ధాన్యం కొనుగోలుకు...230 కేంద్రాలు

26 Nov, 2014 00:29 IST|Sakshi

చిలకలపూడి (మచిలీపట్నం) : జిల్లాలో 2014-15 సంవత్సరానికి గాను సార్వా ధాన్యం కొనుగోలు కోసం 230 కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ జె.మురళి తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో మద్దతు ధర చెల్లిస్తామని ఆయన చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం నియమించిన ఐకేపీ సిబ్బంది, పౌరసరఫరాల శాఖ అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఐకేపీ సిబ్బంది ద్వారా 135, పీఏసీఎస్‌ల ద్వారా 95 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యం ఎక్కడ ఎక్కువగా కొనుగోలు చేయడానికి వీలవుతుందో ఆయా ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్కొక్క కేంద్రంలో నలుగురు సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. ఈ సిబ్బందికి ఈ నెల 26, 27, 28 తేదీల్లో విజయవాడలోని గొల్లపూడి డీఆర్‌డీఏ కార్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.1,400, సాధారణ రకం ధాన్యానికి రూ.1,360 చెల్లించనున్నట్లు వివరించారు. పౌరసరఫరాల శాఖ ద్వారా ఎక్కువ మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో ఈ ఏడాది కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

తేమ శాతంపై రైతులకు అవగాహన...
జిల్లాలో 85 శాతం మంది రైతులు యాంత్రీకరణ ద్వారా ధాన్యం నూర్పిళ్లు చేస్తున్నారని, దీనివల్ల ధాన్యంలో 25 నుంచి 30 శాతం తేమ ఉండే అవకాశం ఉంటుందని జేసీ చెప్పారు. కొనుగోలు కేంద్రం సిబ్బంది, పౌరసరఫరాల సిబ్బంది రైతులకు యాంత్రీకరణ ద్వారా నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఎక్కువగా ఆరబెట్టే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం తేమ మించకుండా ఉన్న ధాన్యాన్నే కొనుగోలు చేయాల్సి ఉందని, ఈ విషయాన్ని గ్రామీణ ప్రాంత రైతులకు తెలియజేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మార్కెటింగ్ శాఖ ద్వారా తేమను గుర్తించే యంత్రం, పోటు తొలగించే యంత్రం, గోనె సంచులు అన్నీ సిద్ధం చేసుకోవాలని సిబ్బందికి చెప్పారు. ఈ సమావేశంలో ఏజేసీ బీఎల్ చెన్నకేశవరావు, డీఎస్‌వో ఎ.కృష్ణారావు, డీఎంసీ సివిల్ సప్లయిస్ జయదేవ్‌సింగ్, పీడీఎస్ డీటీలు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు