కోరలు సాచిన కరోనా !

5 Apr, 2020 08:42 IST|Sakshi
గుంటూరు శ్రీనివాసరావుతోటలో  సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేస్తున్న దృశ్యం 

ఒకేరోజు 10 కేసుల నమోదు  

30కి చేరిన బాధితులు 

గుంటూరు నగరంలో అత్యధికంగా 15 కేసులు 

పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో రెడ్‌జోన్లు

సాక్షి, గుంటూరు: జిల్లాలో కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే 30 పాజిటివ్‌ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఒక్కరోజే 10 పాజిటివ్‌ కేసులు తేలడంతో సర్వత్రా కలకలం రేగుతోంది. ఒక్క గుంటూరు నగరంలోనే కొత్తగా ఏడు కేసులు నిర్ధారణం కావడంతో నగర వాసులు కలవరపడుతున్నారు. ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రజలు భయపడుతున్నారు. జిల్లాలో శనివారం పది కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 30 కేసులు నమోదైనట్లు తెలిపారు. శనివారం 47 శాంపిళ్ళు సేకరించి పరీక్షలకు పంపినట్లు పేర్కొన్నారు. ఇప్పటి  వరకు 428 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా, 326 మందికి నెగిటివ్‌గా నిర్ధారణ అయిందని, 72 శాంపిళ్ల ఫలితాల కోసం వేచి చూస్తున్నట్లు ప్రకటించారు.  ఐసోలేషన్‌లో 323 మంది ఉండగా, ఆసుపత్రి నుంచి 96 మంది డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 68 క్వారంటైన్‌ కేంద్రాల్లో 450 మంది ఉన్నట్లు, అదేవిధంగా గృహనిర్భంధంలో స్థానిక వైద్య సిబ్బంది పర్యవేక్షణలో 1249 మంది ఉన్నట్లు తెలిపారు.  (కరోనా కల్లోలం)

అదనంగా 40 క్వారంటైన్‌ కేంద్రాలు
కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు అధికార యంత్రాంగం అప్పమత్తమైంది. ప్రస్తుతం ఉన్న 28 క్వారంటైన్‌ కేంద్రాలతో పాటు అదనంగా మరో 40 క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 68 క్వారంటైన్‌ కేంద్రాల్లో 9,036 బెడ్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ కింద ఉన్న 84 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వార్డులు, బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటికితోడు జిల్లా వ్యాప్తంగా 50 పడకల పైన ఉన్న 120 ప్రైవేట్‌ ఆసుపత్రుల సేవలు వినియోగించుకోడానికి సిద్ధం చేశారు.   లోకల్‌ కాంటాక్ట్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా యంత్రాంగం అప్రమత్తమైంది.

కట్టుదిట్టమైన చర్యలు 
కరోనా వైరస్‌ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. గుంటూరు నగరంలోనే 15 కేసులు నమోదు కావడంతో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశాం. నగరంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించాం. –  ఐ.శామ్యూల్‌ ఆనందకుమార్, కలెక్టర్‌ 

మరిన్ని వార్తలు