ఆగని అకృత్యాలు

29 Dec, 2013 05:31 IST|Sakshi

ఈ ఏడు నేర సంస్కృతి మరింత జడలు విప్పింది. నిత్యం ఏదో ఓ చోట చోరీలు, ఒకరిపై ఒకరు దాడులు, చీటింగ్ తదితర నేరాలు పెచ్చుమీరాయి. మహిళలపై దాడులు పెరిగిపోయాయి. నిర్భయ కేసులు కలవరపెడుతున్నాయి. వరకట్న, శారీరక వేధింపుల సంఖ్య పెరిగింది. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఒకే ఘటనలో ఇద్దరు, ముగ్గురు దుర్మరణం పొందిన కేసులు ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం రూ.7.46 కోట్ల సొత్తు దొంగలు అపహరించారు. గతేడాదితో పోల్చుంటే తక్కువే అయినప్పటికీ.. రికవరీ చేయడంలో పోలీసులు చాలా వెనుకబడ్డారు.
 - సాక్షి, నల్లగొండ
 
 రాలిన ప్రేమసుమాలు...
 జనవరి 8 : వరంగల్ జిల్లాకు చెందిన ప్రేమికులు రాజు, పూజ ఆలేరులో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెళ్లికి పెద్దలు నిరాకరించారని మనస్తాపం చెందిన వీరు కలిసి ప్రాణం తీసుకున్నారు.
 
 జనవరి 15 : పెళ్లికి కుటుంసభ్యులు నిరాకరించడంతో మనస్తాపం చెందిన కర్ణాకర్, రత్నకుమారి కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపితాగి అవని నుంచి దూరమయ్యారు.
 
 ఫిబ్రవరి 22 : చిట్యాల శివారులో ప్రేమికుల జంట ఆత్మహత్యకు ఒడిగట్టింది. విజయవాడకు చెందిన నాగరాజు, పద్మ పురుగు మందుతాగి బలవర్మరణానికి పాల్పడ్డారు.
 
 నెత్తురోడిన రహదారులు
 ఫిబ్రవరి 2 : కేతేపల్లి ఇనుపాముల శివారులో ఆటోను తవేరా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 14 మందికి గాయాలయ్యాయి.
 
 ఫిబ్రవరి 7 : కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద స్కార్పియో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న తాటిచెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ఇందులో ఇద్దరు భార్యాభర్తలున్నారు.
 
 మే 29 : నకిరేకల్ బైపాస్ రోడ్డులో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మృత్యు ఒడికిచేశారు. 12 మంది క్షతగాత్రులయ్యారు. మృతి చెందినవారిలో నలుగురు ప్రయాణికులు, కండక్టర్ ఉన్నారు.
 
 జూలై 2 : చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టింది. కూతురిని మెడికల్ కళాశాలలో చేర్పించడానికి హైదరాబాద్ నుంచి నార్కట్‌పల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తల్లి, కూతురు, కొడుకు, ఆడపడుచు, డ్రైవర్ విగత జీవులయ్యారు.
   
 ఆగస్టు 14 : నార్కట్‌పల్లి - అద్దంకి బైపాస్ రోడ్డులో వేములపల్లి వద్ద ఆంబులెన్స్‌ను రాంగ్ రూట్‌లో వెళ్లి డీసీఎం ఢీ కొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
 
 ఆగస్టు 15 : ప్రజలంతా ఓ వైపు స్వాతంత్య్ర దినోత్సవాల్లో మునగగా.. నార్కట్‌పల్లి వద్ద టీడీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు లాన్‌జాన్‌బాషా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతివేగంగా ప్రయాణిస్తున్న అతని కారు రోడ్డు రేలింగ్‌కు ఢీ కొట్టింది. తీవ్రగాయాలవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
 
 సెప్టెంబర్ 19 : హైదరాబాద్ - సాగార్జునసాగర్ రహదారిలో ఉన్న చింతపల్లి మండలం రాజ్యాతండా వద్ద రాత్రి 11.30 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 11 మంది దుర్మరణం చెందగా... 15 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి.
 
