251వ రోజు పాదయాత్ర డైరీ

2 Sep, 2018 03:33 IST|Sakshi

01–09–2018, శనివారం
అన్నవరం శివారు, విశాఖపట్నం జిల్లా 

హామీలివ్వడం, మోసం చెయ్యడం బాబుగారికి వెన్నతో పెట్టిన విద్యే కదా..
ఈ రోజు ఉదయంతో అనకాపల్లి పూర్తయింది. చోడవరంలో ప్రవేశించాను. గంధవరం, వెంకన్నపాలెం, నరసాపురం గ్రామాల కష్టాలు నా దృష్టికి వచ్చాయి. ముఖం చూసి బొట్టు పెడతారన్న సామెత వాస్తవమనిపించింది. సర్వత్రా రాజకీయపరమైన వివక్ష కనిపిస్తోంది. జన్మభూమి కమిటీల అరాచకాలకు అంతేలేదు. ఏ సంక్షేమ పథకాలైనా అందుతోంది అరకొరగానే. పేదలకు కాస్త విదిల్చి మిగతావన్నీ పచ్చ చొక్కాల వారు భోంచేస్తున్నారు. ప్రతిపక్ష సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకు నిధులే ఇవ్వడంలేదు. చేసిన ప్రతీ పనికి మోకాలడ్డుతున్నారు.

పనులు జరగకపోతే ఇబ్బంది పడేదెవరు? ప్రజలు కాదా.. పాలకుల కక్ష ఎవరి మీద? ఈ అరాచకాలకు పరాకాష్ట ఏమిటంటే.. రెండు కళ్లూలేని ఓ దివ్యాంగునికి, పూర్తిగా మంచానికే పరిమితమైన ఓ అభాగ్యురాలికి ఈ ప్రభుత్వం వచ్చాక వివక్షతో పింఛను ఆపేయడం. ఆ కాస్త పింఛను కోసం ఆ విధివంచితులు కోర్టుకు వెళ్లాల్సిరావడం. రెండు కాళ్లూ లేని ఇద్దరు దివ్యాంగులు పింఛను కోసం ఆత్మహత్యాయత్నం కూడా చేశారట. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా!? ఏ మూలైనా కాస్తయినా మానవత్వం ఉండదా? తమ ప్రాథమిక హక్కుల కోసం సైతం దివ్యాంగులు జీవన పోరాటం చేయాల్సి రావడం ఎంత దయనీయం! 

నర్సాపురం సర్పంచ్‌ చెప్పిన మాటలు వింటుంటే.. దోపిడీకి ఏ ప్రాంతమైనా ఒక్కటేననిపించింది. ఆ ఊరిలోని ఒకే చెరువులో మూడుసార్లు పనులు చేసినట్లు చూపించి బిల్లులు చేసుకున్నారట. మట్టినీ అమ్ముకున్నారు. ఈ నియోజకవర్గంలోని 70 చెరువుల్లో ఇదే తరహా దోపిడీ జరిగింది. దారిలో శారదా నది దాటి వచ్చాను. ఆ నదిని సైతం వదల్లేదు అధికార పార్టీ నేతలు. గజపతినగరం, గోవాడ ప్రజలు ఇదే విషయం చెప్పారు. ఆ నదిలోని ఇసుకను మొత్తం దోచేశారట. రాష్ట్రంలో పచ్చ నేతలు చెరపట్టని నది ఒక్కటైనా ఉందా!? 

దాదాపు 13 గ్రామాలకు కేంద్ర బిందువులా ఉంది వెంకన్నపాలెం. అక్కడ పీహెచ్‌సీ ఏర్పాటుచేయాలన్నది ఆ గ్రామాల ప్రజల చిరకాల వాంఛ. నిజంగా ఆ అవసరం ఎంతైనా ఉంది. దాదాపు 20వేల మందికి పైగా ఉపయోగపడుతుంది. పాదయాత్రగా వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి అయ్యాక, రెండుసార్లు చంద్రబాబు హామీ ఇచ్చారట. ఆయన పాలన పూర్తవుతున్నా ఆ ఊసేలేదు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. బాబుగారు మరోసారి హామీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. హామీలివ్వడం, మోసం చెయ్యడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే కదా. 

సాయంత్రం గోవాడ చక్కెర ఫ్యాక్టరీ మీదుగా పాదయాత్ర సాగింది. రాష్ట్రంలోనే అతిపెద్ద సహకార చక్కెర కర్మాగారం.. నాన్నగారి హయాంలో కోట్ల రూపాయల లాభాలలో వెలుగొంది, లక్షలాది మందికి ఆధారంగా ఉన్న ఆ ఫ్యాక్టరీ నేడు చంద్రబాబు కబంధ హస్తాలలో విలవిలలాడుతోంది. గత హయాంలోనే తన బినామీలకు అతితక్కువ ధరకు అమ్మాలని ప్రయత్నించారు బాబుగారు. నేటికీ ఆ దిశగా విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాను అధికారంలోకి వచ్చేటప్పటికి లాభాల్లో ఉన్న ఆ ఫ్యాక్టరీని కోట్ల రూపాయల నష్టాల్లోకి నెట్టివేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కన్నా సీఈవో అనిపించుకోవడమే ఇష్టమట బాబుగారికి. మరి ఆయన పాలనలో సహకార ఫ్యాక్టరీలలానే రాష్ట్రం కూడా దివాలా తీస్తుండటం.. ఆ ఫ్యాక్టరీలను పీల్చి పిప్పిచేస్తున్నట్లుగానే రాష్ట్రంలోని వనరులన్నీ దోచేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. 

ఉల్లికి గిట్టుబాటు ధర రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన కర్నూలు రైతన్న మృతి చెందడం కలచివేసింది. నిన్న హోదా కోసం ఓ సోదరుడు.. నేడు గిట్టుబాటు ధర కోసం ఓ రైతన్న. అధికారం కోసం ఎన్ని మోసాలకైనా, ఎన్ని అబద్ధాలకైనా వెనుకాడని నయవంచక పాలన ఫలితాలే ఇవన్నీ.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. దశాబ్దాల కిందట ఎందరో త్యాగాలతో ఏర్పడి.. రైతన్నల కష్టంతో, కార్మికుల స్వేదంతో నడుస్తున్న సహకార ఫ్యాక్టరీలను మీ ఒక్కరి స్వార్థం కోసం మూసివేయించడం అన్యాయమనిపించదా!? లక్షలాది జీవితాలు వీధినపడుతూ ఉంటే కాస్తయినా బాధ అనిపించదా?  
-వైఎస్‌ జగన్‌ 

>
మరిన్ని వార్తలు