కందిపప్పులో 'పందికొక్కులు'

12 Aug, 2018 04:13 IST|Sakshi

మధ్యాహ్న భోజనంలో రూ.65 కోట్లకు ఎసరు!

2.10 కోట్ల కిలోల కందిపప్పు సరఫరా కాంట్రాక్టులో మాయాజాలం

కిలో రూ.52కే దొరుకుతున్నా రేటు రూ.80కి పెంచి టెండర్లు

అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టు

ప్రభుత్వ సంస్థలను పక్కనపెట్టి ప్రైవేట్‌కు అప్పగింత 

కేసులు దాఖలు కావడంతో రాజీ కుదిర్చిన మంత్రులు

సాక్షి, అమరావతి: చిన్నారుల నోటికాడ ముద్దనూ బొక్కేయడానికి వెనుకాడని దారుణం ఇదీ. మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు వండి పెట్టాల్సిన కందిపప్పు సరఫరా టెండర్లలో భారీ అక్రమాలకు తెరతీశారు. జిల్లాలవారీగా ఉన్న కందిపప్పు సరఫరా టెండర్‌ను రాష్ట్రస్థా యిలో కేంద్రీకృతం చేయడం ద్వారా రూ.65 కోట్ల దాకా కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేశారు. ఇందులో ఇద్దరు మంత్రు లు ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణ లున్నాయి. దీనికి సంబంధించి న్యాయస్థా నంలో వ్యాజ్యాలు దాఖలైనా టెండర్లలో పాల్గొన్న కంపెనీల మధ్య సెటిల్మెంట్లు కుదిర్చి వాటాల వసూలుకు ప్రణాళిక రచించారు. హోల్‌సేల్‌ మార్కెట్లో కందిపప్పు కిలోకు రూ.52 లోపే ఉన్నా రూ.80కి పెంచి ఆమేరకు ముడుపులు పొందేందుకు పథకం వేశారు.

2 కోట్ల కిలోల కొనుగోలుకు టెండర్లు
రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లలకు రోజూ కందిపప్పును ఆహార పదార్థంగా వడ్డించాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 20 గ్రాములు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిత్యం 30 గ్రాముల చొప్పున కందిపప్పును అందించాలి. రాష్ట్రంలోని 45,932 పాఠశాలల్లో 36,78,538 మంది విద్యార్థులకు ఏటా 2,10,10,497.20 కిలోల కందిపప్పు అవసరం. గతంలో మధాహ్న భోజన పథకం సరకులను జిల్లాలవారీగా కలెక్టర్ల ద్వారా టెండర్లు పిలిచి సరఫరా చేశారు. ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సరకుల సరఫరా టెండర్లను రాష్ట్రస్థాయిలో కేంద్రీకృతం చేశారు. దాదాపు రూ.165 కోట్ల విలువైన టెండర్‌ను  తమకు నచ్చిన కంపెనీకి అప్పగించేలా పావులు కదుపుతున్నారు. 

