లంచం ఇస్తేనే పింఛన్‌..

29 Jul, 2018 03:09 IST|Sakshi

ఆర్టీజీఎస్‌కు 23 వేల మంది ఫిర్యాదులు

సకాలంలో పింఛన్‌ ఇవ్వడం లేదని 36 వేల మంది ఫిర్యాదు

వివిధ కారణాలతో 4.45 లక్షల మందికి పింఛన్లు ఇవ్వని వైనం

రేషన్‌ కార్డుకూ లంచమే సీఎంకు తెలిపిన అధికారులు

సాక్షి, అమరావతి: వృద్ధాప్యంలో ఆసరా లేక, పనిచేయలేక జీవనం సాగిస్తున్న వృద్ధుల నుంచి లంచాలు తీసుకోవడానికి కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు వెనుకాడటం లేదు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖల ఉన్నతాధికారులతో వివిధ పథకాల సంతృప్తి, అసంతృప్తి స్థాయిలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పింఛన్‌ అడిగితే లంచం అడుగుతున్నారని 23 వేల మంది ఫిర్యాదులు చేశారని అధికార వర్గాలు సీఎం దృష్టికి తీసుకువచ్చాయి.

లంచం ఇస్తేనే పింఛన్‌ మంజూరు చేస్తున్నారని, లేదంటే ఏదో సాకుతో ఇవ్వడం లేదని సీఎంకు చెప్పాయి. రియల్‌ టైమ్‌ గవర్ననెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) నిర్వహించిన సర్వేలో కూడా పింఛన్‌ కోసం పీడీలు, ప్రజాప్రతినిధులు లంచాలు అడుగుతున్నారని 50 శాతం మంది తెలిపారు. కాగా, పింఛన్‌ నిర్దిష్ట సమయానికి ఇవ్వడం లేదని 36 వేల మంది ఫిర్యాదు చేశారు. కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇంటికి తీసుకొచ్చి పింఛన్‌ ఇవ్వడం లేదని కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వివిధ కారణాలను సాకుగా చూపి ఏకంగా 4.45 లక్షల మందికి పింఛన్ల సొమ్ము ఇవ్వడం లేదు.

మే నెలలో 49,41,145 పింఛన్లకు నిధులు విడుదల చేశారు. అయితే 44,95,456 మందికే పింఛన్లను పంపిణీ చేశారు. ఏకంగా 4,45,689 మందికి పింఛన్లు పంపిణీ చేయలేదు. ఇలా ప్రతి నెలా వివిధ కారణాల పేరుతో పింఛన్ల పంపిణీని లక్షల్లో తగ్గించేస్తున్నారు. ఇదే సమీక్షలో రేషన్‌ పంపిణీపై సంతృప్త స్థాయి గత నెలల కంటే ఈ నెలలో తగ్గిపోయినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే రేషన్‌ కార్డు కావాలన్నా లంచాలు అడుగుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి.కాగా, ఇప్పుడు ప్రభుత్వంలో ముఖ్యుల దృష్టి భూముల కొల్లగొట్టడంపై పడింది.

ఏళ్ల తరబడి తరతరాలుగా వస్తున్న భూముల హక్కులను కాలరాసేందుకు ఎత్తుగడ వేశారు. దీనికోసం ఇటీవల భూముల రికార్డులను కంప్యూటీకరించారు. ఈ క్రమంలోనే జాతీయ రహదారులు, పట్టణాలకు సమీపంలోని విలువైన భూములపై కన్నేశారు. ఆ భూముల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు ‘చుక్క’ పెడుతున్నారు. ఫలానా భూమికి సంబంధించి సరైన రికార్డులు లేవంటూ చుక్క పెడుతున్నారు. ఆ చుక్క తీయించేసి ఆ భూమి తనదేనని రికార్డులను సరిచేయించుకోవడానికి లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

ఎకరాకు ఇంత చొప్పున రెవెన్యూ అధికారులకు లంచం రూపంలో ముట్టచెప్పాల్సి వస్తోంది. ఈ విధంగా తీసుకునే లంచాలు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వాటాల రూపంలో పంపిణీ అవుతున్నాయి. ఇంటి జాగాలకు దరఖాస్తు చేసుకున్నా, గృహాల మంజూరుకు దరఖాస్తు చేసుకున్నా లంచం ఇస్తేనే పని అవుతోందని, లేదంటే అనర్హత జాబితాలోకి నెట్టేస్తున్నారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ప్రధానంగా జన్మభూమి కమిటీలతోపాటు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు లంచాల బాట పట్టడంతోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గ్రామదర్శిని, నగరదర్శిని పేరుతో పై స్థాయి అధికారులను గ్రామాల బాట పట్టిస్తున్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు