281వ రోజు పాదయాత్ర డైరీ

9 Oct, 2018 01:58 IST|Sakshi

08–10–2018, సోమవారం, 
గరికివలస, విజయనగరం జిల్లా 

హామీలు గుర్తు చేస్తే బెదిరించడం సబబేనా బాబూ?
సాలెల మగ్గం, కుమ్మరి చక్రం, కమ్మరి కొలిమి.. ఇలా సమస్త చేతివృత్తులకు గ్రహణం పట్టిన దుస్థితికి అద్దంపట్టింది.. ఈ రోజు పాదయాత్ర. చేతివృత్తులు చితికిపోతుంటే, కులవృత్తులు కనుమరుగవుతుంటే.. వాటి మీదే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇవ్వాళ నన్ను కలిసిన ఒక్కో కులవృత్తి వారిది ఒక్కో వ్యథ. 

కష్టపడి నేసిన వస్త్రానికి కూలీ మేరకైనా ధర గిట్టుబాటు కాక చేనేత బతుకులు చితికిపోతున్నాయి. మట్టిపాత్రల వాడకం తగ్గిపోవడంతో కుమ్మరి వృత్తి మసకబారిపోతోంది. ఆపై అధికార పార్టీ నేతలు చెరువులను, కుంటలను అడ్డదిడ్డంగా తవ్వుకుని అమ్ముకోవడంతో కుండలకు మట్టి కూడా దొరకని దుస్థితి.  

గొర్రెలను కొనాలంటే రుణాలివ్వడం లేదు. గతంలో మాదిరిగా ఇన్సూరెన్స్‌లూ రావడం లేదు. పశువైద్యం, టీకాలు, మందులు అందడమే లేదు. మరి యాదవ సోదరుడు ఏం చేయాలి? నన్ను కలిసిన ఈ ప్రాంత రెల్లి కులానికి చెందిన మహిళలు పండ్లు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తారు. దానికి పెట్టుబడి కోసమని రోజువారీ వడ్డీలకు అప్పులు చేస్తారు. రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ము వడ్డీలకే సరిపోతుంటే వారెలా బతకాలి?  

అధికార పార్టీ కాంట్రాక్టర్లు, దళారులకే చెరువులన్నీ ధారాదత్తం అవుతుంటే పేద మత్స్యకారుల పరిస్థితేమిటి?  అధిక కరెంటు చార్జీల భారంతో సెలూన్ల నిర్వహణ కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. నాయీబ్రాహ్మణ సోదరులు. దశాబ్దాలుగా దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులు.. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగాలు కల్పించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని కోరడం తప్పెలా అవుతుంది? అడిగిన పాపానికి ‘తోక కత్తిరిస్తాను.. గుడి మెట్లు కూడా ఎక్కనివ్వను’అంటూ ముఖ్యమంత్రిగారే బెదిరిస్తుంటే వారెవరికి మొరపెట్టుకోవాలి?  

వీధివీధిన వేళ్లూనుకున్న బెల్టు షాపులు తమ కుల వృత్తిని కబళించేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. కల్లుగీత కార్మికులు. కల్లుగీత సొసైటీలో సభ్యుడైన ముంత శంకర్‌ అనే సోదరుడు ప్రమాదవశాత్తూ చెట్టు మీద నుంచి పడి కాళ్లు విరిగితే ఎలాంటి సాయం అందలేదట. మరి ఇలాంటివారికి కూడా ధీమా ఇవ్వని చంద్రన్న బీమా ఎందుకు? సొసైటీలు ఉండి ఏం లాభం? సొసైటీల ద్వారా వేలకు వేలు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. కార్మికుల సంక్షేమంపై కాస్తంతయినా దృష్టి పెట్టకపోవడం అన్యాయమన్నారు.. గీత కార్మికులు. ఓ వైపు ఈ పేదల మనుగడే కష్టసాధ్యమవుతుంటే, మరోవైపు ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి పథకాలు సక్రమంగా అమలు కాకపోవడంతో అప్పులపాలవుతున్నారు. 

గత నాలుగేళ్లుగా ఈ జిల్లా మామిడి రైతులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. సరైన ధర లేక, కోత కూలీ కూడా రాక చెట్లపైనే కాయలను వదిలేస్తున్నారు. కిలో మామిడికి రెండున్నర రూపాయలు సాయం అందించి ఆదుకుంటానన్న ప్రభుత్వం మాటతప్పి మోసం చేసిందని మామిడి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతన్నలు మరో విషయం చెప్పారు.. గరుగుబిల్లిలో ఒక మహిళా రైతు 24 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసిందట. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ రైతుగా రాష్ట్ర అవార్డు కూడా పొందిందట. కానీ ఆ వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పులపాలై ఉన్న 24 ఎకరాలు అమ్మేసుకుందట. వాస్తవ పరిస్థితులిలా ఉంటే ముఖ్యమంత్రిగారేమో మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం అద్భుతంగా ఉందని, రూపాయి పెట్టుబడికి రూ.13 లాభం వస్తోందని, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సైతం ఉద్యోగాలు మాని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని అంతర్జాతీయ వేదికలపై అవాస్తవాలు చెబుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వ్యవసాయ సంక్షోభం నుంచి దృష్టి మరల్చడానికే ముఖ్యమంత్రిగారు ఈ అసత్య ప్రచారం చేస్తున్నారని రైతన్నలు వాపోయారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. చేతివృత్తులు, కులవృత్తుల వారి కోసం మీ మేనిఫెస్టోలోని 20, 21 పేజీల్లో పదికిపైగా హామీలిచ్చారు. ఒక్కటైనా నెరవేర్చారా? హామీలను గుర్తు చేసిన వివిధ బలహీనవర్గాల ప్రజలను స్వయంగా మీరే బెదిరించడం ధర్మమేనా?  
-వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు