ఒక్కో పోస్టుకు రూ.25 లక్షలు?

23 Dec, 2017 03:38 IST|Sakshi

అమ్మకానికి జెన్‌కో జేఏఓ పోస్టులు

సాక్షి, అమరావతి: జూనియర్‌ అక్కౌంట్స్‌ ఆఫీసర్స్‌(జేఏఓ) పోస్టుల భర్తీలో ఏపీ జెన్‌కో రోజుకో కొత్త నిబంధనను తెరపైకి తెస్తోంది. ఓ మంత్రి, కొందరు అధికారులకు బాగా కావాల్సిన వారికి ఈ పోస్టులను కట్టబెట్టేందుకు కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బేరం కుదరిందని, ఒక్కో పోస్టుకు రూ.25 లక్షల దాకా వసూలు చేసినట్టు జెన్‌కో వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 26 జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి నవంబర్‌ 10వ తేదీన ఏపీ జెన్‌కో నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఈ నోటిఫికేషన్‌ వెలువడిన కొద్ది రోజులకే గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది. రాత పరీక్షలో ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులిస్తారనేది నోటిఫికేషన్‌ జారీ చేసేటప్పుడు వెల్లడించలేదు. తర్వాత ఒక్కో సబ్జెక్టుకు ఇచ్చే మార్కుల వివరాలను నవంబర్‌ 23న జెన్‌కో వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ నెల 15న జెన్‌కో మరో సవరణ చేసింది. జెన్‌కోలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు 10 మార్కులు వెయిటేజీ ఇస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ జెన్‌కోలో జేఏవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడడం ఇదే తొలిసారి. ఈ పోస్టులకు దాదాపు 15 వేల దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు నిరుద్యోగులు రూ.500 చెల్లించారు.

తీరా జెన్‌కోలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వడం, నిబంధనలను వారికి అనుకూలంగా మార్చడం వల్ల ఇతరులెవరికీ ఈ పోస్టులు దక్కే అవకాశం కనిపించడం లేదని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నట్టుండి నిబంధనల్లో మార్పు తేవడం వెనుక ఓ మంత్రి, జెన్‌కోలో పనిచేస్తున్న కీలక వ్యక్తి ప్రమేయం ఉన్నట్టు సమాచారం. కాంట్రాక్టు ఉద్యోగులతో ముందస్తుగా బేరం కుదుర్చుకుని, తర్వాత నిబంధనలు మార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, జెన్‌కో నిర్ణయాన్ని కోర్టులో సవాల్‌ చేసేందుకు నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు.

మరిన్ని వార్తలు