279వ రోజు పాదయాత్ర డైరీ

7 Oct, 2018 03:02 IST|Sakshi

06–10–2018, శనివారం
వల్లాపురం క్రాస్, విజయనగరం జిల్లా

వేలాది మందికి బతుకుదెరువు లేకుండా చేయడం చాలా బాధనిపించింది
ఈ రోజు పాదయాత్ర మూలస్టేషన్‌ వద్ద ప్రారంభమై.. ఎస్‌ఎస్‌ఆర్‌పేట, మన్యపురిపేట, బెల్లానపేట మీదుగా సాగింది. రాత్రి బస చేసిన శిబిరానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలోనే నాన్నగారు, సోదరి షర్మిల వారి పాదయాత్రల్లో విరామం తీసుకోవడం విశేషం. ఈ రోజంతా ఇరుకైన రహదారిలో కిక్కిరిసిన జన సందోహం మధ్య నడిచాను. చుట్టూ పంట పొలాల్లో పనిచేసుకుంటున్న అక్కచెల్లెమ్మలు నాపై పొలం పాటలు కట్టి పాడటం.. ఉత్సాహాన్నిచ్చింది.  

ప్రభుత్వ విధానాలు, పాలకుల తీరు సానుకూలంగా ఉన్నప్పుడే రాష్ట్రానికి పరిశ్రమలొస్తాయి. ఈ జిల్లాలో వేలాది మంది కార్మికులకు ఉపాధినిస్తున్నాయి ఫెర్రోఅల్లాయ్‌ పరిశ్రమలు. రాష్ట్రం మొత్తంమీద 35 పరిశ్రమలుంటే.. విజయనగరం జిల్లాలోనే 16 ఉన్నాయి. ఒక్క చీపురుపల్లి నియోజకవర్గంలోనే 6 ఉండటం విశేషం. ఇవి పూర్తిగా విద్యుత్‌ ఆధారిత పరిశ్రమలు. కరెంటు మీదే వాటి మనుగడ ఆధారపడి ఉంటుంది.

నాన్నగారి హయాంలో సరైన ప్రోత్సాహం కల్పించడం.. నాణ్యమైన కరెంటును తక్కువ ధరకే అందించడం.. కరెంటు చార్జీలు పెరగకుండా స్థిరంగా ఉంచడంతో కొత్తగా 29 ఫెర్రోఅల్లాయ్‌ పరిశ్రమలు ఏర్పడ్డాయి. వేలాది మందికి ఉపాధీ దొరికింది. నాన్నగారి తదనంతరం కరెంటు చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో ఈ పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. ప్రోత్సాహం కరువైన ఈ పాలనలో ఆ పరిశ్రమల మనుగడే ప్రశ్నార్థకమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. కార్మికులు, ఉద్యోగులు. పరిశ్రమల కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా.. కేవలం ప్రచారం కోసం, కమీషన్ల కోసం పాకులాడేవారు ఎంత ఆర్భాటం చేసినా.. ఎన్ని దేశాలు తిరిగినా.. ఫలితం మాత్రం శూన్యమే.  

వయోజన విద్యను అందించడం మా డ్యూటీ.. అది చాలదన్నట్టు ప్రతి అడ్డమైన పనీ మాతో చేయించుకున్న ఈ ప్రభుత్వం.. ఇప్పుడు ఉన్నఫళంగా ఉద్యోగాలు ఊడబెరికిందని బాధపడ్డారు.. సాక్షరభారత్‌ సమన్వయకర్తలు. అదేం లొసుగో కానీ.. జూన్‌లో జరిగిన నవనిర్మాణ దీక్షలో సైతం వీరితో సేవలు చేయించుకుని.. మార్చి నుంచే ఉద్యోగాల్లోంచి తొలగించినట్టు ఉత్తర్వులిచ్చారట. ప్రభుత్వ పథకంలో ఉన్నారన్న నెపంతో వారికి ఉపాధి పనులూ ఇవ్వడం లేదట. ప్రభుత్వమే శ్రమ దోపిడీ చేస్తుంటే వారికిక దిక్కెవరు? ఉన్నఫళంగా వేలాది మందికి బతుకుదెరువు లేకుండా చేయడం చాలా బాధనిపించింది.  

ఈ పాలనలో రాజకీయ వివక్ష సర్వసాధారణమైపోయింది. ఈ రోజు కూడా కొన్ని నా దృష్టికొచ్చాయి. వెంకట్రావు అనే అన్నను రేషన్‌ డీలర్‌గా తొలగించారట. వందశాతం వైకల్యం ఉన్న ఆదిలక్ష్మి అనే అంధురాలికి పింఛన్‌ ఇవ్వడం లేదట. వెంకటలక్ష్మి అనే అంగన్‌వాడీ అక్క ఉద్యోగాన్ని తీసేశారట. ఇవన్నీ ఓ ఎత్తయితే.. బురదయ్యవలసకు చెందిన ఓ హెచ్‌ఐవీ బాధిత సోదరుడికి పింఛన్‌ ఇవ్వకపోవడం.. ప్రభుత్వ వివక్షకు పరాకాష్ట.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ హయాంలో పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలన్నీ బకాయిలుగా మిగిల్చారు. ఇస్తానన్న ప్రోత్సాహకాలకు కూడా డబ్బులివ్వడం లేదు. అత్యధికంగా కరెంటు చార్జీల భారం మోపారు. రాయల్టీ రేట్లు విపరీతంగా పెంచేశారు.. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో పరిశ్రమలు ఎలా మనుగడ సాగిస్తాయి.. కొత్త పరిశ్రమలెలా వస్తాయి?

 -వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు