జూలై 1 నుంచి ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి

7 Jul, 2019 04:59 IST|Sakshi

తొలి కేబినెట్‌ భేటీలోనే ఈమేరకు 

నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ ఉద్యోగులకు జూలై 1వతేదీ నుంచి 27 శాతం మధ్యంతర భృతిని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌ శనివారం జీవో జారీ చేశారు. 11వ వేతన సవరణ కమిషన్‌ సిఫార్సులతో కూడిన నివేదిక ఇంకా సమర్పించని నేపథ్యంలో మధ్యంతర భృతి 27 శాతం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పొందుతున్న సంస్థల్లోని ఉద్యోగులు, వర్క్‌ చార్జ్‌డ్‌ ఉద్యోగులు, ఫుల్‌ టైమ్‌ కంటిన్‌జెంట్‌ ఉద్యోగులకు మధ్యంతర భృతి వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు.

ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 
ఎన్నికల ముందు ఉద్యోగులను మభ్య పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన పోస్ట్‌ డేటెడ్‌ జీవో జారీ చేసింది. ఏప్రిల్‌ నుంచి 20 శాతం మధ్యంతర భృతి వర్తింపచేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నా నిధులు మాత్రం ఎన్నికల అనంతరం జూన్‌లో ఇస్తామంటూ మెలిక పెట్టింది. అయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లోనే హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నిర్వహించిన తొలి కేబినెట్‌ సమావేశంలోనే అంటే గత నెల 10వ తేదీన మధ్యంతర భృతి 27 శాతం జూలై 1వతేదీ నుంచి వర్తింప చేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆర్థికశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.  

మరిన్ని వార్తలు