నిశ్చింతకు నోచేదెన్నడు?

4 Jan, 2015 01:06 IST|Sakshi
నిశ్చింతకు నోచేదెన్నడు?

 సఖినేటిపల్లి/ మలికిపురం :కోనసీమ గుండెల్లో గుబులు కొనసాగుతూనే ఉంది. కలుగుల్లోని కాల సర్పాల్లా.. అంతటా పరుచుకుని ఉన్న చమురు, సహజవాయువుల పైపులైన్ల ‘బుసబుసలు’  ఆ గడ్డ చెవుల్లో కఠోరంగా మార్మోగుతూనే ఉన్నాయి. ఆ బుసబుసలు శాశ్వతంగా సద్దుమణగాలని, కాలయముని క్రోధాగ్ని లాంటి కీలలు మరోసారి తమ సీమలో రగలరాదని కోనసీమవాసులు గాఢంగా కోరుతున్నారు. నగరం గ్రామంలో 22 మందిని పొట్టన పెట్టుకున్న గెయిల్ ప్రధాన పైపులైన్ విస్ఫోటం అనంతరం కొంత కాలం గ్యాస్ ఉత్పత్తి, సరఫరా నిలిపి వేశారు. కోనసీమలో 300కి పైగా బావులుండగా ప్రస్తుతం మోరి జీసీఎస్ పరిధిలోని 30 బావుల్లో గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. విస్ఫోటం అనంతరమూ పలు చోట్ల గ్యాస్ లీక్ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
 
 ఉత్పత్తి నిలిపివేసిన బావుల్లో ఒత్తిడి కారణంగా లీకవుతున్నాయి. బావుల క్యాప్‌లు శిథిలస్థితికి చేరడంతో బావి నుంచి వచ్చే గ్యాస్ ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నాయి. బావుల నుంచి గ్యాస్ సరఫరా అవుతున్న చోట పైపులైన్లు శిథిలావస్థకు చేరడం వల్ల లీకేజీలు సంభవిస్తున్నాయి. అలాగే చమురు బావులు, పైపులైన్ల లీకేజీ సంఘనలు కూడా ఇక్కడ  కొనసాగుతున్నాయి. నగరం పైప్‌లైన్ విస్ఫోటం అనంతరం  కేశనపల్లి, మోరి, అడవిపాలెం, తాటిపాక  జీసీఎస్‌ల పరిధిలో సుమారు ఆరు ప్రాంతాల్లో గ్యాస్, ఆయిల్ లీకేజీ సంఘటనలు జరిగాయి. పలు చోట్ల ఇవి తక్కువస్థాయికే పరిమితమయ్యాయి.
 
 మరో ఘోరం జరక్క ముందే మేలుకోండి..
 కోనసీమ ఎన్నటికీ మరిచిపోలేని పీడకలలాంటి నగరం విస్ఫోటం అనంతరం కూడా ఓఎన్‌జీసీ అధికారులు ఈ ప్రాంత ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బావుల పర్యవేక్షణ సరిగా ఉండడం లేదని, వెల్ క్యాప్‌లు, ఇతర పరికరాలు, పైపులైన్లు శిథిలస్థితికి చేరాయని, అయినా వాటిని తక్షణం మార్చే పూనిక కానరావడం లేదని స్థానికులు వాపోతున్నారు. జరగరానిది మరోసారి జరగకముందే.. ఓఎన్‌జీసీతో పాటు ప్రభుత్వాధికారులూ మేలుకోవాలంటున్నారు. కంటికి కునుకును, మనసుకు నిశ్చింతనూ కరువు చేస్తున్న లీకేజీలను వెంటనే అరికట్టాలని, శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు