261వ రోజు పాదయాత్ర డైరీ

13 Sep, 2018 03:28 IST|Sakshi

12–09–2018, బుధవారం
చినగదిలి క్యూ–1 ఆస్పత్రి సమీపం, విశాఖపట్నం జిల్లా

బాబూ.. ప్రశ్నిస్తే దేశ ద్రోహమా?
డబ్బు లేని కారణంగా ఏ పేదవానికి వైద్యమందని దుస్థితి రానీయకూడదన్న నాన్నగారి తపన నుంచి పుట్టుకొచ్చిన అద్భుత పథకమే ఆరోగ్య శ్రీ. లక్షలాది మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన సంజీవని అది. ఆదర్శనగర్‌ వద్ద కలిసిన సునీత అనే చెల్లెమ్మకు చిన్నప్పుడు ప్రమాదవశాత్తు మెడ, ఛాతీ, చేతులు కాలిపోయాయి. గడ్డం కింద భాగం ఛాతీకి పూర్తిగా అతుక్కుపోయింది. తల కాస్తంతైనా పైకెత్త లేని పరిస్థితి. ఆమెకు ఖరీదైన వైద్యం అవసరమైంది. కానీ తండ్రి రిక్షా కార్మికుడు. మందుల కోసం వంద రూపాయలు ఖర్చు పెట్టడమే కష్టం. ఇక రూ.లక్షలు ఖర్చయ్యే వైద్యం చేయించే పరిస్థితి ఎక్కడ? బతికినంత కాలం ఇలానే ఉండాలేమో అనే నిరాశలో కూరుకుపోయింది. పదిహేను సంవత్సరాలు నరకయాతన అనుభవించింది. 2008లో నాన్నగారి ఆరోగ్యశ్రీ పుణ్యమా అని రూ.రెండు లక్షల ఖరీదైన వైద్యం ఉచితంగా అందింది. ఇప్పుడు ఆ చెల్లెమ్మ డిగ్రీ పూర్తి చేసి సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేస్తోంది. నాకు పునర్జన్మనిచ్చిన దేవుడు మీ నాన్న గారంటూ చెమర్చిన కళ్లతో కృతజ్ఞతలు చెప్పింది. ఆ మాటలతో నా మనసంతా చెప్పలేని గొప్ప అనుభూతి. మన తదనంతరం కూడా మనల్ని ప్రజలు గుండెల్లో పెట్టుకోవడం కన్నా సార్థకత జీవితానికి ఇంకేముంటుంది?

ఉత్తరాంధ్ర ఎంతో వెనుకబడిన ప్రాంతం. అభివృద్ధికి ఆమడ దూరం. నిరుపేదలైన బలహీన వర్గాల ప్రజలు, ఏజెన్సీ ప్రాంత గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతం. అక్కడ అత్యాధునిక సూపర్‌ స్పెషాలిటీ సేవలు ఉచితంగా అందించేందుకు విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఏర్పాటు చేయాలని సంకల్పించారు నాన్నగారు. కానీ అటువంటి ప్రతిష్టాత్మక ఆస్పత్రిని.. ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు నుంచి కాపాడాలని కోరారు హనుమంతవాక ప్రజలు. 1,130 పడకలు, 21 సూపర్‌ స్పెషాలిటీలతో సేవలందించాల్సిన ఆస్పత్రి.. కేవలం 250 పడకలకే కుదించబడటం, ఇప్పటివరకు ఒక్క సూపర్‌ స్పెషాలిటీ సేవ కూడా అందుబాటులోకి రాకపోవడం, రెగ్యులర్‌ వైద్యులు, ఉద్యోగులను నియమించకపోవడం, దశలవారీ ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తుండటం బాధేసింది. ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న ముఖ్యమంత్రి నుంచే ఆ ఆస్పత్రిని కాపాడాలని ప్రజలు కోరాల్సి రావడం దురదృష్టకరం. 

సాయంత్రం అరిలోవాలో ముస్లిం సోదరులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ‘ఏరు దాటే దాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ చందమైన బాబు గారి పాలనపై ముస్లిం సోదరుల నుంచి ఆవేదన వ్యక్తమైంది. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసినప్పుడు మైనార్టీలను పూర్తిగా విస్మరించి నేడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక.. ఎన్నికల వేళ కపట ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తమైంది. 
ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. నారా హమారా సభలో న్యాయం కోసం అర్థించిన అమాయక ముస్లిం సోదరులపై అక్రమ కేసులు బనాయించి దేశ ద్రోహులుగా చిత్రీకరించారు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను గుర్తు చేస్తే దేశ ద్రోహమా? ముస్లింలకు ఒక్కమంత్రి పదవీ ఇవ్వలేదని ప్రశ్నించడమే వారు చేసిన నేరమా? మరి ఏ తప్పు చేయని ఆ మైనార్టీ సోదరులది దేశ ద్రోహమైతే.. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించిన మిమ్మల్ని ఏమనాలి?   
-వైఎస్‌ జగన్‌

>
మరిన్ని వార్తలు