 ఆస్తుల రికవరీ నామమాత్రమే..
 ఏటేటా దొంగలు కొల్లగొడుతున్న ఆస్తుల సంఖ్య పెరుగుతోంది. అయితే వాటిని రికవరీ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఈ ఏడాది రికవరీ మరింత దిగజారింది. మొత్తం రూ.7.46కోట్ల విలువైన సొత్తును దొంగలు అపహరించగా... రూ.3.49 కోట్ల ఆస్తిని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. రికవరీ  ఈ ఏడాది 46.79 శాతానికి పడిపోయింది.
 
 తగ్గిన ప్రమాదాలు
 జిల్లాలో ఈ ఏడాది కూడా నెత్తుటేరులు పారాయి. రోడ్డు ప్రమాదాలు గతేడాది కంటే స్వల్పంగా తగ్గినా.. ప్రమాదాలు జరిగిన తీరు భీతిగొల్పాయి. ఒకే ప్రమాదంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది దుర్మరణం చెందిన ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ - విజయవాడ, నార్కట్‌పల్లి - అద్దంకి రహదారులపై ఘోర ప్రమాదాలు సంభవించాయి. గతేడాది కంటే దాదాపు 8 శాతం ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జరిగిన 1,958 రోడ్డు ప్రమాదాల్లో 775 మంది మృత్యువాత పడ్డారు.  గత నాలుగేళ్లుగా చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
 
 అమ్మో కిడ్నాపా...!
 కిడ్నాప్ అంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కిడ్నాప్‌కు గురైన వ్యక్తులు చాలా సార్లు హత్యకు గురికావడమే ఇందుకు ముఖ్య కారణం. కిడ్నాప్‌ల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది 88 కిడ్నాప్ కేసులను పోలీసులు నమోదు చేసుకున్నారు.
 
 పెరిగిన ఎస్సీ, ఎస్టీ నేరాలు..
 గతేడాది కంటే ఈసారి ఎస్సీ, ఎస్టీ నేరాలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది 248 ఫిర్యాదులు రాగా.. అందులో 52 తప్పుడు ఫిర్యాదులను పోలీసులు నిర్ధరించి కొట్టి వేశారు. ఎస్సీ, ఎస్టీ యాక్టు కేసులు  44 నమోదు కాగా..  14 కేసులు కొట్టివేశారు.
 
 మహిళలపై పెచ్చుమీరిన నేరాలు
 మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. దీంతో వారి మనుగుడే ప్రశ్నార్థకంగా మారుతోంది. గడిచిన రెండేళ్ల కంటే ఈ ఏడాది మహిళలపై దాడులు అధికమయ్యాయి. గతేడాది 1,327 కేసులు నమోదుకాగా.. ఈఏడాది 1,426కు పెరిగాయి. కట్నం కోసం మూడు హత్యలు జరిగాయి. గతంతో పోల్చుకుంటే ఈ హత్యలు, ఆత్మహత్యలకు ప్రేరేపించడం వంటి ఘటనలు తగ్గుముఖం పట్టాయి. వరకట్న కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టణం శుభపరిణామం. వేధింపులు, లైంగికదాడులు మాత్రం తగ్గగపోగా... రోజురోజుకూ పెరుగుతున్నాయి.
 
 తగ్గిన హత్యలు..
 హత్య ఘటనలు గతంతో పోల్చుకుంటే కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది హత్యలు 84 జరిగాయి. హత్యాయత్నాలు గతేడాది కంటే 5 పెరిగాయి. హత్యకు కుట్రపన్నిన కేసుల సంఖ్య గత రెండేళ్ల కంటే ఎగబాకింది.
 
 ‘నిర్భయ’ వచ్చినా..
 మృగాళ్ల కన్ను పసిమెగ్గలపై పడింది. చిన్నారులపై లైంగిక దాడులు, లైంగికదాడికి యత్నాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఓబాలికపై లైంగికదాడి చేసి కిరాతకంగా మట్టుబెట్టాడో దుర్మార్గుడు. 18 ఏళ్లలోపు బాలికలపై లైంగికదాడులకు సంబంధించి 17 కేసులు, అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మరో 17 కేసులు నమోదు చేశారు. ఇలామొత్తం 38 కేసులు పోక్సో చట్టం కింద నమోదయ్యాయి. 18 ఏళ్లు పైబడి న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, హత్య చేయడం వంటి నేరాలకు పాల్పడినందుకు నిర్భయ చట్టం కింద 14 కేసులు నమోదయ్యాయి. చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ‘నిర్భయ’ కింద మొత్తం 52 కేసులు నమోదయ్యాయి.
 
  సంచలన హత్యలు, ఘటనలు...
 మార్చి 1 : నల్లగొండ మండలం పానగల్ చెరువు వద్ద ముగ్గురు యువకులు దారుణహత్యకు గురయ్యారు. పాత కక్షలు మనసులో పెట్టుకుని పీఏపల్లి మండలానికి చెందిన ఇద్దరితో పాటు హైదరాబాద్‌కు చెందిన ఒకర్ని వెంటాడి హతమార్చారు.
 ఏప్రిల్ 29 : జిల్లాకేంద్రంలోని మాన్యంచెల్కకు చె ందిన 11 ఏళ్ల బాలిక ఉస్మతున్నిసా కామాంధుడి చేతిలో బలైంది. బాలికపై అత్యాచారానికి పాల్పడి అతికిరాతకంగా ఆమెను హతమార్చాడు. ఈ ఘటనపై జిల్లాలో ‘నిర్భయ చట్టం’ కింద కేసు నమోదైంది. ఇదేరోజు వేధింపులు భరించలేక కనగల్ మండలం తుర్కపల్లికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నెలో ఎనిమిదేళ్ల బాలిక లైంగికదాడికి గురైంది.
 నవంబర్ 5 : నల్లగొండ మండలంలోని శేషమ్మగూడెంలో ఇద్దరు వ్యక్తుల్ని మంత్రాల నెపంతో అతిదారుణ ంగా హత్యచేశారు.
 
 నవంబర్ 6 : చిలుకూరు మండలం రామాపురం ఉన్నత పాఠశాల విద్యార్థిని పట్ల ప్రధానోపాధ్యాడు కీచకంగా ప్రవర్తించాడు. అభంశుభం తెలియని వయసులో ఆమెను గర్భవతి చేసి ఆపై ఆబార్షన్ చేయించాడు. ఈ ఘటనలో ఆ హెచ్‌ఎంతోపాటు ఐదుగురు ఉపాధ్యాయులు, ఇద్దరు మధ్యవర్తులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది.
 
 న వంబర్ 23 : సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో నిలిపి ఉన్న బస్సులోంచి 2.60 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. 15 రోజులపాటు పోలీసులు కష్టపడి ఈ కేసును ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు.
 
 డిసెంబర్ 17 : జిల్లాకేంద్రంలో బీటెక్ విద్యార్థిని తలారి అరుణపై ఓ ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో ఆమె ఆరు రోజులపాటు నరకం అనుభవించి మృత్యుఒడికి చేరింది. ఈ ఘటన జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
 
 పెరిగిన నేరాల సంఖ్య..
 జిల్లాలో ఈ ఏడాది నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. గతేడాది మొత్తం 8,499 కేసులు నమోదు కాగా.. ప్రస్తుత ఏడాదిలో 9,590 కేసులు నమోదు చేశారు. ఇందులో 427 కేసులకు సంబంధించి శిక్షలు ఖరార య్యాయి. 119 కేసులను కోర్టు కొట్టివేంది. 5,465 కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి.
 
 వీటిపై కోర్టు తీర్పు వె ల్లడించాల్సి ఉంది. 2,66 కేసులు విచారణ స్థాయిలో ఉన్నాయి. అంతేగాక ప్రత్యేక, స్థానిక శాంతిభద్రతల (ఎస్‌ఎల్‌ఎల్), సీఆర్‌పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సీఆర్‌పీసీ సెక్షన్ల కింద 4,848 కేసులు, ఎస్‌ఎల్‌ఎల్ కింద 122 కేసులను పోలీసులు నమోదు చేసుకున్నారు. సైబర్ నేరాల సంఖ్య పెరిగింది. గతేడాది 5 జరగగా.. ఈ ఏడాదిలో 9 నమోదయ్యాయి. రాత్రి పూట చోరీలు, సాధారణ దొంగతనాలు, దోపిడీల సంఖ్య కూడా పెరిగింది.
 

మరిన్ని వార్తలు