293వ రోజు పాదయాత్ర డైరీ

25 Oct, 2018 03:29 IST|Sakshi

ఇప్పటి వరకూ నడిచిన దూరం : 3,209.4 కి.మీ 
24–10–2018, బుధవారం 
చప్పబుచ్చమ్మపేట, విజయనగరం జిల్లా

అమాయక గిరిజనుల కడుపుకొట్టి దోచుకోవడమన్నది ఆటవికం కాక మరేంటి?
ఈ రోజు మహర్షి వాల్మీకి జయంతి. ఆ తేజోమూర్తికి నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించాను. బాగువలస వద్ద 3,200 కి.మీ మైలురాయిని చేరుకున్నందుకు గుర్తుగా ఓ మొక్క నాటాను. అందమైన ప్రకృతి చెంతనే ఉన్నా.. అమాయక గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొండ ప్రాంతాల్లోని వారి గ్రామాలకు రహదారులే లేవు. కిందికి దిగివచ్చి నిత్యావసరాలు తెచ్చుకోవాలనుకుంటే.. ఒళ్లు హూనమైపోతోందంటూ మారేపాడు అక్కచెల్లెమ్మలు మొరపెట్టుకున్నారు. చేసిన ఉపాధి పనులకు డబ్బులే ఇవ్వడం లేదని, సంక్షేమ పథకాలేవీ అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అంగన్‌వాడీ క్రెషి వర్కర్లు కలిశారు. మూడేళ్లపాటు కొండల్లోని గిరిజన గ్రామాల్లో గొడ్డుచాకిరీ చేయించుకుని ఉద్యోగాల్లోంచి తీసేసిందీ ప్రభుత్వం.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇవ్వాల్సిన 20 నెలల జీతం కోసం తీవ్ర ఆందోళన చేయాల్సి వచ్చిందని వాపోయారు. అంగన్‌వాడీలకు సహాయకులుగా పనిచేసే లింకు వర్కర్లదీ ఇదే పరిస్థితి. సాక్షర భారత్‌ కోఆర్డినేటర్లకూ అదే జరిగింది.. జూన్‌ వరకూ పనిచేయించుకుని, మార్చి నుంచే తీసేసినట్లు నోటీసులిచ్చారట. పది నెలల జీతమూ ఎగ్గొట్టారట. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఆరోగ్య మిత్రలు, ఆదర్శ రైతులు ఇలా ఎవర్ని తీసుకున్నా.. ఉద్యోగాలు ఊడుతున్నాయన్న ఆవేదనలే. ఉద్యోగం వచ్చిందన్నవారు ఈ నాలుగున్నరేళ్లలో ఒక్కరంటే ఒక్కరూ కానరాకపోవడం విస్మయం కలిగించే విషయం.  

కాళ్లరిగేలా తిరిగినా పింఛన్‌ ఇవ్వడం లేదన్నా.. అంటూ నక్కడవలస అక్కచెల్లెమ్మలు కన్నీటిపర్యంతమయ్యారు. ఆ విధివంచిత, వితంతు అక్కచెల్లెమ్మలకు పింఛన్లు కూడా ఇవ్వకపోవడం చాలా దారుణమనిపించింది.  

సన్యాసిరాజుపేట, రామస్వామివలస, బర్నికవలస గిరిజన గ్రామాల యువకులు కలిశారు. అక్కడున్న తామరకొండే.. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ జీవమట. దానిమీద పోడు వ్యవసాయం చేసుకుంటారు. ఆ కొండమీది అటవీ ఉత్పత్తులే వారికి జీవనాధారం. అప్పట్లో నాన్నగారు అటవీ పట్టాలు కూడా ఇచ్చారట. ఆ కొండ మీద నుంచి వచ్చే పావురాయిగెడ్డ నీరే.. చుట్టుపక్కల ఉండే 35 చెరువులకు ఆధారం. దాదాపు 12 గ్రామాలకు సాగు నీరు అందించే జీవ జలమది. ఆ పావురాయిగెడ్డను మినీ రిజర్వాయర్‌గా మార్చాలని నాన్నగారు సంకల్పించారు. అట్లాంటి తామరకొండ మీద పచ్చరాబందుల కళ్లు పడ్డాయిప్పుడు. కొండలోని విలువైన గ్రానైట్‌ నిక్షేపాలను దోచుకోవాలని పన్నాగం పన్నారు. వడ్డించేవాడు మనోడైతే ఇక తిరుగేముంటుంది.. రాత్రికి రాత్రే అన్ని అనుమతులూ తెచ్చేసుకున్నారట.

సంవత్సరాల తరబడి రహదారి సౌకర్యం కల్పించాలని ప్రజలు నెత్తీనోరు కొట్టుకున్నా పట్టించుకోని వారు.. వారం రోజుల్లో కొండకు రోడ్డు వేయించుకున్నారు. కేవలం పంచాయతీ తీర్మానం చేయించుకోవడం కోసం వైఎస్సార్‌సీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ను ప్రలోభాలకు గురిచేసి పార్టీ మార్పించేశారు.. పంచాయతీ తీర్మానం చేయించుకున్నారు. ప్రజలందరూ ముకుమ్మడిగా అడ్డుకున్నా పచ్చనేతల దౌర్జన్యాలముందు ఏమీ చేయలేక నిస్సహాయులైపోయారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు.. ప్రజల మీద అక్రమ కేసులు బనాయించారట. పాలకపార్టీ నేతల దాష్టీకాలు వింటుంటే.. చాలా బాధేసింది. అన్నెంపున్నెం ఎరుగని అమాయక గిరిజనుల కడుపుకొట్టి మరీ బరితెగించి దోచుకోవడమన్నది ఆటవికం కాక మరేంటి?   
-వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు