236వ రోజు పాదయాత్ర డైరీ

14 Aug, 2018 02:29 IST|Sakshi

13–08–2018, సోమవారం 
కాకరాపల్లి, తూర్పుగోదావరి జిల్లా

ఈ జిల్లా ప్రజలు చూపిన ఆప్యాయత నా గుండెల్లో ఎప్పటికీ పదిలం
నేటితో ఉభయ గోదావరి జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని ఉత్తరాంధ్రలో అడుగిడబోతున్నాను. గోదావరి జిల్లాలు సొంత జిల్లాలా ఆదరిస్తాయని నాన్నగారు ఎప్పుడూ అంటూండేవారు. అదే ఆదరణ నాకూ లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటి దాకా జరిగిన తొమ్మిది నెలల పాదయాత్రలో మూడోవంతు ఈ జిల్లాల్లోనే సాగిందంటే.. అడుగడుగునా కట్టిపడేసిన అభిమానమే కారణం. రాజమహేంద్రవరం బ్రిడ్జిపై ప్రజలిచ్చిన అఖండ స్వాగతాన్ని జీవితంలో మర్చిపోలేను. వర్షపు చినుకులు.. అశేష ఆత్మీయ జనసందోహం మధ్య గోదావరి వారధిపైనుంచి రెండు నెలల కిందట తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్ప యాత్ర.. అదే వర్షపు చినుకుల్లో వేలాది మంది వెంటరాగా తుని నియోజకవర్గంలో ముగింపునకు చేరుకుంది.  

ఎన్నో సహజ వనరులతో, పైరు పచ్చలతో బయటి ప్రపంచానికి అందంగా కనిపించే ఈ జిల్లా.. క్షేత్ర స్థాయిలో మాత్రం సమస్యల నిలయమే. అన్ని అర్హతలూ ఉన్నా.. ఏ సంక్షేమ పథకమూ అందని నిరుపేదలు ఎందరో ఉన్నారు. జీవన వ్యయం పెరిగిపోయి.. ఆదాయ వనరులు తగ్గిపోయి.. నలిగిపోతున్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల బాధలు వర్ణనాతీతం. ఆంధ్రా అన్నపూర్ణగా పేరెన్నికగన్న ఈ ప్రాంతంలో ఆకలి కేకలు విన్నాను. చెంతనే గోదారి ఉన్నా.. గుక్కెడు నీళ్లు కరువైన తాగునీటి కష్టాలూ కన్నాను. కొబ్బరి రైతుల కష్టాలు, దింపుడు, వలుపు కార్మికుల బాధలు బరువెక్కించాయి. రేటు దక్కక కుదేలైన ఆక్వా రంగం ఆవేదన కలిగించింది.

ఆంధ్రా కేరళగా పేరున్న కోనసీమలో క్రాప్‌ హాలిడేలు, వలసలు విస్మయం కలిగించాయి. సుదీర్ఘ సాగర తీరం, అపార మత్స్య సంపద ఉన్న ఈ జిల్లాలో మత్స్యకారులు ఉపాధి కోసం ఊళ్లొదిలి వెళ్లాల్సి రావడం ఆశ్చర్యం కలిగించింది. నగరం బ్లోఅవుట్‌ దుర్ఘటన జరిగి నాలుగేళ్లు పూర్తయినా.. ఏ ఒక్క హామీనీ నెరవేర్చని ప్రభుత్వ వైఖరి క్షమార్హం కాదనిపించింది. వరుస బోటు ప్రమాదాలతో దినదిన గండంగా బతుకుతున్న లంక గ్రామాల కన్నీటి వెతలు.. దృష్టికి వచ్చాయి. ఆత్మహత్యలకు పాల్పడ్డ అన్నదాతల కుటుంబాలకు పరిహారాన్ని కూడా ఎగ్గొట్టిన పాలకుల వైఖరిపై అసహ్యం వేసింది. కిళ్లీ కొట్లలోనూ, కిరాణా షాపుల్లోనూ మద్యం అమ్మకాలు సాగుతూండటం.. బెల్టు షాపులకు వేలం పాటలు నిర్వహించడం చూసి.. ఈ పాలన ఇంతలా దిగజారిపోయిందా.. అనిపించింది.    

రుణాలన్నీ మాఫీ చేస్తాను.. ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేర్చేస్తాను.. తదితర హామీలతో ఇక్కడి ప్రజల్ని మోసపుచ్చి ఓట్లేయించుకున్న పెద్ద మనుషులు.. అందుకు ప్రతిఫలంగా ఇసుక, మట్టితో సహా.. జిల్లాలోని వనరులన్నింటినీ దోచేశారు. ప్రజల్ని పరిపరి విధాలుగా పీడిస్తున్నారు. అందుకే పాలకులపై ప్రజాగ్రహం అడుగడుగునా కనిపిస్తోంది. రాజమండ్రి మొదలు.. తుని వరకూ ప్రతి సభకూ వేలాది మంది తరలివచ్చి దిగ్విజయం చేశారు. ప్రజాకంటక పాలనపై కదంతొక్కారు. పాదయాత్ర ఆసాంతం.. ఈ జిల్లా ప్రజలు చూపిన ఆప్యాయత, అనురాగాలు గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. మరిచిపోలేని అనుభూతుల్ని మూటగట్టుకుని జిల్లా దాటి వెళుతున్నాను.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. గత ఎన్నికలలో ఈ జిల్లా ప్రజలు 19కి 14 స్థానాలను మీకిచ్చారు. ఇది చాలదన్నట్టు.. మా పార్టీ ఎమ్మెల్యేలను ముగ్గురిని కొనుగోలు చేశారు. మీరు, మీ అనుచరులు కలిసి వనరులన్నింటినీ దోచుకోవడం తప్ప.. ఈ జిల్లాకు చేసిన మేలు ఒక్కటైనా ఉందా? ఈ జిల్లాకు మీరిచ్చిన హామీలు కనీసం గుర్తున్నాయా? అసెంబ్లీ సాక్షిగా ఈ జిల్లాకు మీరు ప్రకటించిన వరాలలో ఒక్కటైనా నెరవేర్చారా?  
-వైఎస్‌ జగన్‌   

>
మరిన్ని వార్తలు