ఓటరు జాబితా సవరించాలి

13 Sep, 2013 04:25 IST|Sakshi
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : 2014 ఫొటో ఓటర్ల జాబితా తయారీ కోసం ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 3వ తేదీలోగా సవరణలు పూర్తి చేయాలని డెప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుట్సి జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల నమోదు, పేర్ల మార్పులు, చేర్పులు, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు తదితర సవరణలు పూర్తి చేయాలని సూచించారు. అక్టోబర్ మూడో తేదీ వరకు పూర్తి చేసి ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితా ప్రకటించాలని అన్నారు. 
 
 ఇంటింటి సర్వేలో భాగంగా బోగస్‌గా గుర్తించిన ఓటర్లను పరిశీలించి తొలగించాలని తెలిపారు. చనిపోయిన, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి నివాసం ఉంటున్న వారిని గుర్తించాలని పేర్కొన్నారు. అందరు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. 2014 ఫొటో ఓటర్ల జాబితా తయారీకి సిద్ధంగా ఉండాలని చెప్పారు. కలెక్టర్ అహ్మద్ బాబు మాట్లాడుతూ ఓటర్ల నమోదు కోసం జిల్లాలో ఇప్పటివరకు 85వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.
 
 మార్పులు, చేర్పులకు సంబంధించి 1.15లక్షల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. కొత్తగా ఓటు నమోదుకు 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కుల నుంచి 40 వేల దరఖాస్తులు అందాయని వివరించారు. ఇంటింటి సర్వేలో భాగంగా ఇప్పటివరకు 59,288 ఫొటోలను సేకరించామని అన్నారు. 237 పోలింగ్  కేంద్రాలు ఉండగా ఏడింటిని మార్చామని తెలిపారు. జిల్లాలో 52 మండలాలకు గాను 23 మంది తహశీల్దార్లు మాత్రమే ఉన్నారని, ఖాళీలను భర్తీ చేయాలని వివరించారు. ఈవీఎం గోదాముల నిర్మాణాన్ని ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎస్‌ఎస్ రాజు, కలెక్టరేట్ పర్యవేక్షకుడు ప్రభాకర్‌స్వామి పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు