29 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్‌

4 May, 2020 21:22 IST|Sakshi

సాక్షి, కర్నూలు: కరోనా మహమ్మారి కట్టడి​​కి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి నియంత్రణ చర్యలను చేపట్టడంతో పలువురు కరోనా బాధితులు సురక్షితంగా డిశ్చార్జ్‌ అవుతున్నారు. ల్యాబ్ సౌకర్యాల నుంచి ఐసోలేషన్‌ వార్డుల వరకూ ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన బాధితులు క్షేమంగా కోలుకుని డిశ్చార్జ్‌ అవుతున్నారు. ప్రభుత్వం అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించడంతో కరోనాను గెలిచి మరో 29 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు.

సోమవారం కర్నూలు స్టేట్‌ కోవిడ్‌ ఆసుపత్రి నుంచి 9 మంది, విశ్వభారతి జిల్లా కోవిడ్‌ ఆసుపత్రి నుంచి 20 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. డిశ్చార్జ్‌ అయినవారిలో 25 మంది పురుషులు కాగా, నలుగురు మహిళలు ఉన్నారు. వీరిలో 50 నుంచి 70 ఏళ్ల వృద్ధాప్య వయస్సుతో పాటు బీపీ, షుగర్‌, గుండె సంబంధింత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు 11 మంది కూడా కరోనాను జయించడం జిల్లా వాసులకు పెద్ద రిలీఫ్‌ కలిగించింది.

ఈ సందర్భంగా కలెక్టర్‌ వీర పాండియన్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లాలో 115 మంది కరోనా విజేతలు డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా కరోనాను గెలిచి క్షేమంగా బయటపడిన బాధితులను,వారికి సేవలందించిన వైద్యులను కలెక్టర్‌ అభినందించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ప్రకారం కల్టెకర్‌, అధికారులు కరోనా విజేతలకు ఒక్కొక్కరికి రెండువేలు నగదు అందజేసి.. ప్రత్యేక వాహనాల్లో వారి ఇళ్లకు పంపించారు.

మరిన్ని వార్తలు