270వ రోజు పాదయాత్ర డైరీ

26 Sep, 2018 02:51 IST|Sakshi

25–09–2018, మంగళవారం 
రంగరాయపురం, విజయనగరం జిల్లా 

నవరత్నాలు జనంలోకి వెళ్లడం ఆనందాన్నిచ్చింది 
ఈరోజు కొత్తవలస మండలం తుమ్మికాపాలెం నుంచి ఎల్‌.కోట మండలం రంగరాయపురం వరకు పాదయాత్ర సాగింది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ కాసింది. మండు వేసవిని తలపించింది. అంత వేడిలోనూ ఉక్కపోతలోనూ జనం బారులుతీరి నిల్చున్నారు. యాత్ర ముగింపు సమయంలో మాత్రం వర్షంతో వాతావరణం కాస్త చల్లబడింది. కొత్తవలస నుంచి వచ్చిన పేదలు నన్ను కలిశారు. వారంతా టీలు, పండ్లు, తినుబండారాలు లాంటివి అమ్ముకుని బతికే బడుగుజీవులు. కొత్తవలస జంక్షన్‌ వద్ద 30 ఏళ్లుగా చిన్నచిన్న దుకాణాలు నడుపుకుంటున్నారు. క్రమం తప్పకుండా పంచాయతీ వారికి, రైల్వే వారికి రుసుం చెల్లిస్తూనే ఉన్నారు. కానీ రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం నెపంతో గత నెలలో రాత్రికిరాత్రే బలవంతంగా వారి దుకాణాలన్నీ తొలగించేశారట.

ఉన్నపళంగా ఉపాధి కోల్పోయామని వారు బావురుమన్నారు. బడాబాబులు వందల ఎకరాల ప్రభుత్వ భూములను మింగేస్తున్నా కన్నెత్తి చూడని పాలకులు.. ఏళ్ల తరబడి సక్రమంగా పన్నులు కడుతూ చాలీచాలని ఆదాయంతో బతుకులీడుస్తున్న తమపై మాత్రం కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తవలస జూట్‌మిల్‌ కార్మికులదీ ఉపాధి గండమే. జూట్‌ మిల్లులన్నీ ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. వేలాది మందికి ఉపాధినిచ్చే పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రభుత్వ ప్రోత్సాహం పూర్తిగా కరువైంది. కరెంట్‌ చార్జీల బాధలు నానాటికీ ఎక్కువయ్యాయి. ఒక్కొక్క మిల్లు మూతపడుతోంది. వేలాది కార్మికులు వలసబాట పడుతున్నారు. ఒకప్పుడు 35 మిల్లులతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన ఉత్తరాంధ్రలో నేడు 18 మిల్లులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా కష్టనష్టాలతో కునారిల్లుతున్నాయి. కొత్త పరిశ్రమలు ఎలాగూ రావడం లేదు. కనీసం ఉన్నవాటినైనా రక్షించుకోలేకపోతే ఎలా? వేలాది జీవితాలతో ముడిపడ్డ వాటినైనా కాస్త మానవత్వంతో చూడాలి కదా? ప్రతి దానిలోనూ వ్యాపార దృష్టి, స్వార్థ చింతనేనా?  

జిందాల్‌ ఫ్యాక్టరీ కార్మికులు తామెంత దుర్భరంగా బతుకుతున్నామో చెప్పారు. కనీస వేతనాలు, కార్మిక చట్టాలు వర్తించడం లేదన్నారు. నాన్నగారి హయాంలో రెండేళ్లకొకసారి వేజ్‌బోర్డు ద్వారా వేతన సవరణ జరిగేదట. నేడు ఆరున్నరేళ్లయినా జరగకపోవడం బాబు గారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. 30 ఏళ్లుగా కర్మాగారంలో పనిచేస్తున్నా మూడు పూటలా తినలేని దుస్థితి తమదన్నారు. ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే ఆరోగ్య శ్రీ వర్తించకపోయే. పిల్లల చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోయే. అన్ని ధరలు, చార్జీలు పెరిగిపోయే. వాటికి అనుగుణంగా జీతాలు పెరగపోతే ఏం తినాలి? ఎలా బతకాలి?    

గంగుబూడి జంక్షన్‌ వద్ద నవరత్నాల శిబిరం ఆకట్టుకుంది. లబ్ధిదారుల వేషధారణలోని చిన్నారులు ఒక్కొక్క పథకాన్ని వివరిస్తుంటే ముచ్చటేసింది. ఇన్ని రోజుల పాదయాత్రలో ఎంతో మందికి నేను నవరత్నాల గురించి వివరించాను. అటువంటిది ఈరోజు చిన్నపిల్లలు వాటి గురించి చెబుతుంటే.. వింటుండటం గమ్మత్తుగా అనిపించింది. ప్రజల స్థితిగతులను మార్చే నవరత్నాలు విస్తృతంగా జనంలోకి వెళ్లడం ఆనందాన్నిచ్చింది.  

ముఖ్యమంత్రిగారికి నాదొక ప్రశ్న.. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరిస్తామన్నారు. మీ పాలన పూర్తవ్వడానికి ఇంకో నాలుగు నెలలే మిగిలుంది. ఆ పారిశ్రామిక విధానం ఏమైంది? పరిశ్రమల స్థాపన ద్వారా ప్రతి ఇంటికి ఉపాధి–ఉద్యోగం కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్లలో వచ్చిన పరిశ్రమలకన్నా మూతబడ్డవే ఎక్కువున్నాయన్నది వాస్తవం కాదా? ఉపాధి కోల్పోయి వలస బాట పట్టిన లక్షలాది కార్మికుల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు?    
-వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు