జామాయిల్ తోటకు నిప్పు

5 Feb, 2015 02:51 IST|Sakshi
జామాయిల్ తోటకు నిప్పు

నారాయణపురంలో వీఎస్‌ఎస్ తోట దగ్ధం
260 ఎకరాల పంటకు నష్టం

 
నారాయణపురం (ఉంగుటూరు) : నారాయణపురం వనసంరక్షణ సమితి (వీఎస్‌ఎస్)కి చెందిన ఉంగుటూరు ‘ఎ’ బ్లాక్ జామాయిల్ తోటలో అగ్గిరాజుకుంది. బుధవారం మధ్యాహ్న సమయంలో తోటలో నుంచి విపరీతంగా పొగలు రావడంతో సమీపంలోని సిరామిక్స్ పరిశ్రమ సిబ్బంది గ్రహించి అధికారులకు సమాచారమందించారు. సుమారు 260 ఎకరాల తోటలో నాలుగు దిక్కులా మంటలు ఎగసిపడ్డాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మంటలు కొనసాగాయి.

తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫైర్ ఇంజిన్ ఒక్కటే కావడంతో ఓ దశలో మంటలను అదుపుచేయడం కష్టంగా మారింది. ఉంగుటూరు ఆర్‌ఐ బొడ్డేపల్లి దుర్గా ప్రసాద్, చేబ్రోలు ఎస్సై వి.చంద్రశేఖర్, వీఆర్వో బి.ఫణి, అటవీ శాఖ సిబ్బంది, యువకులు మంటలను అదుపు చేసేందుకు సాయపడ్డారు.

వీఎస్‌ఎస్ అధ్యక్షురాలి ఆందోళన

జామాయిల్ తోట అంటుకోవడంతో వన సంరక్షణ సమితి అధ్యక్షురాలు ఉలిపి లక్ష్మి డీలా పడ్డారు. ఎన్నో ఏళ్లుగా పెంచిన తోటకు నిప్పంటుకోవడంతో ఆమె తట్టుకోలేకపోతున్నారు. ఎంత మేరకు నష్టం జరిగిందో అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువుగా జరుగుతున్నాయని, కాల్చి పారేసిన సిగరెట్ వల్ల నిప్పంటుకుందా, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అంటించారా అన్నది తెలియడం లేదని స్థానికులు అంటున్నారు. సంఘటనతో నారాయణపురం, ఉంగుటూరు, గోపీనాథపట్నం, చేబ్రోలు వాసులు భయాందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు