284వ రోజు పాదయాత్ర డైరీ

14 Oct, 2018 01:55 IST|Sakshi

13–10–2018, శనివారం 
కోమటిపల్లి, విజయనగరం జిల్లా  

నిరుద్యోగ భృతి మొక్కుబడి కార్యక్రమం కాక మరేంటి బాబూ? 
ప్రజలకు మనస్ఫూర్తిగా మంచి చేయాలన్న ఆలోచన ఏ కోశానా లేని ప్రభుత్వమిది. గోరంతను కొండంతగా ప్రచారం చేసుకోవడమే ఈ పాలనలో కనిపించే నిజం. పథకం ఏదైతేనేం.. అది ఎన్నికలకు ఆరు నెలల ముందు.. నాలుగు నెలల కోసమే. ప్రజలను మభ్యపెట్టడం బాబుగారికి వెన్నతో పెట్టిన విద్య. కేవలం ప్రచారం కోసం తీసుకొచ్చే ఈ మొక్కుబడి పథకాల చుట్టూ సవాలక్ష ఆంక్షలు. ఎగ్గొట్టడానికి సవాలక్ష సాకులు.  

ఈ అక్టోబర్‌ 2వ తేదీన ఎమ్మెల్యే చేతుల మీదుగా యువనేస్తం ధ్రువపత్రం అందుకుంది.. దాలెమ్మ అనే నిరుద్యోగ చెల్లెమ్మ. ఆ రోజే బ్యాంకులో నిరుద్యోగ భృతి డబ్బులేస్తామని అధికారులు చెప్పారట. ఇప్పటి వరకూ ఒక్కపైసా పడలేదు. అధికారుల చుట్టూ, బ్యాంకు చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇంటికో ఉద్యోగం.. లేదా నిరుద్యోగ భృతి కింద రూ.2,000 ఇస్తామని ఎన్నికలకు ముందు బాబుగారు ఆశపెట్టారు. నాలుగున్నరేళ్లు పట్టించుకోకుండా కాలయాపన చేశారు. తీరా ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇస్తానన్నది అతి కొద్దిమందికి మాత్రమే. అది కూడా వెయ్యి రూపాయలే. ఇస్తానన్న ఆ కొద్ది మందిలో కూడా కోత విధించడం నిరుద్యోగులకు ద్రోహం కాక మరేంటి?  

 మరుపల్లికి చెందిన పైడిమాంబ, శివశంకర్, వరలక్ష్మి తదితర డ్వాక్రా గ్రూపుల అక్కచెల్లెమ్మలు కలిశారు. రుణమాఫీ పేరుతో బాబుగారు చేసిన మోసంపై నిప్పులు చెరిగారు. ఆయన్ను నమ్మితే నట్టేట ముంచాడని మండిపడ్డారు. ఆయన చెప్పే పసుపు–కుంకుమ పథకమూ దగానే అన్నారు. మూడు విడతలుగా అప్పుగా ఇచ్చే ఆ డబ్బు.. మొదటి విడత కూడా దక్కలేదని వాపోయారు. డ్వాక్రా రుణాలను ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదని.. చేసే ఉద్దేశమూ లేదని అసెంబ్లీ సాక్షిగా మంత్రిగారు లిఖిత పూర్వకంగా ప్రకటించారు. తాము ప్రజలను మోసం చేసిన విషయాన్ని అసెంబ్లీలోనే ఒప్పుకోవాల్సి రావడం ఈ సర్కారుకు సిగ్గుగా అనిపించడం లేదా?  

పెదకాడ గ్రామ మహిళలు కలిశారు. ఆ ఊరికొచ్చిన తాగునీటి కష్టం చెప్పుకొన్నారు. నాలుగున్నరేళ్ల కిందట గత ప్రభుత్వం కట్టిన వాటర్‌ ట్యాంకు ఇప్పటికీ ఉత్సవ విగ్రహంలాగే ఉందన్నారు. పైపులైన్లు, మోటార్లు బిగించకపోవడంతో నిరుపయోగమైందంటూ ఈ అధికార నేతల నిర్లక్ష్యాన్ని పట్టిచూపారు. గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడే ఆ తల్లుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఆ ఊరి ఏట్లో చెలమలు తవ్వుకుని దాహార్తి తీర్చుకుంటున్న దయనీయ స్థితి వారిది. అధికార పార్టీ నేతలు అడ్డదిడ్డంగా ఇసుకను కూడా తవ్వేయడంతో ఆ చెలమల్లో సైతం నీరెండిపోతున్న దుస్థితికి పచ్చ నేతలు ఏం సమాధానం చెబుతారు?  

 వ్యవసాయమే గిట్టని చంద్రబాబు పాలనలో కష్టాల కన్నీటి సాగు గురించి చెప్పేందుకు మధుపాడ గ్రామ రైతులు నన్ను ఈ రోజు కలిశారు. సాగునీరందించే ఆండ్ర కాల్వ పూడికతీతకు సైతం నోచుకోలేదన్నారు. మరమ్మతుల మాటే పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ నియోజకవర్గ రైతు సంఘం నేతలు కలిశారు. గజపతినగరం బ్రాంచి కెనాల్‌ పనులు పూర్తిచేయకపోవడం వల్ల 15 వేల ఎకరాలకు నీళ్లందని దయనీయ పరిస్థితిని నా ముందుంచారు. పెద్ద ప్రాజెక్టులను ఎలాగూ పట్టించుకోరన్నా.. చిన్న చిన్న కాల్వలను సైతం ఇలా వదిలేస్తే ఎలా.. అని ప్రశ్నించారు. నిజమే.. ఆ ఆవేదనకు అర్థముంది. రైతన్న ఆగ్రహానికి కారణముంది. పెద్ద ప్రాజెక్టులను కేవలం కమీషన్ల కోసం మాత్రమే వాడుకునే ఈ పాలకులు.. కమీషన్లు తక్కువ వస్తాయని చిన్న చిన్న కాల్వల పనులను నిర్లక్ష్యం చేస్తున్నారు.  

 ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య 1.70 కోట్లు.. వాటిలో మీ ప్రజాసాధికార సర్వే ప్రకారం కేవలం 65 లక్షల నిరుద్యోగులున్నట్టు గుర్తించారు. సవాలక్ష ఆంక్షలతో యువనేస్తం పథకానికి 12.22 లక్షల మందిని మాత్రమే అర్హులుగా తేల్చారు. మీ అడ్డగోలు నిబంధలను దాటుకుని కేవలం 7.8 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగలిగారు. వాటిలో నానా సాకులూ పెట్టి 2.15 లక్షల మందిని మాత్రమే ఎంపిక చేశారు. తర్వాత 10 రోజులకే.. ఆ సంఖ్యను 1.64 లక్షలకు కుదించారు. మరి ఇది మొక్కుబడి కార్యక్రమం కాక మరేంటి? మీ మొక్కుబడి పథకం మొత్తం ఖర్చే 16.4 కోట్లు.. అందులోనూ కోత విధిస్తున్నారు. కానీ దాని ప్రచారానికి చేస్తున్న ప్రకటనల ఖర్చు మాత్రం 6.4 కోట్లు. మరి దీన్నేమనాలి?  
-వైఎస్‌ జగన్‌  

మరిన్ని వార్తలు