ప్రభుత్వరంగ సంస్థలను కాదని ప్రైవేట్‌కు...
కందిపప్పు సరఫరా కోసం పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్లు పిలిచింది. ఏటా రూ. 145 కోట్ల టర్నోవర్‌తో గత మూడేళ్లలో రూ.435 కోట్ల టర్నోవర్‌ కలిగిన కంపెనీలు ఇందులో పాల్గొనాలని నిబంధన విధించింది. ఎనిమిది సంస్థలు టెండర్లు దాఖలు చేయగా కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్‌ సంస్థకు మాత్రమే టెండర్‌ నిబంధనల్లో పేర్కొన్నట్లుగా రూ.145 కోట్ల టర్నోవర్‌ అర్హత ఉంది. తక్కిన ఏ సంస్థకూ ఆమేరకు టర్నోవర్‌ లేదు. టెక్నికల్‌ బిడ్లను తెరిచిన అధికారులు అర్హత ఉన్నా కృష్ణా సహకార మార్కెటింగ్‌ సంస్థను పక్కనపెట్టారు. విశాఖకు చెందిన కేంద్రీయ భాండార్, నేషనల్‌ కోపరేటివ్‌ కన్సూ్యమర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్,  నెల్లూరుకు చెందిన ఎంఎస్‌.పూరి జగన్నాథ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థల టెండర్లను మాత్రమే ఆమోదించారు. కిలో కందిపప్పు సరఫరాకు కేంద్రీయ భాండార్‌ రూ.87, నేషనల్‌ కోపరేటివ్‌ కన్సూ్యమర్‌ ఫెడరేషన్‌ రూ.86, పూరి జగన్నాథ్‌ ఎంటర్‌ప్రయిజెస్‌ సంస్థ రూ.84 చొప్పున టెండర్‌ దాఖలుచేశాయి. టర్నోవర్‌ నిబంధనల ప్రకారం వీటికి అర్హత లేకున్నా తక్కువ రేట్‌ కోట్‌ చేసిందంటూ పూరి జగన్నాథ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థకు కందిపప్పు సరఫరా కాంట్రాక్టు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

నిబంధనలకు విరుద్ధంగా టెండర్‌ ఉన్నా ఓకే...
పూరి జగన్నాథ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు పంపిణీ చేసే స్నాక్స్‌ సరఫరా చేసిన అనుభవం మాత్రమే ఉంది. ఈ సంస్థ దాఖలు చేసిన పత్రాల్లో  2014–15లో రూ. 2.17 కోట్లు, 2015–16లో రూ. 1.18 కోట్లు, 2016–17లో 0.04 కోట్లు మాత్రమే టర్నోవర్‌ ఉంది. టెండర్‌ నోటిఫికేషన్ల ప్రకారం ఏటా 145 కోట్ల టర్నోవర్‌ లేకపోవడంతో అక్రమాలకు తెగబడింది. చెన్నైకి చెందిన అరుణాచల్‌ ఇంప్లెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు సంబంధించిన టర్నోవర్‌ను తనదిగా పేర్కొంటూ టెండర్‌ పత్రాల్లో చూపించింది. పూరి జగన్నాథ్‌ సంస్థ మూడేళ్ల టర్నోవర్‌ దాదాపు రూ.3 కోట్లే ఉన్నా  అరుణాచల్‌ ఇంపెక్స్‌ సంస్థ టర్నోవర్‌ను కలిపి రూ.523 కోట్లు  ఉన్నట్లుగా తప్పుడు లెక్కలు చూపింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ సంస్థకు టెండర్‌ను ఓకే చేసి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

కంపెనీలతో మంత్రుల సెటిల్‌మెంట్లు
మరికొద్ది రోజుల్లో ఫైనాన్సియల్‌ బిడ్లను కూడా ఓపెన్‌ చేసి కందిపప్పు సరఫరా టెండర్‌ను ఖరారు చేయనున్నారు. నెల్లూరు చెందిన పూరి జగన్నాథ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ఓ మంత్రి ద్వారా తెరవెనుక వ్యవహారాన్ని నడిపించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో విశాఖ కేంద్రీయ భాండార్, నేషనల్‌ కోపరేటివ్‌ కన్సూ్యమర్‌ ఫెడరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థల ప్రతినిధులు తమ జిల్లాకు చెందిన మంత్రిని కలిసి దీనిపై నివేదించడంతో ఇద్దరు మంత్రులూ కలసి ఈ మూడు సంస్థల మధ్య రాజీ కుదిర్చి వ్యవహారాన్ని సెటిల్‌ చేశారు. దీని ప్రకారం పూరి జగన్నాధ్‌ సంస్థకు 3 జిల్లాలు, కేంద్రీయ భాండార్‌కు 6 జిల్లాలు, నేషనల్‌ కోపరేటివ్‌ కన్సూ్యమర్‌ ఫెడరేషన్‌కు 4 జిల్లాల్లో కందిపప్పు సరఫరా కాంట్రాక్టు అప్పగిస్తూ ఇద్దరు మంత్రులు సర్దుబాటు చేశారు.

కిలో కందిపప్పు రూ.52 నుంచి రూ.79కి పెంపు
ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు రూ. 48 నుంచి 52 మధ్య మాత్రమే ఉంది. అయితే రూ. 27 నుంచి రూ. 30 మేర ధర అధికంగా పెంచి కిలో రూ.79 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి 2.10 కోట్ల కిలోలు  కొనుగోలు చేస్తున్నందున ధర ఇంకా భారీగా తగ్గుతుంది. రూ.52 చొప్పున 21010497.20 కిలోల కొనుగోలుకు రూ.109,25,45,854 అవుతుంది. కానీ  ధరను  రూ.79కి పెంచేయడంతో రూ. 165,98,29,278 కోట్లకు చేరింది. అంటే  ఖజానాపై రూ.56,72,83,426 అదనంగా భారం పడనుంది. ఈ రూ.56.72 కోట్లు ముడుపుల రూపంలో చేతులు మారనున్నాయి. అయితే హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నందున కిలో రూ.52 కన్నా ఇంకా తక్కువకే లభించే అవకాశం ఉంది. అప్పుడు ఈ ముడుపుల బాగోతం రూ.65 కోట్ల నుంచి రూ.70 కోట్లకు చేరుతుంది. ఇంత భారీగా ముడుపులు దక్కుతుండటంతోనే ఈ కాంట్రాక్టును రాష్ట్రస్థాయిలో కేంద్రీకృతం చేశారని చెబుతున్నారు. 

మార్క్‌ఫెడ్‌కు మొండిచేయి... 
తమ సంస్థకు అర్హత ఉన్నా టెండర్ల నుంచి పక్కకు తప్పించడం, తెరవెనుక వ్యవహారాలపై కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్‌ సంస్థ న్యాయస్థానంలో వ్యాజ్యం వేసింది. ప్రస్తుతం టెక్నికల్‌ టెండర్‌లో ఆమోదించిన పూరి జగన్నాథ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు అర్హత లేకపోగా విశాఖకు చెందిన మిగతా రెండు సంస్థలు బ్లాక్‌లిస్టులో ఉన్నాయని ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రస్తుతం స్టే ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయితే భారీ ముడుపుల వ్యవహారం కావడంతో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి కృష్ణాజిల్లా సహకార మార్కెటింగ్‌ ముఖ్యులతో సెటిల్‌మెంట్‌ చేయించారు. కేసును ఉపసంహరించుకుని తమకు కావాల్సిన మూడు సంస్థలకు టెండర్లు కట్టబెట్టేలా రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. 

మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో ముక్కిపోతున్న కందులు
కృష్ణా జిల్లా మార్కెటింగ్‌ సంస్థ ఛైర్మన్‌ కంచి రామారావు రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా అవసరమైన కందిపప్పును ప్రభుత్వమే కొనుగోలు చేసి మధ్యాహ్న బోజన పథకానికి అందచేస్తే తక్కువ ధరకే దక్కటంతోపాటు రైతులకు కూడా మేలు జరిగేది. రైతుల నుంచి కొనుగోలు చేసిన కందులను రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉన్న మిల్లులకు అందించి కందిపప్పును మార్క్‌ఫెడ్‌ ద్వారా సరఫరా చేయిస్తే వేలాది మంది కార్మికులకు మేలు జరిగేది. ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన 80 వేల టన్నుల కందులు గోడౌన్లలో మగ్గుతున్నాయి. కానీ ముడుపులపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు దీన్ని పట్టించుకోకుండా అర్హతలు లేని ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధపడ్డారు.

మరిన్ని వార్తలు