మరణంలోనూ వీడని స్నేహం

23 Dec, 2013 02:25 IST|Sakshi
మరణంలోనూ వీడని స్నేహం
 మృత్యువు సైతం ఆ మిత్రులను విడదీయలేకపోయింది. స్నేహితులైన ఆ ముగ్గురు జీవనోపాధి కోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాకు కొన్నేళ్ల క్రితమే వలస వచ్చారు. వారిలో సురేష్‌బాబురెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరి పార్టీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ పదవి చేపట్టారు.  రావులపాలెంలో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం రాత్రి పలాస నుంచి కారులో బయలుదేరిన ఆ ముగ్గురిపై మృత్యువు పంజా విసిరింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని కారు నుజ్జునుజ్జయ్యింది. స్నేహబంధానికి ప్రతీకగా నిలిచిన వారు కలిసే మృత్యువు ఒడిలో చేరారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎప్పుడో వలస వచ్చి శ్రీకాకుళం జిల్లాలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న వీరు చివరికి తమ సొంత జిల్లాలోనే అకాల మరణం పాలవ్వడం విధి వైచిత్రికి నిదర్శనం. -
 
 ఏలేశ్వరం / మండపేట రూరల్ / పెదపూడి /పలాస, న్యూస్‌లైన్ :జీవిత ప్రస్థానంలో ఒకేమాటగా, ఒకేబాటగా ముందంజ వేసిన ఆ ముగ్గురు మిత్రులను మృత్యువు ఒక్కసారే కబళించింది. ఒకరికొకరు అండగా.. అంచెలంచెలుగా ఎదిగిన వారు అంతిమప్రస్థానంలోనూ ఒకరికొకరు తోడయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం చిన్నింపేట జంక్షన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మండపేట మండలం అర్తమూరుకు చెందిన కడియాల శ్రీనివాస్ (39), పెదపూడి మండలం జి.మామిడాడకు చెందిన తమలంపూడి సురేష్‌బాబురెడ్డి(36), వెలగల నారాయణరెడ్డి(38) మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
 
 తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్, సురేష్‌బాబురెడ్డి, నారాయణరెడ్డి పదేళ్ల కిందట శ్రీకాకుళం జిల్లా పలాసకు వలస వెళ్లారు. అక్కడ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదిగారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఇటీవల హోటల్ వ్యాపారం కూడా ప్రారంభించారు. వీరిలో సురేష్‌బాబురెడ్డి శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. రావులపాలెంలో బంధువుల ఇంట ఆదివారం జరిగే ఓ వేడుకలో పాల్గొనేందుకు శ్రీనివాస్, సురేష్‌బాబురెడ్డి, నారాయణరెడ్డితో పాటు పంచాయతీ రాజ్ శాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్ టి.నరసింహమూర్తి శనివారం రాత్రి పలాస నుంచి కారులో బయలుదేరారు. 
 
 ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో చిన్నింపేట జంక్షన్ వద్ద వీరి కారును దాటుకుని వచ్చిన గుర్తు తెలియని వాహనం అకస్మాత్తుగా కుడివైపు తిరిగింది. దీంతో వీరి కారు ఆ వాహనాన్ని ఢీకొని నుజునుజ్జయింది. శ్రీనివాస్, సురేష్‌బాబురెడ్డి అక్కడికక్కడే మరణించారు. నారాయణరెడ్డి, నరసింహమూర్తి, డ్రైవర్ ప్రసాద్‌కుమార్ మహంతి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. కారు లోంచి చేతులు బయటకు పెట్టి నరసింహమూర్తి చేస్తున్న ఆర్తనాదాలతో అక్కడకు చేరుకున్న స్థానికులు గాయపడ్డ ముగ్గురినీ 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నారాయణరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు.  
 
 మృతుడు శ్రీనివాస్‌కు భార్య గౌరి, కుమారుడు చందు, కుమార్తె రోజ్ ఉన్నారు. నారాయణరెడ్డికి భార్య శాంతిప్రియ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ప్రత్తిపాడు సీఐ రామ్మోహన్‌రెడ్డి, ఎస్సై గౌరీశంకర్, ట్రైనింగ్ ఎస్సై శంకర్ పరిశీలించారు. ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో నుజ్జయిన కారును గురైన వాహనాన్ని క్రేన్‌ద్వారా పక్కకు తొలిగించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గొల్లలమామిడాడ, అర్తమూరు గ్రామాలకు తరలించారు. 
 
 అర్తమూరు, మామిడాడ, పలాసలో విషాదం
 ఈ ఘటనతో అర్తమూరు, గొల్లలమామిడాడ, పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో విషాదం అలముకుంది. శ్రీనివాస్ మృతదేహానికి ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. 
 
 కుటుంబ సభ్యుల రోదన
 ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సురేష్‌బాబు రెడ్డి తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, జయరామ్‌చంద్రారెడ్డి, హైదరాబాద్ నుంచి సోదరి సుధారాణి  మామిడాడ చేరుకున్నారు. కుటుంబానికి పెద్దదిక్కైన కొడుకును మృత్యువు ప్రమాద రూపంలో పొట్టన పెట్టుకుందని వారు విలపించారు. నారాయణరెడ్డి భార్య, పిల్లలు  పలాస నుంచి మామిడాడ బయలుదేరారు. కొడుకు, కోడలు, మనవలతో వస్తారనుకుంటే శవమై వచ్చాడని నారాయణరెడ్డి తండ్రి బోరున విలపించారు.  
 

 

>
మరిన్ని వార్తలు