‘బంగారు తల్లి’ని బలితీసుకుంది

23 Nov, 2013 02:06 IST|Sakshi
‘బంగారు తల్లి’ని బలితీసుకుంది

 కామారెడ్డి, న్యూస్‌లైన్: ఆడబిడ్డను ఆదుకుంటామంటూ ‘బంగారు తల్లి’ పథకంపై సర్కారు ఇస్తున్న ప్రకటనలు, చేస్తున్న ప్రచారంలో ఎంతవరకు వాస్తవముందో గాని, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన ఆ తల్లిదండ్రులకు మాత్రం కడుపుకోత మిగిలింది. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన రచ్చబండ సందర్భంగా జరిగిన తోపులాటలో మూడు నెలల పసికందు మృతిచెందింది. మండలంలోని భవానీపేట తండాకు చెందిన లావుడ్య రాజు-రేణుకలకు మూడేళ్ల పాప మోక్ష ఉంది. చిన్నారిని ‘బంగారు తల్లి’ పథకంలో నమోదు చేయించేందుకు ఆ దంపతులు శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన రచ్చబండకు వచ్చారు.
 
 అధికారులకు దరఖాస్తులు అందించేందుకు రేణుక చంటిబిడ్డతో పాటు వరుసలో నిలుచుంది.  వరుసలో ఒకరినొకరు తోపులాడుకున్న సందర్భంలో రేణుక తన కూతురు మోక్షను కడుపులో దాచుకునే ప్రయత్నం చేసింది. ఊపిరాడని పరిస్థితుల్లో చిన్నారి కండ్లు తేలేయడంతో ఆందోళన చెందిన తల్లి తన కూతురు కదలడం లేదంటూ రోదించింది. వెంటనే 108 అంబులైన్స్‌లో చిన్నారిని కామారెడ్డిలోని చిన్నపిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. వైద్య సేవలు ప్రారంభించిన కొద్దిసేపటికే మోక్ష కన్నుమూసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు కళ్లముందే చనిపోవడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు.
 
 తోపులాటకు కారణం: రచ్చబండ సభ ముగిసేంత వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించకపోవడంవల్లే తోపులాట జరిగిందని పలువురు ఆరోపించారు. అధికారులు దరఖాస్తులు స్వీకరించే సమయానికి వందలాది మంది బారులు తీరారని.. మధ్యాహ్నం కావడంతో ఆకలి మంటతో ఉన్న జనం త్వరగా దరఖాస్తులు సమర్పించాలని భావించారని,  ఈ క్రమంలో తోపులాట జరిగిందని అక్కడి వారు చెబుతున్నారు.
 
 తప్పుదారి పట్టించే యత్నం
 రచ్చబండ సందర్భంగా జరిగిన తోపులాటలో ఊపిరాడక మృతి చెందిన చిన్నారి మోక్షకు గుండె సంబంధ వ్యాధి ఉందని అధికారులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వైద్యులు మాత్రం పాపకు గుండె సంబంధిత సమస్య ఉందని నిర్ధారించలేదు.
 
 అధికారులను సస్పెండ్ చేయాలి
 సాక్షి, హైదరాబాద్: రచ్చబండ సందర్భంగా చిన్నారి మృతికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
 

>
మరిన్ని వార్తలు