గోదావరిలో పడిన 'తుఫాన్':22మంది దుర్మరణం

13 Jun, 2015 12:31 IST|Sakshi
గోదావరిలో పడిన 'తుఫాన్':22 మంది దుర్మరణం

రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న క్రూజర్(తుఫాన్) వాహనం అదుపుతప్పి ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి గోదావరి నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 9మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 23మంది ఉన్నట్లు తెలుస్తోంది.  విశాఖ జిల్లా అచ్యుతాపురం వాసులు తీర్థయాత్రల్లో భాగంగా తిరుపతి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్ కూడా మృతి చెందాడు. దాదాపు 50 అడుగుల పైనుంచి పడటంతో వాహనం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను క్రేన్ల సాయంతో వెలికి తీశారు. ఈ ప్రమాదం నుంచి ఒక పాప, ఒక బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా పాప ఈగల సంధ్య కూడా మృతి చెందింది. ఈ ఘటనలో మృతిచెందిన వారిని రమణ, వెంకట లక్ష్మి, సాయి, రాజా, కార్తీక్, కోసమ్మ, నవిత్, నవ్య, ప్రసాద్, అన్నపూర్ణ, లలిత, హర్ష, గోపి, కొండమ్మ, సంధ్యలుగా గుర్తించారు. మరికొంతమంది మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు