ఏపీపై 2,16,027 కోట్ల అప్పుల భారం

7 Feb, 2018 08:38 IST|Sakshi

పార్లమెంట్‌కు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

గత ఏడాది మార్చి నాటికి రాష్ట్ర అప్పులపై ప్రకటన

ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబు ఇచ్చిన కేంద్ర మంత్రి పొన్‌.రాధాకృష్ణ

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌పై గత ఏడాది మార్చి నాటికి రూ.2,16,027 కోట్ల మేర అప్పుల భారం ఉన్నట్లు ఆర్థికశాఖ సహాయ మంత్రి పొన్‌.రాధాకృష్ణ రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి మంగళవారం అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఈ వివరాలు వెల్లడించారు. అప్పులపై 2017–18 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ కింద రూ.14,738 కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంచనా వేసిందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం రూపొందించిన ద్రవ్య సూచిక ప్రకారం రాష్ట్ర స్థూల ఆదాయంలో అప్పుల నిష్పత్తి 2017–18 ఆర్థిక సంవత్సరానికి 25.09% ఉంటుందని అంచనా వేయగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 28.11%కు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేసిందన్నారు. రాష్ట్ర ప్రజల తలసరి అప్పు ఎంత ఉందో చెప్పడానికి అధికారిక గణాంకాలు ఏవీ అందుబాటులో లేవన్నారు.     

ఫార్మా డీ గ్రాడ్యుయేట్ల ఉద్యోగాల కోసం పలు చర్యలు
ఫార్మా డీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాల కల్పన కోసం ప్రభుత్వం పలు  చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి  జేపీ నడ్డా తెలిపారు. ఆరేళ్ల ఫార్మా డీ కోర్సు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ ఆరోగ్య విభాగం, ప్రైవేట్‌ ఆస్పత్రులలో తమ అర్హతకు తగిన ఉద్యోగాలు రాక మానసిక క్షోభకు గురవుతున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ దృష్టికి తెచ్చారు. సీనియర్‌ ఫార్మసిస్ట్, చీఫ్‌ ఫార్మసిస్ట్, డ్రగ్‌ ఇన్ఫర్మేషన్‌ ఫార్మసిస్ట్‌ లాంటి ఉద్యోగాలకు అర్హుల జాబితాలో ఫార్మా డీ గ్రాడ్యుయేట్లను కూడా చేర్చినట్లు మంత్రి తన జవాబులో వివరించారు. ఫార్మసిస్ట్‌ పోస్టుకు ఫార్మా డీను విద్యార్హతగా నిర్ధారిస్తూ నియామక నిబంధనలు సవరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) లేఖలు రాసిందన్నారు. ఫార్మా డీ గ్రాడ్యుయేట్లు ఫార్మసీ కళాశాలల్లో బోధన నిర్వహించేందుకు కూడా అర్హులేనని చెప్పారు.    

ఇంకా మదింపు దశలోనే ప్రపంచ బ్యాంకు రుణం  
రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రూ.3,324 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం ఇంకా పరిశీలన దశలో ఉన్నట్లు కేంద్ర మంత్రి రాధాకృష్ణ తెలిపారు. విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... ఈ ప్రాజెక్టుపై ప్రపంచబ్యాంకు బృందం మదింపు చేస్తోందని, ఇది ఇంకా ప్రాథమిక అంచనాలు, అధ్యయనాల దశలోనే ఉందని తెలిపారు. మదింపు, సంప్రదింపులు పూర్తయిన తర్వాతనే రుణానికి ప్రపంచబ్యాంకు ఆమోద ముద్ర వేస్తుందన్నారు. ఈ సందర్భంగా అమరావతి కేపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఉన్నతాధికారి ఒకరు ఈ ప్రాజెక్ట్‌కు రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్‌ ఆమోదం తెలిపినట్లుగా మీడియా ప్రతినిధులకు చేసిన ప్రకటనను విజయసాయిరెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. గత పార్లమెంట్‌ సమావేశాల్లో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనకు విరుద్ధంగా తాము ఏమీ మాట్లాడలేదంటూ ఆ ఉన్నతాధికారి వివరణ ఇచ్చారని తెలిపారు.

మరిన్ని వార్తలు