పశువైద్యులుగా 238 మంది నియామకం

19 Nov, 2013 04:50 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 238 మంది పశువైద్యులుగా నియమితులయ్యారు. కోరుట్ల, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలల్లో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు కూడా కొందరు ఎంపికయ్యారు. ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు జారీ చేసినట్లు పశుసంవర్థక శాఖ డెరైక్టర్ డి.వెంకటేశ్వర్లు తెలిపారు. వాస్తవానికి 469 పశువైద్యుల పోస్టులకు ఈ ఏడాది నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో సగం మేర మాత్రమే భర్తీ కావడం గమనార్హం. మొత్తం 336 దరఖాస్తులు రాగా, ప్రతిభ ఆధారంగా 238 మందిని ఎంపిక చేశారు. వీరిలో కోరుట్ల, ప్రొద్దుటూరు కళాశాలల అభ్యర్థులు కూడా ఉన్నారు. వాస్తవానికి ప్రొద్దుటూరు, కోరుట్ల కళాశాలల్లో బోధనా సిబ్బంది, ఇతర సౌకర్యాలు తగిన విధంగా లేవంటూ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) ఇక్కడ చదువుకున్న విద్యార్థుల డిగ్రీలకు గుర్తింపునివ్వలేదు. ఈ అంశాన్ని ‘త్రిశంకు స్వర్గంలో వెటర్నరీ డాక్టర్లు’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో పశుసంవర్థక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాయి.

>
మరిన్ని వార్తలు