7 రోజులే..

18 Dec, 2013 01:40 IST|Sakshi
7 రోజులే..

 =23 వరకు ఓటరు నమోదు
 =ఫలించిన ప్రత్యేక డ్రైవ్.. 89,679 మంది నమోదు

 
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఓటరు నమోదు ప్రక్రియ గడువు పొడిగించారు. ఈ నెల 23వ తేదీ వరకు కొత్త ఓటరు నమోదు, సవరణలకు అవకాశం కల్పించారు. 22వ తేదీన జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లలో తుది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. వాస్తవానికి మంగళవారంతో ఓటరు నమోదు గడువు ముగిసినప్పటికీ మరో వారం రోజుల పాటు నమోదుకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

నెల రోజుల నుంచి చేపట్టిన ఈ కార్యక్రమానికి మిశ్రమ స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం వెరసి ఓటరు నమోదుకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. ప్రధానంగా యువ ఓటర్లపై దృష్టి సారించినా ఇంకా 70 శాతం వరకు యువత ఓటరుగా నమోదు కావాల్సి ఉంది. కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా యువత పెద్దగా ఆసక్తి చూపించలేదు.
 
పర్యవేక్షణ లోపం : గత నెల 18వ తేదీన ప్రచురించిన ఓటరు జాబితా ముసాయిదా ప్రకారం జిల్లాలో 30,76,374 మంది ఓటర్లు కాగా, ఇందులో 15 లక్షల 33 వేల 783 మంది పురుషులు, 15 లక్షల 42 వేల 591 మహిళా ఓటర్లు ఉన్నారు. వచ్చే ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం నవంబర్ 18వ తేదీ నుంచి మరోసారి ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత నెల 24, ఈ నెల 1, 8, 15 తేదీల్లో వరుసగా నాలుగు ఆదివారాల పాటు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. తొలి మూడు వారాల డ్రైవ్‌లు నామమాత్రంగా జరిగాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చాలా పోలింగ్ కేంద్రాలు తెరుచుకోలేదు.

అనేక కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచలేదు. బీఎల్‌ఓలు ఇష్టానుసారంగా వ్యవహరించి నమోదుకు వచ్చిన వారికి సక్రమమైన సమాచారం ఇవ్వలేదు. ఈ విషయాన్ని సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించారు. చివరి ఆదివారం 15వ తేదీన నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌పై శ్రద్ధ పెట్టారు. కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ప్రత్యేకాధికారులను నియమించారు. దీంతో చివరి ఆదివారం ఒక్కరోజే అనూహ్యంగా 32,923 మంది ఓటరు నమోదు, సవరణలకు దరఖాస్తులు చేసుకున్నారు. అంతకు ముందు మూడు వారాలు నిర్వహించిన డ్రైవ్‌లలో 56,756 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 47 వేల డూప్లికేట్ కార్డులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వారు చెబుతున్నారు.
 
యువత దూరం  : కళాశాలల ప్రిన్సిపాళ్లతో అధికారులు సమావేశాలు నిర్వహించి నేరుగా విద్యార్థులకే నమోదు ఫారాలను అందజేశారు. కానీ యువత దూరంగానే ఉంది. 2011 జనాభా గణాంకాల ప్రకారం జిల్లాలో 1.71 లక్షలు యువతీ, యువకులు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
 
ఇందులో 25 వేల మంది వరకు మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. చివరి డ్రైవ్‌లో మరో 5 వేల మంది వరకు దరఖాస్తులు చేసుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇంకా 1.41 లక్షల మంది యువత నమోదు చేసుకోవాల్సి ఉంది.
 
ఆన్‌లైన్‌లో 76 వేలు : ప్రత్యేక డ్రైవ్‌లోనే కాకుండా ఈ దఫా ఆన్‌లైన్ ద్వారా వేల మంది ఓటరు నమోదుకు దరఖాస్తులు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు సుమారుగా 76 వేల మంది ఆన్‌లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. నమోదుకు గడువు ముగిసిన తరువాత బీఎల్‌ఓలు ఆయా దరఖాస్తుదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పరిశీలించనున్నారు. ఇందులో 50 శాతం వరకు యువత ఉండే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
 
22న మరోసారి ప్రత్యేక డ్రైవ్ : ఈ నెల 23వ తేదీ వరకు ఓటరు నమోదు, సవరణలకు గడువు పెంచుతూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22న మరోసారి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఆ తేదీన జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు అందుబాటులో ఉండనున్నారు. గడువును పెంచడంతో 2014, జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొనే వెసులుబాటు కలిగింది. జనవరి 16న తుది జాబితాను ప్రకటిస్తారు. కొత్తగా ఓటరు నమోదు చేసుకున్న వారికి పాత కార్డుల మాదిరిగా కాకుండా ఏటీఎం కార్డుల తరహాలో కొత్తగా ఓటరు కార్డులు రానున్నాయి.
 

మరిన్ని వార్తలు