222వ రోజు పాదయాత్ర డైరీ

29 Jul, 2018 02:41 IST|Sakshi

28–07–2018, శనివారం
జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా  

వంద నియోజకవర్గాల ప్రజలతో మమేకమవడం.. ఓ అపూర్వ అనుభవం  

రాష్ట్రంలోనే అత్యధిక కౌలు రైతులున్న జిల్లా ఇది. ఈ జిల్లాలో కౌలుదారుల కన్నీటి కథలు వినని రోజే లేదంటే అతిశయోక్తి కాదు. కౌలు రైతులెందరో కూలీలుగా మారడం చూసి చాలా బాధనిపించింది. కట్టమూరుకు చెందిన కానిశెట్టి సూర్యనారాయణ 30 ఏళ్లుగా కౌలు రైతు. గత కొద్ది సంవత్సరాలుగా వరుస పంట నష్టాలు రావడంతో సేద్యమే మానేశాడు. సాగుచేసి అప్పుల్లో కూరుకుపోవడం కన్నా.. రోజుకు రూ.250 ముట్టే కూలి పనులే నయమనుకున్నాడు. వ్యవసాయం దండగగా మారిన బాబుగారి పాలనలో సేద్యం జోలికి పోవొద్దని బిడ్డలకూ చెప్పాడు. వారిని ఇప్పుడు తాపీ పనులకు పంపుతున్నాడు.  

 కౌలు సేద్యం భారమై కంకులు అమ్ముకుంటున్న మద్దూరి వెంకటరమణ అనే తాతదీ అదే దుస్థితి. ఐదు దశాబ్దాలుగా వ్యవసాయాన్నే నమ్ముకుని బతికిన ఆ రైతన్న.. ఈ పాలనలో గిట్టుబాటు ధరల్లేక, ప్రభుత్వ చేయూత అందక నష్టాలపాలయ్యాడు. ఒకప్పుడు కౌలుకు చేసిన పొలం పక్కనే.. రోడ్డు మీద మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ రోజుకు రూ.200 సంపాదిస్తున్నాడు. ‘మీ నాన్నగారి పాలనలో ఏ చింతా లేకపోయే. సబ్సిడీలు, లోన్లు, నష్టపరిహారాలతో ఆదుకున్నాడు. ఈ మెట్ట ప్రాంతానికి గోదావరి కాలువ తెచ్చి కోనసీమలా మార్చాడు’ అంటూ నాన్నగారి పాలనను గుర్తుచేసుకున్నాడు.

ఆ రోజులు మళ్లీ రావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చాడు. ‘ఇప్పుడు మాత్రం తినడానికే కష్టంగా ఉందయ్యా’ అంటూ కన్నీటి పర్యంతమైన ఆ పెద్దాయన ఆవేదన చూసి గుండె బరువెక్కింది. ఒకప్పుడు రైతునంటూ గర్వంగా బతికిన అన్నదాతకు నేడు ఎంత దుస్థితి?!  గోకవరం మండలం ఎర్రంపాలేనికి చెందిన ముస్లిం సోదరుడు రఫీ ఇంటిల్లిపాదితో వచ్చి కలిశాడు. మాటతప్పని శ్రీరాముడు, పోరాట స్ఫూర్తి అల్లూరి, సేవానిరతిలో మదర్‌థెరిసా, అణగారిన వర్గాల అభ్యున్నతిలో అంబేడ్కర్, దర్శనికతలో కలాం గార్ల స్ఫూర్తితో నా జీవన పయనం సాగాలని అభిలషిస్తూ.. ఆ మహనీయుల చిత్రపటాలను జ్ఞాపికగా ఇచ్చాడు. వారి అభిమానం, నా పట్ల నమ్మకం.. నా సంకల్ప బలాన్ని మరింత పెంచింది.  

సర్వమత ప్రార్థనలతో 222వ రోజు జగ్గంపేటలోకి అడుగుపెట్టాను. ఏడేళ్ల కిందట 2011, మార్చి 11న ఇదే జగ్గంపేటలో అశేష ఆత్మీయ జనసందోహం మధ్య ‘ప్రతి పేదవాడి ముఖానా చిరునవ్వులు చిందించాలి’ అన్న నాన్నగారి ఆశయ స్ఫూర్తితో ఆయన పేరిట పార్టీ పెడుతున్నట్లు.. అది ప్రజలందరి పార్టీగా ఉంటుందంటూ ప్రకటించాను. జీవితంలో అది మరిచిపోలేని ఘట్టం. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి అక్కున చేర్చుకుంది. కానీ చంద్రబాబు ప్రలోభాలకు లొంగి.. అభివృద్ధి అనే అందమైన బూటకపు ముసుగులో పార్టీ ఫిరాయించారు ఈ నియోజకవర్గ నాయకులు.

నేతలు స్వార్థపు దారులు వెతుక్కున్నా.. ప్రజలు, కార్యకర్తలు మాత్రం మరింత కసిగా పార్టీ వెన్నంటి నిలవడం ఆనందాన్నిచ్చింది. అట్టి ప్రాధాన్యత కలిగిన ఈ జగ్గంపేట నియోజకవర్గం ప్రజా సంకల్పయాత్రలో 100వ నియోజకవర్గంగా నిలిచింది. పాదయాత్రగా 100 నియోజకవర్గాల ప్రజలతో మమేకమవడం ఓ అపూర్వ అనుభవం’.   ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ మోసానికి, బాబు నయవంచనకు బలైన మరో విషాద ఉదంతం మనసును కలచివేసింది. మదనపల్లెలో ప్రత్యేక హోదా కోసం సుధాకర్‌ అనే 26 ఏళ్ల సోదరుడు ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకోవడం పాలకుల పాపమే. ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచేదెవరు? నిన్నగాక మొన్న ప్రత్యేక హోదా కోసం జరిగిన బంద్‌లో గుండెపోటుతో మరణించిన దుర్గారావన్న విషాదానికి.. ఈ పాలకులు కాక మరెవరు దోషులు?  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రత్యేక హోదా వంటి జీవన్మరణ సమస్యను సైతం మీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం పాపం కాదా? హోదా వేస్ట్‌ అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి.. హోదా అన్న మాటెత్తితే జైలుకు పంపుతానంటూ ప్రజల్ని బెదిరించి.. నాలుగున్నరేళ్లు బీజేపీతో సంసారం చేసి.. హోదాను భూస్థాపితం చేయాలని శతవిధాలా ప్రయత్నించి.. నేడు ఎన్నికలకు ఆరు నెలల ముందు మాట మార్చినంత మాత్రాన ప్రజలు నమ్ముతారా? మీరు చేసిన ద్రోహాన్ని క్షమిస్తారా?    

-వైఎస్‌ జగన్‌     

మరిన్ని వార్తలు