25వ రోజూ హోరెత్తిన నిరసనలు

26 Aug, 2013 00:49 IST|Sakshi
25వ రోజూ హోరెత్తిన నిరసనలు

సాక్షి, విజయవాడ :  సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యమం వాడవాడలా ఉధృతంగా సాగుతోంది. జిల్లాలో వరుసగా 25వ రోజున పోరు హోరెత్తింది. గుడివాడ పట్టణంలోని కళాకారులు చిత్రవిచిత్ర వేషధారణలతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. వంటావార్పు చేసి తమ నిరసన తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

నందివాడ మండలం జనార్థనపురంలో మానవహారం నిర్వహించి వంటావార్పు చేశారు. ఉద్యోగ సంఘాల కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. పామర్రులో, పెదపారుపూడి సెంటర్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. విస్సన్నపేటలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏడోరోజు రిలేదీక్షలు కొనసాగాయి. ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 3వ రోజు చేరాయి. కొర్లమండలో గ్రామస్తులు రాస్తారోకో చేశారు. జయంతిపురంలో హతిరామ్ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ, మానవహారం కార్యక్రమాలు గ్రామస్తులతో కలిసి నిర్వహించారు.
 
ఇబ్రహీంపట్నంలో కొవ్వొత్తుల ప్రదర్శన..

 ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నూజివీడులో హౌసింగ్ అధికారులు బైక్ ర్యాలీ జరిపారు. జగన్ దీక్షలకు మద్దతుగా పార్టీ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో పెడనలో రిలేదీక్షలు జరిగాయి. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్‌లో జేఏసీ నాయకులు చెవిలో పూలు పెట్టుకుని జాతీయ రహదారిపై మోకాళ్లపై నడుస్తూ వినూత్న ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేటలో మహిళలు బోనాలతో నిరసన తెలిపారు. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన రిలే దీక్షలను విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సందర్శించి మద్దతు తెలిపారు.

పాత మున్సిపల్ సెంటర్‌లో సమైక్యాంధ్రవాదులు క్రికెట్, కర్రసాము, వెయిట్‌లిఫ్టింగ్, కబడ్డీ వంటి ఆటలు ఆడి నిరసన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలులో యూత్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కలిదిండి సెంటరులో సమైక్యాంధ్రకు మద్దతుగా కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. వాగ్దేవి జూనియర్, డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థినులు మున్సిపల్ కూడలిలో కుంటుతూ తమ నిరసన తెలిపారు. గుడివాడలో కూచిపూడి నృత్యకారుల ఆధ్వర్యంలో నెహ్రూచౌక్ వద్ద నత్యం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బొబ్బర్లంక దళితవాడ యువకులు మండల పరిధిలోని కొక్కిలిగడ్డ వంతెన వద్ద కరకట్ట డబుల్‌లైన్ రహదారిపై ఆందోళన నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

నూజివీడులో హౌసింగ్ అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని రైతు నాయకుడు యెర్నేని నాగేంద్రనాధ్ సందర్శించారు. కోడూరు మండలం విశ్వనాథపల్లిలో పార్టీలకతీతంగా పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు దీక్షలు జరిపారు. మోపిదేవి మండలం కె.కొత్తపాలెం, అవనిగడ్డ మండలం వేకనూరులో విద్యార్థులు ర్యాలీలు చేశారు. వీరులపాడు, అల్లూరు, జయంతి, జుజ్జూరు, కొణతాలపల్లి గ్రామాల్లో ఆదివారం సమైక్య నిరసనలు జరిగాయి.  
 
 వినూత్న నిరసనలు..

 కంచికచర్లలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కేవీఆర్ కళాశాల నుంచి ర్యాలీగా రైతుపేట వచ్చి 65వ నంబర్ జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రహదారిపై మోకాళ్లతో నడవటం, యోగాసనాలు, పలు ఆటలు ఆడి నిరసన తెలిపారు.  మచిలీపట్నంలో జిల్లాకోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు, కోర్టు గుమాస్తాల సంఘం ప్రతినిధులు  మోకాళ్లపై నిలబడి, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టారు. కైకలూరులో ఎన్జీవోలు, ఉపాధ్యాయులు తాలుకాసెంటర్లోవద్ద పామర్రు - కత్తిపూడి జాతీయరహదారిపై సూర్య నమస్కారాలు చేశారు.

కంకిపాడు, గన్నవరం రోడ్డు కూడళ్లలో రజకులు రోడ్డు పైనే చాకిరేవు ఏర్పాటు చేసి బట్టలు ఉతికి, ఆర వేసి తమ నిరసన తెలిపారు. ఉయ్యూరులో ఉద్యోగులు, సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధులు ప్రధాన సెంటర్లోని రింగ్‌లో మొక్కలు నాటి, రోడ్డుపై వెళ్లే ఆటోల అద్దాలు తుడిచి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చల్లపల్లిలో టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 216 జాతీయరహదారిపై టైలర్లు దుస్తులు కుట్టి నిరసన తెలిపారు.  

 విజయవాడలో భారీ ప్రదర్శనలు..
 విజయవాడలో దుర్గగుడి ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు. ఆదివారం రిలేదీక్షలు ప్రారంభించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. తెలుగువారే కాకుండా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా సమైక్యం కోసం ఉద్యమిస్తున్నారు. లయోలా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలలో రాజస్తానీ మార్వాడీలు పాల్గొన్నారు. విజయవాడ సింధీ సమాజం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అకాడమీ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్  సంగీత కళాశాలలో సమైక్యాంధ్రపై  నిర్వహించిన చిత్ర కళా పోటీల్లో కార్టూనిస్టులు పాల్గొని పలు చిత్రాలను గీశారు.

మున్సిపల్ ఉద్యోగులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. విద్యార్థులు రోడ్డుపైనే ఆల్పాహారం తీసుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆటోనగర్‌లో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం కూడా కొనసాగాయి. ఈ దీక్షలకు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం కన్వీనర్ తాతినేని పద్మావతి సంఘీభావం ప్రకటించారు. అనంతరం సోనియా, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.  
 

మరిన్ని వార్తలు