241వ రోజు పాదయాత్ర డైరీ

21 Aug, 2018 02:43 IST|Sakshi

20–08–2018, సోమవారం  
కైలాసపట్నం శివారు, విశాఖపట్నం జిల్లా 

అడుగడుగునా బాబుగారి బాధితులే.. 
ఈ రోజు ఉదయం కూడా జనంతో పాటు.. వర్షపు జల్లులూ స్వాగతం పలికాయి. ఈ పాలనలో ఎక్కడ చూసినా సంక్షేమం అందని, అభివృద్ధి కానరాని గ్రామాలే. దానికి ఆదర్శ గ్రామాలూ  అతీతం కాదు. ధర్మసాగరం.. సాక్షాత్తూ మంత్రిగారి సతీమణి దత్తత తీసుకున్న ఊరు. ఆదర్శ గ్రామంగా ప్రకటించబడిన పల్లెటూరు. ఆ ఊరి దళితులు, బలహీనవర్గాల ప్రజలు కలిశారు. వారికి ఇళ్లు, పింఛన్లు, రుణాలు, కొళాయిలు, మరుగుదొడ్లు.. ఏవీ ఇవ్వరట. వారున్న చోట రోడ్లు, లైట్లు, డ్రైనేజీలు ఏవీ ఉండవట.. ఆశ్చర్యమేసింది. ఈమాత్రం దానికి ఆదర్శ గ్రామం అనే పేరెందుకో! ఎవర్ని మభ్యపెట్టడానికో! పేరుకే ఆదర్శ గ్రామాలు.. ఆదర్శం మచ్చుకైనా కనిపించదు. చంద్రబాబు దత్తత తీసుకున్న అరకు మొదలుకుని.. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా అభివృద్ధి ఎండమావే.  

అన్నవరం క్రాస్‌ వద్ద పాయకరావుపేట నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించింది. ‘దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’ అన్న మహాకవి గురజాడ పుట్టిన నియోజకవర్గమిది. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం తలమానికమైనది. ఈ నియోజకవర్గంలోని ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ.. దేశంలోని మొట్టమొదటి సహకార చక్కెర కర్మాగారం. నాన్నగారి హయాంలో కోట్ల రూపాయల లాభాలతో ఉజ్వలంగా వెలుగొందిన ఈ ఫ్యాక్టరీకి.. నేడు చంద్రగ్రహణం పట్టుకుంది. రూ.22 కోట్లకు పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆరు నెలలుగా కార్మికులకు జీతాల్లేవు. ఇదే నియోజకవర్గంలోని తాండవ షుగర్‌ ఫ్యాక్టరీదీ ఇదే దుస్థితి. బాబుగారి గత హయాంలోనే ఈ ఫ్యాక్టరీని నష్టాల ఊబిలోకి నెట్టి.. తన సమీప బంధువైన ఎంవీవీఎస్‌ మూర్తిగారికి అతి తక్కువ ధరకే కట్టబెట్టాలని చూశారు. కానీ అదృష్టవశాత్తు నాన్నగారి పాలన రావడంతో ఆ కుటిల యత్నాలకు అడ్డుకట్ట పడింది.

అవసాన దశలో ఉన్న ఆ ఫ్యాక్టరీకి నాన్నగారి చలవతో జవసత్వాలొచ్చాయి. లాభాల బాటలోకి పురోగమించింది. నేడు మళ్లీ చంద్రబాబు రావడంతో చరిత్ర పునరావృతమై.. రూ.40 కోట్లకు పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇది కుట్రకాక మరేంటి? బాబుగారు పగ్గాలు చేపట్టడం.. సహకార ఫ్యాక్టరీలు మూసివేత స్థాయికి చేరుకోవడం షరా మామూలుగా మారిపోయింది. కేవలం ఒక వ్యక్తి స్వార్థానికి సహకార రంగంలోని ఫ్యాక్టరీలన్నీ బలైపోవడం.. వేలాది కుటుంబాలు రోడ్డున పడటం ఎంత దారుణం?! 

అన్నవరం గ్రామానికి చెందిన 72 ఏళ్ల శెట్టి రామునాయుడు అనే పెద్దాయన కలిశాడు. నాన్నగారికి, బాబుగారికి ఉన్న వ్యత్యాసాన్ని చెప్పాడు. నాన్నగారి హయాంలో పంట రుణం తీసుకున్నాడట. సకాలంలో వాయిదాలు కట్టి బాకీ మొత్తం తీర్చేశాడట. రుణ మాఫీ వర్తించకపోయినా.. నాన్నగారు ప్రోత్సాహం కింద రూ.5 వేలు ఇచ్చారట. ఆ తర్వాత రూ.70 వేల పంట రుణం తీసుకున్నాడు. బాబుగారి రుణమాఫీ మాటలు నమ్మాడు. మోసగించిన బాబుగారేమో గద్దెనెక్కి కూర్చున్నాడు. మోసపోయిన తాతగారు లబోదిబోమంటున్నాడు. మాఫీ ఎలాగూ కాలేదు.. కనీసం వృద్ధాప్య పింఛన్‌ కూడా ఇవ్వడం లేదంటూ.. బాధపడ్డాడు. బాబుగారి మోసపు హామీల బారినపడి విలవిల్లాడుతున్న ప్రజలు అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ వల్ల నష్టపోని ఒక్కటంటే ఒక్క సహకార చక్కెర ఫ్యాక్టరీనిగానీ, సహకార డెయిరీనిగానీ చూపెట్టగలరా? మీ వల్ల బాగుపడ్డ ఒక్కడంటే ఒక్క సహకార రైతన్ననుగానీ.. కార్మికుడినిగానీ చూపించగలరా?     
-వైఎస్‌ జగన్‌  

మరిన్ని వార్తలు