దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులు 26 లక్షలు

6 Jun, 2020 03:22 IST|Sakshi

అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌లో 10.86 లక్షల మంది

రెండు, మూడు స్థానాల్లో కేరళ, మహారాష్ట్ర

కేంద్ర కార్మికశాఖ వెల్లడి

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో వలస కార్మికులు ఎంతగా అవస్థలు పడ్డారో దేశమంతా చూసింది.. ఇంతకీ లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు 26 లక్షల మంది. చిక్కుకుపోయిన వారిలో అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌లో, అత్యల్పంగా చండీగఢ్‌లో ఉన్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించే నాటికి తెలంగాణలో దాదాపు 1.93 లక్షల మంది చిక్కుకుపోగా, ఏపీలో లక్ష మంది ఉన్నారు. వలస కార్మికులపై కేంద్ర కార్మిక శాఖ శుక్రవారం ఓ నివేదిక వెల్లడించింది. దానిలోని అంశాలిలా ఉన్నాయి.. 

► మార్చి 25న లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన నాటికి దేశంలో 26 లక్షల మందికి పైగా వలస కార్మికులు చిక్కుకుపోయారు. 
► వారిలో 46 శాతం మంది ఆ వలస ప్రాంతాల్లో తాము నివాసం ఉంటున్న చోటే ఉండిపోయారు.
► మరో 43 శాతం మందికి.. వారికి ఉపాధి కల్పిస్తున్న సంస్థల యాజమాన్యాలు ఆశ్రయం కల్పించాయి.
► 10 శాతం మంది ప్రభుత్వ పునరావాస, సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. తమిళనాడు, పంజాబ్, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రభుత్వ సహాయక శిబిరాల్లో ఒక్కరు కూడా లేరు. వలస కార్మికుల్లో ఏఏ రాష్ట్రాలకు చెందినవారు ఎంతమంది ఉన్నారన్న విషయం కేంద్ర కార్మిక శాఖ వెల్లడించలేదు. 

మరిన్ని వార్తలు