216 జాతీయ రహదారి ఎటు!

22 Apr, 2016 00:53 IST|Sakshi

నరసాపురం అర్బన్ : నరసాపురం మీదుగా విస్తరణకు సిద్ధమవుతున్న 216 జాతీయ రహదారి రూట్‌మ్యాప్ విషయంలో స్పష్టత కరువైంది. ముఖ్యంగా నరసాపురం పట్టణంలో మార్కెట్ ప్రాంతం మీదుగా ఈ దారి ఎలా వెళ్తుందనే విషయంలో అధికారులు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు భూసేకరణ తతంగం పూర్తవుతోంది. మార్కెట్ ప్రాంతాన్ని, వివాదంలో ఉన్న మొగల్తూరు మండలం కాళీపట్నం జమిందారీ భూముల ప్రాంతాన్ని మినహాయించి ప్రస్తుతానికి భూసేకరణ అంశాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు.
 
 జిల్లా అదనపుజాయింట్ కలెక్టర్ ఎంఏ షరీఫ్ ఆధ్వర్యంలో భూసేకరణ జరుగుతోంది. నరసాపురం పట్టణానికి సంబంధించి శ్రీహరిపేట, రుస్తుం బాద ప్రాంతాల్లో విలువైన భూములు, ఆస్తులు ఉన్నాయి. వీరికి ఇప్పటికే నోటీసులు ఇచ్చిన రెవెన్యూ అధికారులు పరిహారం చెల్లింపుపై సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే పరిహారం మరీ తక్కువ ఇవ్వజూపుతున్నారంటూ బాధితులు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు.
 
  శ్రీహరిపేట వాసులైతే తమకు ఎలాంటి పరిహారం అక్కరలేదని, తమ స్థలాలలకు బదులు, వేరేచోట స్థలాలు ఇప్పించాలని ఇప్పటికే ఏజేసీని కలసి డిమాండ్ చేశారు. మరో వైపు రూట్‌మ్యాప్ విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అంబేడ్కర్ సెంటర్‌లో అత్యంత విలువైన ఆస్తులున్న వారు, ఎటుతిరిగి ఎటు వస్తుందోనని గుబులు చెందుతున్నారు. ఇక కాళీపట్నం భూములు ఎలాగూ ప్రభుత్వానివేనని, ఎలాంటి పరిహారం ఇవ్వబోమనే వాదనలు అధికారుల నుంచి వస్తున్నాయి. ఇదికూడా వివాదమయ్యే అవకాశం కనిపిస్తోంది.
 
 అంబేడ్కర్ సెంటర్ జోలికి రాకుండా..ప్లై ఓవర్..
 యలమంచిలి మండలం చించినాడ నుంచి నరసాపురం, మొగల్తూరు మీదుగా కృష్ణాజిల్లా లోసరిగూట్లపాడు వరకూ 60కిలో మీటర్ల మేర 216 జాతీయ రహదారిని విస్తరించడానికి ఏడాది నుంచి కసరత్తు జరుగుతోంది. రోడ్డును ఏడు మీటర్లు మేర విస్తరించడానికి నిర్ణయించి, భూసేకరణకు పూనుకున్నారు. సర్వే జరిపి నోటీసులు అందించారు. నరసాపురం పట్టణంలో రోడ్డును ఎటువైపు తీసుకెళ్లాలనే విషయంపై సందిగ్ధం నెలకొంది. ఇక్కడ రెండు ప్రతిపాదనలు వచ్చాయి.
 
 అంబేడ్కర్ సెంటర్ మీదుగా నిర్మించాలనేది ఒక ప్రతిపాదనైతే.. పట్టణంలోని శ్రీహరిపేట పెట్రోల్‌బంక్ నుంచి కాటన్‌పార్కు మీదుగా మొగల్తూరు రోడ్డులోని ఆంజనేయస్వామిగుడి వద్దకు రోడ్డును విస్తరించడం మరో ప్రతిపాదన. అయితే ఇక్కడ ప్రధానపంట కాలువకు రెండుచోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉంది. అదిగాక అంబేడ్కర్ సెంటర్ మీదుగా తీసుకెళ్తే.. వాణిజ్య ప్రాంతాన్ని సేకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఫ్లైఓవర్ వేయడానికే అధికారులు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.
 
 ఇక మొగల్తూరులో కొంతమేర కాళీపట్నం జమిందారీ భూముల మీదుగా రోడ్డు వెళ్తుంది. ఈ భూముల విషయంలో ఇప్పటికే వివాదం ఉంది. దీంతో ఇక్కడ భూసేకరణను నిలిపేశారు. కాళీపట్నం భూముల వద్ద, నరసాపురం పట్టణంలోనూ తప్ప మిగిలిన చోట్ల రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. టాటా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ పనులను దక్కించుకుంది.
 
 పెండింగ్ పనికి టెండర్లు పిలవాల్సి ఉంది. దాదాపుగా ఫ్లైఓవర్ నిర్మించడానికి నిర్ణయం జరిగినట్టుగా చెబుతున్నారు. ఇక పరిహారం చెల్లింపు విషయం కూడా వివాదమవుతోంది. రుస్తుంబాద ప్రాంతంలో గజానికి రూ.1000 ధర కడుతున్నారని, మామూలుగా ఇక్కడ రూ.25000 ధర ఉందని, ఇలాగైతే ఎలాగని ఆ ప్రాంతం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవహారం కోర్టులకు చేరకుండా, పని సానుకూలంగా అయ్యేలా చూడటానికి అధికారులు శతవిధాలా యత్నిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు