విషాదం అమ్మను వదిలి...

12 Sep, 2015 23:43 IST|Sakshi

 వీధి కాలువలో కొట్టుకుపోయిన 3 ఏళ్ల బాలుడు
 చెరువు వద్ద శవమై కనిపించిన వైనం
 శోకసంద్రంగా మారిన పాతగవిడి వీధి

 
 ఇంకా సరిగా నడవడం రాలేదు... అప్పుడే నాన్న చేతిని విడిచిపెట్టేశాడు. ఇంకా పలకడమే రాలేదు... అప్పుడే అమ్మ ఒడిని వదిలి వెళ్లిపోయాడు. ముద్దుముద్దు మాటలు, బుడిబుడి అడుగులతో నిత్యం ఇంటిని సందడిగా ఉంచిన ఆ బుజ్జాయి అందరినీ వదిలి వెళ్లిపోయాడు. ‘అమ్మా అని పిలవరా..’ అంటున్న తల్లి కన్నీటికి, నాన్నా లేవరా అంటున్న తండ్రి శోకానికి బదులివ్వకుండా చిన్నారి శాశ్వతంగా దూరమైపోయాడు. చీపురుపల్లిలోని పాతగవిడివీధిలో శనివారం మూడేళ్ల చిన్నారి మీసాల జయప్రకాష్ వీధి కాలువలో కొట్టుకుపోయి చనిపోయాడు. ఈ విషాద ఘటనతో ఆ వీధి శోక సంద్రమైంది. అక్కడి వారంతా విషాదంలో మునిగిపోయారు.  
 
 చీపురుపల్లి: పట్టణంలోని పాతగవిడివీధికి చెందిన మీసాల జయప్రకాష్(3) అనే బాలుడు ఇంటి ఎదురుగా ఉన్న వీధి కాలువలో పడి కొట్టుకుపోయి చనిపోయిన సంఘటన శనివారం సాయంత్రం స్థానికులను కలిచివేసింది. అంతవరకు ఆడుకుంటూ కనిపించిన జయప్రకాష్   మృతి చెందడం కుటుంబ సభ్యులతో బాటు స్థానికులకు మింగుడుపడలేదు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో పట్టణంలో దాదాపు 20 నిమిషాలు పాటు భారీ వర్షం కురిసింది. దీంతో వీధి కాలువలు భారీ స్థాయిలో ప్రవహించాయి. జయప్రకాష్ ఇంటి ఎదురుగా  పెద్ద వీధి కాలువ ఉంది. వర్షం తగ్గుముఖం పట్టడంతో చిన్నపిల్లలతో కలిసి జయప్రకాష్ కూడా ఆ కాలువ వద్ద ఆడుకుంటుండగా జారి పడిపోయాడు. దీంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువ నీటిలో కొట్టుకుపోయాడు. స్థానికులు వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో అప్పటికే అక్కడకు చేరుకున్న వార్డు మెంబరు గవిడి సురేష్ పంచాయతీ సేవకులను రప్పించి వెదికించారు. దీంతో వీధి చివరిలో ఉన్న చెరువు వద్ద బాలుడు శవమై కనిపించాడు. కాలువలో కొట్టుకుపోయిన కొడుకు సజీవంగా వస్తాడని ఎదురు చూసిన తల్లిదండ్రులకు చేదు వార్త ఎదురవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
 
 తాపీ పని చేసుకుంటూ.....
 మృతి చెందిన బాలుడు జయప్రకాష్ తండ్రి మీసాల పెంటయ్య తాపీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య తవిటమ్మ పెద్ద కుమారుడు వేదవినీత్ ఉన్నారు. కుమారుడి మరణవార్తను విని గుండెలు బాదుకుని రోదించారు. ఇంటి ముందు ఉన్న కాలువే కుమారుని పాలిట మృత్యు కుహరమవుతుందని కలలో కూడా ఊహించలేదని విలపించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇప్పిలి అనంతంలు సంఘటనా స్థలానికి చేరుకుని సంతాపం తెలియజేశారు.

 

మరిన్ని వార్తలు