24/7 విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు

2 Apr, 2015 01:56 IST|Sakshi

25 ప్రదేశాల్లో ఎనీటైం పేమెంట్ మిషన్ల ఏర్పాటుకు కసరత్తు
సబ్సిడీపై 3 వేల మంది రైతులకు సోలార్ పంపు సెట్లు
ఐపీడీఎస్ ప్రోగ్రాం కింద *208 కోట్లతో పనులు
పేదలకు *125 కే విద్యుత్ కనెక్షన్
80 లక్షల మందికి ఎల్‌ఈడీ బల్బులు
లో ఓల్టేజీ నివారణకు ప్రత్యేక చర్యలు
ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర

 
విద్యుత్ వినియోగదారులు ఎప్పుడైనా, అంటే 24 గంటల పాటు బిల్లులు చెల్లించేందుకు వీలుగా ఎనీటైం పేమెంట్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర పేర్కొన్నారు.  రైతులకు సైతం సబ్సిడీపై 3వేల సోలార్ పంపు సెట్లను అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
 
తిరుపతి: ఐపీడీఎస్ పథకం కింద 3 జిల్లాల్లో రూ.208 కోట్లతో పనులు చేపడుతున్నట్టు తెలిపారు. దీనికి తోడు దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనవథకం కింద పేదలకు రూ.125లకే విద్యుత్ కనెక్షన్, వైరింగ్ చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు డిస్కం పరిధిలో పూర్తిస్థాయిలో ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేసేందుకు కసరత్తు జరుగుతోందన్నారు.  లో ఓల్టేజీ నివారణలో భాగంగా ఈఏడాది  208 విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. బుధవారం ఆయన ‘సాక్షిప్రతినిధి’తో పలు విషయాలను ముచ్చటించారు.

 ప్రశ్న: ఎనీటైం పేమెంట్ మిషన్లు ఏర్పాటు చేయడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి?

జవాబు: ఈ మిషన్లను ఏర్పాటు చేయడం వల్ల 24గంటల పాటు విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించవచ్చు. ఇంతకు మునుపులా  క్యూలో నిలబడి వేచివుండే అవసరం ఉండదు. ఇక్కడే చెక్‌పేమెంట్లతో పాటు, క్రెడిట్ కార్డు సౌకర్యంతో కూడా బిల్లులు చెల్లించే సౌలభ్యం ఉంటుంది. ఇప్పటికే  విజయవాడ, తిరుపతిలో వీటిని ఏర్పాటుచేశాం. వీటితోపాటు మరో 23చోట్ల ఈ మిషన్లు ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. విద్యుత్ వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌లో మరిన్ని చోట్ల ఈమిషన్లు ఏర్పాటు చేస్తాం.
 
ప్రశ్న: సోలార్ పంపుసెట్లపై రైతులకు ఎలాంటి రాయితీ ఉంది?


జవాబు: సోలార్ 5హెచ్‌పీ  పంపు సెట్ విలువ రూ.5లక్షలు. అయితే ఇందులో రైతు రూ.55వేలు చెల్లిస్తే చాలు.. పంపుసెట్ మొత్తం విలువలో 30 శాతం కేంద్ర సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ సబ్సిడీ ఇస్తుంది.  మిగిలిన మొత్తం రూ.2.8లక్షలు డిస్కమే భరిస్తోంది. ఇందుకోసం ఈఏడాది రూ.150 కోట్లను వెచ్చిస్తున్నాం. ఇప్పటికే  రైతుల నుంచి 150 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి వెంటనే రైతులకు పంపు సెట్లను అందించాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశించాం. ఈ ఏడాది ఎస్పీడీసీఎల్ పరిధిలో 3వేల మంది రైతులకు సోలార్ పంపుసెట్లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

ప్రశ్న ః ఐపీడీఎస్ పోగ్రామ్ కింద ఏయే పనులు జరుగుతున్నాయి?

జవాబుః ఐపీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ పవర్  డెవలప్‌మెంట్  స్కీమ్) కింద విజయవాడ, గుంటూరు, చిత్తూరు  జిల్లాల్లో రూ.208 కోట్లతో విద్యుత్ ఆధునికీకరణ పనులు చేపడుతున్నాం.  ఇందుకోసం అయ్యే ఖర్చులో 60 శాతం నిధులను కేంద్రమే భరిస్తోంది. ఈపనులు రెండేళ్ల లోపు పూర్తయితే  కేంద్రం అదనంగా 15శాతం బోనస్ కూడా ఇస్తుంది. అదే రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే 90 శాతం నిధులు కేంద్రం నుంచే వస్తాయి. ప్రస్తుతం ఈనిధులతో 36 చోట్ల,  33/11 కెవీఎస్‌ఎస్ సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నాం 11 కెవీలకు సంబంధించి భూగర్భ లైన్లు 44.8 కిలోమీటర్ల మేర వేస్తున్నాం.

ప్రశ్న: విద్యుత్ ఆదాకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?

జవాబు: విద్యుత్ ఆదాకు సంబంధించి డిస్కం పరిధిలోని 80లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేయనున్నాం. మొదటి విడతలో గుంటూరు జిల్లాలో 9.5లక్షలు, అనంతపురం జిల్లాలో 14లక్షల మందికి బల్బులు పంపిణీ చేశాం. మిగతా ఆరు జిల్లాల్లో పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం రూ.150 కోట్లను వెచ్చిస్తున్నాం.
 
ప్రశ్న: లో ఓల్టేజీ నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

జవాబుః లో ఓల్టేజీ నివారణ కోసం ఈ ఏడాది కొత్తగా 208 సబ్ స్టేషన్లను నిర్మించాం. మరో 42 సబ్ స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. విద్యుత్తు లైన్లను  పునరుద్ధరిస్తున్నాం.
 
ప్రశ్న: పేదలకు విద్యుత్ కనెక్షన్లు ఏ స్కీమ్ కింద ఇస్తున్నారు?

జవాబు: ప్రస్తుతం దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన కింద రూ.230 కోట్లతో పేదలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపాం. ఈ పథకం కింద రూ.125లకే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతోపాటు విద్యుత్ వైరింగ్ కూడా చేస్తాం. దీని ద్వారా  రూ.4లక్షల మంది లబ్ధి చేకూరనుంది.

మరిన్ని వార్తలు