్ కిట్టును ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. కిట్టు తండ్రి లక్ష్మన్న సహకార సంఘం ఎన్నికల్లో డోన్ ఒకటవ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి డెరైక్టర్‌గా పోటీ చేశారు. అధికార పార్టీ నాయకులకు మింగుడుపడక కిరాయి హంతకుల చేత హత్య చేయించారు.
 
 అవుకు మండలం గుండ్ల శింగవరం సబ్‌స్టేషన్ వద్ద తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆలమూరు రాముడు, బనగానపల్లె మద్దిలేటి, ఇమ్రాన్, ఆటోడ్రైవర్ మొదీన్ బాషా  మృతిచెందారు.
 
 పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ముద్ర ఉన్న నేరస్తులపై ఎస్పీ రఘురాం రెడ్డి కఠినంగా వ్యవహరించారు. పోటీలో ఉన్న అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడ్డారనే కారణంపై కప్పట్రాళ్ల మద్దిలేటి నాయుడు, మరికొంతమంది అనుచరులను పత్తికొండ పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు.
 
  కర్నూలు కేంద్రంగా పెద్ద ఎత్తున పేకాట జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు బుధవారపేటకు చెంది న మట్కాడాన్ స్థావరంపై దాడి చేశారు. వివిధ జిల్లాలకు చెందిన 58 మందిని అదుపులోకి తీసుకుని రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
 
 ఎస్పీ రఘురాం రెడ్డి జిల్లాలో ‘మీతో మీ ఎస్పీ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు శాంతిభద్రతల పరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై చెప్పుకునే అవకాశం కల్పించారు. కొంతమంది సిబ్బంది దీని నీరుగారుస్తున్నారు.
  అయ్యలూరు గ్రామానికి చెందిన న్యాయవాది సర్వేశ్వరరెడ్డికి, గంగవరం గ్రామానికి చెందిన పద్మనాభరెడ్డికి మధ్య ఉన్న పొలం తగాదా కారణంగా కోర్టుకు వెళ్లి వస్తున్న సర్వేశ్వరరెడ్డి వాహనాన్ని జీపుతో ఢీకొట్టి వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు.
 
 నిరుద్యోగ యువత ఫ్యాక్షన్ బారిన పడకుండా ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలో ఫ్యాక్షన్ విస్తరించడానికియువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడమేనని గుర్తించారు.  కృష్ణపట్నం పోర్టులో సెక్యూరిటీ ఉద్యోగాల ఎంపికకు చర్యలు తీసుకున్నారు.
 
  పోలీసు శాఖపై అధికార పార్టీ పెత్తనంపై కఠినంగా వ్యవహరిం చిన ఎస్పీ రఘురామి రెడ్డిని హైదరాబాదు సౌత్‌జోన్ డీసీపీగా బదిలీ చేసి శంషాబాద్ డీసీపీగా ఉన్న రమేష్‌నాయుడును నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.  నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిం చారంటూ ఎస్పీ క్యాట్‌ను ఆశ్రయించి తాత్కాలికంగా నిలుపుదల చేయించుకున్నారు.
 
 క్రికెట్ బెట్టింగ్, జల్సాల కోసం చేసిన అప్పులు తీర్చడానికి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడి ఇంజనీరింగ్ విద్యార్థులు హకీం సమీర్, జయసూర్య సింహారెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు  కటాకటాలపాలయ్యారు.
 
  గుప్త నిధుల వేటలో రంగారెడ్డి జిల్లా పాల్మాకుల గ్రామానికి చెందిన బుర్ర నాగరాజు, రమాదేవి మృత్యు ఒడి చేరారు. డోన్ మండలం వెంకటాపురం బొంతిరాళ్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జీవితంలో ఒకేసారి ధనవంతులమైపోదామన్న దురాశతో తమ జీవితాలనే బలి తీసుకున్నారు.
 
 సమస్యల పరిష్కారం కోసం పోలీస్ దర్బార్
 
 సొంతశాఖ సిబ్బంది సమస్యలపై ఎస్పీ రఘురామిరెడ్డి దృష్టి సారించారు. జిల్లా కేంద్రంతో పాటు సబ్ డివిజన్ స్థాయిలో పోలీసు దర్బార్ నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించేవారితో పాటు అవినీతికి పాల్పడేవారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా సొంత శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ఖాళీలను బట్టి అడిగిన చోటుకే పోస్టింగ్‌లు ఇస్తూ పైరవీలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు.

>
మరిన్ని వార్తలు