229వ రోజు పాదయాత్ర డైరీ

6 Aug, 2018 02:20 IST|Sakshi

05–08–2018, ఆదివారం
కత్తిపూడి, తూర్పుగోదావరి జిల్లా  

ప్రజలను వంచించడంలో బాబుగారు మరింత పరిణితి సాధించాడనిపించింది..
ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు, ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలాల్లో పాదయాత్ర సాగింది. ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి గెలిపించారు. కానీ గెలిచిన నేత మాత్రం చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి పార్టీ ఫిరాయించాడు. ఈ పాలనలో అభివృద్ధి మాట దేవుడెరుగు.. మరుగుదొడ్ల నిధులను సైతం కైంకర్యం చేశారు. ఆఖరికి అన్నవరం సత్యదేవుని ఆలయానికి సైతం అవినీతి మకిలి అంటించారంటే.. ఈ పరిపాలన ఎలా ఉందో అర్థమవుతోంది.  
 
ఉదయం పిఠాపురానికి చెందిన నిరుద్యోగ యువకులు కలిశారు. రాష్ట్ర విభజన నాటికి ఖాళీగా ఉన్న 1.42 లక్షల పోస్టులతో పాటు ఈ నాలుగున్నరేళ్లలో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయకుండా.. ఎన్నికలకు కొద్ది నెలల ముందు కేవలం కొద్దిమందికి మాత్రమే రూ.1,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాననడం వంచించడం కాక మరేంటన్నది వారి ప్రశ్న. ‘అన్నా.. చంద్రబాబుగారు ఒక్క కొత్త ఉద్యోగమూ ఇచ్చింది లేదు.. ఉన్న ఖాళీలను భర్తీ చేసిందీ లేదు.. ఒక్క కాంట్రాక్టు ఉద్యోగినీ క్రమబద్ధీకరించిందీ లేదు. పైగా ఉన్న ఉద్యోగాలను తగ్గించివేయడం, తీసివేయడం చేస్తున్నారు. పలు రకాల సేవలను ఔట్‌ సోర్సింగ్‌ పేరిట.. లంచాల కోసం అధిక మొత్తాలకు ప్రయివేటు కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రమవడానికి కారణమే బాబుగారు’ అంటూ మండిపడ్డారు.  
 
దారిలో తిరుమాలికి చెందిన కాపు సోదరుడు రాజు కలిశాడు. ఆయన ఒక ప్రయివేటు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడట. నాన్నగారంటే వల్లమాలిన అభిమానమని చెప్పాడు. ‘సార్‌.. మా తోడల్లుడికి గుండెజబ్బు వస్తే మీ నాన్నగారి చలవతో ఉచిత వైద్యం అందింది. మా వదినను, వారి అబ్బాయిని ఆరోగ్యశ్రీ ఆదుకుంది. నా పిల్లలిద్దరూ ఫీజురీయింబర్స్‌మెంట్‌ వల్ల చదువుకున్నవాళ్లే. అం దుకే మా అమ్మానాన్న ఫొటోల పక్కనే మీ నాన్న గారి ఫొటోను పెట్టుకున్నాను’ అని ఆ సోదరుడు చెబుతుంటే.. చాలా గర్వంగా అనిపించింది.  మీ నాన్నగారు చేనేత సహకార సంఘాలను రుణ విముక్తం చేసి పునరుజ్జీవింపజేస్తే.. బాబుగారు వాటిని మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి మూతపడేలా చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. చేబ్రోలు చేనేత సహకార సంఘ సభ్యులు.

నాలుగున్నరేళ్లుగా పట్టించుకోని బాబుగారు తీరా ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో.. వేతనం పెంచుతానంటున్నాడని ఆశా వర్కర్‌ సత్యవతి, నిరుద్యోగ భృతి ఇస్తానంటున్నాడని దుర్గాడ చిన్నికృష్ణ చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఓట్ల కోసం చేసే మాయలేనంటూ వాస్తవాన్ని వెలిబుచ్చారు. వారి మాటలు వింటుంటే.. నాన్నగారి పాదయాత్ర గుర్తుకొచ్చింది. ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే నాన్నగారి పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఆ సందర్భంగా నాన్నగారు ‘ఏదేమైనా ఈ ప్రజా ప్రస్థానం మాత్రం.. ప్రభుత్వాన్ని ఆకాశం నుంచి భూమికి దించుతున్నది. ఇన్నాళ్లూ మరిచిపోయిన ప్రజలపై వరాల మూటలు కురిపిస్తున్నది.. కాలమే ప్రభుత్వ ఎత్తుల నిజరూపాన్ని తేలుస్తుంది’ అని తన డైరీలో నోట్‌ చేసిన వాక్యాలు గుర్తొచ్చాయి. అప్పుడు.. ఇప్పుడు బాబుగారి పాలనే. అప్పటికీ.. ఇప్పటికీ ఆయనగారిలో పెద్దగా మార్పురాకపోగా.. ప్రజలను వంచించడంలో మాత్రం మరింత పరిణితి సాధించాడనిపించింది.  


 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఇంటికో ఉద్యోగమన్నావ్‌.. లేదంటే రూ.2,000 నిరుద్యోగ భృతి అన్నావ్‌.. నాలుగున్నరేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు కేవలం కొద్దిమందికి మాత్రమే.. అది కూడా రూ.1,000 మాత్రమే ఇస్తాననడం మోసం కాదా? రుణమాఫీ పేరుతో రైతన్నలను, పొదుపు సంఘాలను వంచించినట్లుగానే.. నిరుద్యోగ భృతి పేరుతో యువతను దగా చేయడం ధర్మమేనా?

-వైఎస్‌ జగన్‌       

మరిన్ని వార్తలు