228వ రోజు పాదయాత్ర డైరీ

5 Aug, 2018 02:52 IST|Sakshi

04–08–2018, శనివారం
దుర్గాడ క్రాస్, తూర్పుగోదావరి జిల్లా

రైతుల ఆత్మహత్యలకు ఇతర కారణాలు ఆపాదించడం అమానుషం కాదా బాబూ?
ఉప్పొంగిన ఆత్మీయ జనాభిమానం.. అడుగులను వడిగా ముందుకు పడనివ్వలేదు. ఒక్క చేబ్రోలు గ్రామంలోనే నాలుగు గంటలకుపైగా సమయం పట్టింది. కాపు సోదరులు, అక్కచెల్లెమ్మలు ప్లకార్డులతో, హారతులతో ఘన స్వాగతం పలికారు. అపార విశ్వాసాన్ని ప్రకటించారు. వారితో పాటు వచ్చిన పులప సాయి అనే ఏడో తరగతి సోదరుడు పుట్టుకతోనే రెండు కళ్లూ లేని దివ్యాంగుడు. ‘జగనన్నా..’ అంటూ అద్భుతంగా పాట పాడి మురిపించాడు. ఇవన్నీ ఓ వైపు సంతోషాన్నిస్తుంటే.. మరోవైపు వారితో పాటు వచ్చిన మరో కాపు సోదరి విషాదభరిత జీవితం మనసును బరువెక్కేలా చేసింది.

ఆమె కన్నీటి కథ వింటే.. కనికరం లేని పచ్చనేతలు తప్ప ఎంతటి పాషాణ హృదయమైనా కరిగిపోవాల్సిందే. విధి ఆడిన వింత నాటకంలో.. ఓ వైపు ప్రకృతి కన్నెర్ర, మరోవైపు ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఆ కుటుంబాన్ని వీధిన పడేశాయి. ఆమె భర్త ఓ కౌలు రైతు. అకాల వర్షాలతో పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కాసింతయినా ప్రభుత్వ సాయం అందలేదు. అప్పుల భారం ఎక్కువై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆమె ఇద్దరు కొడుకులూ అనారోగ్యంతో మరణించారు. భర్త చేసిన అప్పులు తీర్చడానికి.. ఉన్న చిన్న ఇంటినీ అమ్మేసింది.

ఆమె తమ్ముడు, తండ్రి, మామ సైతం మరణించారు. ఆ కుటుంబానికి మగదిక్కే లేదు. ఆమె, ఆమె తల్లి, ఆమె అత్త.. ముగ్గురు వితంతువులూ ఓ పూరిపాకలో నివసిస్తున్నారు. చింత గింజలు తీస్తూ వచ్చే కూలి డబ్బులతో బతుకులీడుస్తున్నారు. మనసంతా వికలమైపోయింది. పట్టెడన్నం పెట్టే రైతన్న ఆత్మహత్య చేసుకుని మరణిస్తే.. ఏమాత్రం పట్టించుకోని ఈ పాలకులను ఏమనాలి? వ్యవసాయం గురించి.. రైతన్నల గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే ఈ నేతలకు ఈ కన్నీటి బతుకులు కనిపించవా?

ఈ మండలంలోనే దాదాపు ఏడుగురు అన్నదాతలు ఈ పాలనలో ఆత్మహత్యలకు పాల్పడ్డారట. ఆశ్చర్యకర విషయమేంటంటే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ చావునైనా రాజకీయంచేసి.. వీరంగం సృష్టించిన ఈ పచ్చనేతలు.. అధికారంలోకొచ్చాక కనీసం ఈ పాలనలో మరణించిన కుటుంబాల పరామర్శకు కూడా వెళ్లకపోవడం. పైపెచ్చు ఈ ఆత్మహత్యలన్నీ కుటుంబ కలహాల వల్లేనని.. రైతుల మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లేనని.. పరిహారం కోసమేనని.. కొందరు అమాత్యులు, ముఖ్యనేతలు వ్యాఖ్యానించడం అన్నదాత ఆత్మగౌరవాన్ని దారుణంగా అవమానించడమే.

ఏ యేటికాయేడు డీఎస్సీ పెడతామంటూ ఆశపెడుతుండటంతో.. అవన్నీ మోసపు మాటలేనని తెలియక వేలకు వేలు ఖర్చు పెట్టి ఏటా కోచింగ్‌ తీసుకోవాల్సి వస్తోందంటూ.. పిఠాపురానికి చెందిన దేవి, డీఎస్సీ నిర్వహించకుండా పలు పర్యాయాలు టెట్లు పెడుతూ ప్రయివేటు కోచింగ్‌ సెంటర్లకు దోచిపెడుతున్నారంటూ.. చేబ్రోలుకు చెందిన ప్రియాంక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేబ్రోలు గ్రామంలో అనేక మంది తమ అనారోగ్య గోడును వెళ్లబోసుకున్నారు.

మెదడులోని గడ్డ ఆపరేషన్‌కు ఇక్కడ వైద్యం లేదు.. హైదరాబాద్‌కు పొమ్మంటున్నారంటూ.. జోగి సాయిశ్రీనివాస్‌ అనే విద్యార్థి, కేన్సర్‌ చికిత్సకు చెన్నై వెళ్లమంటున్నారని.. గుండ్ర పున్నారావు, తొడ ఎముకకు ఆపరేషన్‌ చేయించుకోవాలంటే ఆర్థిక స్థోమత లేదంటూ.. ఓరుగంటి చంద్రం, పక్షవాతానికి నెలనెలా మందులు కొనాలంటే డబ్బుల్లేని దుస్థితి అంటూ సోమారపు శ్రీను.. ఇలా ఒక్క చేబ్రోలులోనే దాదాపు 20 మందికి పైగా తమ కష్టాలు చెప్పుకొన్నారు. వీరందరినీ చూస్తుంటే విస్మయం కలిగింది. అసలు సర్కారీ వైద్యం అనేది ఉందా? ఏమైపోయింది ఆరోగ్యశ్రీ? పేదలకు జబ్బు చేస్తే ఆశలు వదులుకోవాల్సిందేనా?

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాన్నగారు 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెలలోపే జీవో విడుదల చేసి.. మీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సైతం పరిహారం ఇచ్చినమాట వాస్తవం కాదా? మీ రైతు వ్యతిరేక విధానాల వల్లనే.. మీ గత పాలనలోనూ, నేటి పాలనలో సైతం.. అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వారికి ఇచ్చే స్వల్ప పరిహారాన్ని సైతం ఎగ్గొట్టడానికి వారి మరణాలకు పలు ఇతర కారణాలను ఆపాదించి, అపహాస్యం చేయడం..
అమానుషం కాదా?

-వైఎస్‌ జగన్‌       

మరిన్ని వార్తలు